Ranya Rao: 52 సార్లు దుబాయ్‌కు వెళ్లొచ్చిన రన్యా రావు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన నిజాలు..
ABN , Publish Date - Mar 18 , 2025 | 07:42 PM
14 కేజీల స్మగ్లింగ్ బంగారంతో రెండు వారాల క్రితం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రన్యా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించినట్టు ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలిసింది. ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది.

బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. 14 కేజీల స్మగ్లింగ్ బంగారంతో (Gold Smuggling) రెండు వారాల క్రితం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగిన రన్యా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించినట్టు ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలిసింది. ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది. (Ranya Rao Arrest).
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఈ కేసులో కీలక సమాచారాన్ని కోర్టుకు అందజేసింది. కొన్నేళ్లుగా గోల్డ్ స్మగ్లింగ్‌లో రన్యా కీలక పాత్ర పోషిస్తున్నట్టు డీఆర్‌ఐ తెలిపింది. డీఆర్‌ఐ సమాచారం ప్రకారం.. రన్యా గత రెండేళ్లలో 52 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చింది. అందులో 26 సార్లు ఆమెతో పాటు నటుడు, హోటల్ వ్యాపారి తరుణ్ రాజు కూడా ఉన్నాడు. వీరు ప్రతిసారి ఉదయం దుబాయ్‌కు వెళ్లడం, సాయంత్రానికి తిరిగి రావడం చేసేవారు. వీరి ప్రయాణ వివరాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. వీరిద్దరూ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులకు అనుమానం వచ్చింది. ముందుగా రన్యాను అరెస్ట్ చేశారు.
అనంతరం తరుణ్ రాజును కూడా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోనే బంగారంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో బెయిల్ కావాలని విజ్ఞప్తి చేస్తూ తరుణ్ రాజు కోర్టును ఆశ్రయించాడు. అతడికి బెయిల్ ఇవ్వకూడదని డీఆర్ఐ వాదించింది. కాగా, రన్యా, తరుణ్ రాజు మధ్య చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ బ్యాంకాక్, జెనీవాలోని బంగారు వ్యాపారవేత్తలతో కూడా సంబంధాలున్నాయని డీఆర్ఐ ఆరోపించింది. వారి దగ్గర బంగారు కడ్డీలను కొనుగోలు చేసి దుబాయ్ ఖాతాల ద్వారా వారికి డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు దుబాయ్‌లోని రన్యా బ్యాంక్ ఖాతాలను, కస్టమ్స్ డిక్లరేషన్ ఫామ్‌లను డీఆర్‌ఐ పరిశీలిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..