Madhya Pradesh: నర్మదా పూజతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం షురూ..!
ABN , First Publish Date - 2023-06-12T14:46:49+05:30 IST
కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారంనాడు మధ్యప్రదేశ్‌లో పర్యటించి గ్వారీఘాట్ వద్ద నర్మదా పూజలో పాల్గొన్నారు. అనంతర ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
భోపాల్: కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ (Congress) పార్టీ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)సోమవారంనాడు మధ్యప్రదేశ్‌లో పర్యటించి గ్వారీఘాట్ వద్ద నర్మదా పూజ (Narmada pooja)లో పాల్గొన్నారు. ప్రియాంక వెంట కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి జేపీ అగర్వాల్, రాజ్యసభ ఎంపీ వివేక్ తన్ఖా ఉన్నారు.
మధ్యప్రదేశ్ జీవనాడిగా భావించే నర్మదా నదికి పూజలు చేసిన అనంతరం జబల్‌పూర్ నుంచి పార్టీ ప్రచారాన్ని ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు రూ.1,500 నెలవారీ సాయం అందిస్తామని, గ్యాస్ సిలెండర్ ధరను రూ.1000 నుంచి రూ.500కు తగ్గిస్తామని, రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల బకాయిలను రద్దు చేస్తామని, 1000 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని, 200 యూనిట్ల లోపు వినియోగిస్తే సగానికి ఛార్జీలు తగ్గిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.
మూడేళ్లలో బీజేపీ ఇచ్చిన ఉద్యోగాలు 21..
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం గత మూడేళ్లలో కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, 18 ఏళ్లుగా బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, పెద్ద పెద్ద హామీలివ్వడం, వాటిని గాలికి వదిలేయడం పరిపాటైందని అన్నారు. డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వాలను తాను చాలా చూశానని, అలాంటి వారికి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని ప్రియాంక అన్నారు. మహాకేళేశ్వర్ ఆలయంలో సప్తర్షుల విగ్రహాలు కుప్పకూలడంపై మాట్లాడుతూ, దేవుళ్లను కూడా బీజేపీ లూటీ చేయడం మానడం లేదన్నారు. బీజేపీ లూటీకి మహాకాళ్ కూడా మినహాయింపు కాదన్నారు.