Share News

Farooq Abdullah: అమిత్‌షా పీఓకే వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా ఫైర్.. నువ్వింకా అప్పుడు పుట్టలేదు

ABN , First Publish Date - 2023-12-06T23:13:57+05:30 IST

పార్లమెంటులో శీతాకాల సమావేశాల సందర్భంగా.. హోంమంత్రి అమిత్ షా ‘పీఓకే’ అంశంపై చేసిన వ్యాఖ్యల మీద జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా రాజకీయమని..

Farooq Abdullah: అమిత్‌షా పీఓకే వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా ఫైర్.. నువ్వింకా అప్పుడు పుట్టలేదు

Farooq Abdullah On Amit Shah: పార్లమెంటులో శీతాకాల సమావేశాల సందర్భంగా.. హోంమంత్రి అమిత్ షా ‘పీఓకే’ అంశంపై చేసిన వ్యాఖ్యల మీద జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా రాజకీయమని.. ఆ సమయంలో అమిత్ షా అసలు పుట్టనే లేదని.. అప్పటి పరిస్థితులేంటో అతనికి తెలియవని మండిపడ్డారు. ఆ సమయంలో పూంచ్, రాజౌరీలను కాపాడేందుకు సైన్యాన్ని మళ్లించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈరోజు పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో భారత్‌లో భాగం అయ్యాయంటే.. నెహ్రూ దయ వల్లేనని, లేకపోతే అవి కూడా పాకిస్తాన్‌లో కలిసిపోయేవని పేర్కొన్నారు. అప్పటి పరిస్థితుల ప్రకారం ఇది తప్ప మరో ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు.


ప్రజలకు అమిత్ షా అబద్ధాలు చెప్తున్నారని.. కశ్మీర్ వాతావరణం గతంలో కంటే మరింత దిగజారిపోయిందని ఫరూక్ చెప్పారు. ‘‘కశ్మీర్‌‌లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అక్కడ సైన్యం, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు ఎంతమంది ఉన్నారు? ఆ సమయంలో వీళ్లెవరూ లేరు. కానీ ఇప్పుడు వీళ్లు ప్రతి చోటా ఉన్నారు’’ అని వెల్లడించారు. ఇంత భద్రత ఉన్నప్పటికీ.. మన సైనికులు ఎందుకు అమరులయ్యారు? అని ప్రశ్నించారు. నిజంగానే ఉగ్రవాదం అంతమై ఉంటే.. మన సైనికులు, ప్రజలు ఎలా చనిపోతున్నారు? అని నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాళ్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ప్రజలకు తప్పుడు సమాచారం చెప్తున్నారని మండిపడ్డారు. అలాగే.. నెహ్రూ అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆయన ఖండించారు.

ఇంతకీ అమిత్ షా ఏం చెప్పారంటే.. ఆరోజుల్లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పుల వల్లే POK సృష్టించబడిందని అన్నారు. ప్రధానంగా ఆయన రెండు తప్పులు చేశారని ఆరోపించారు. భారత సైన్యం గెలుస్తున్నప్పుడు సీజ్‌ఫైర్ ప్రకటించడం ఒక తప్పైతే.. మన అంతర్గత సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లడం మరో తప్పు అని చెప్పారు. ఈ తప్పుల కారణంగానే కశ్మీర్ కొన్నాళ్లపాటు కష్టాలు అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీన్నొక చారిత్రాత్మక తప్పిదంగానూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్ అబ్దుల్లా పై విధంగా అమిత్ షాపై ధ్వజమెత్తారు.

Updated Date - 2023-12-06T23:13:58+05:30 IST