Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:49 PM
Mamata Banerjee: సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కొల్పోయిన టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. మీ గౌరవాానికి భంగం కలగకుండా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు.

కోల్‌కతా, ఏప్రిల్ 07: సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్ ఉద్యోగాలు కొల్పోయిన వారి గౌరవాన్ని కాపాడేందుకు తాను శాయశక్తుల కృషి చేస్తానని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాను మద్దతుగా నిలుస్తానన్నారు. అర్హులైన అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలను కోల్పోవడాన్ని తాను అనుమతించనని పేర్కొన్నారు.
అయితే వీరికి మద్దతుగా నిలిచినందుకు ఎవరైనా తనను శిక్షించాలనుకొంటే.. జైలుకు వెళ్లడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆమె కుండ బద్దలుకొట్టారు. తన ప్రమేయం లేని అంశంలోకి తన పేరు లాగుతున్నారంటూ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు నిరుద్యోగులుగా మారకుండ ఉండేందు కు తమ ప్రభుత్వం వద్ద ప్రణాళికలున్నాయని ఆమె వివరించారు.
సోమవారం కోల్‌కతాల్లోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో సీఎం మమతా బెనర్జీతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి సీఎం మమతా బెనర్జీ పైవిధంగా హామీ ఇచ్చారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అయితే పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా.. న్యాయ బద్దంగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆమె వివరించారు.
2016లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ టీచర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ద్వారా 25,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు పొందారు. అయితే ఈ ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ నియామకాలు చెల్లవంటూ స్పష్టం చేసింది. అంతేకాదు.. నియామకం పొందిన నాటి నుంచి ఈ తీర్పు వెలువరించే వరకు అందుకొన్న జీతాలు సైతం వెనక్కి ఇవ్వాలని వారికి హైకోర్టు ఆదేశించింది. దీంతో ఉద్యోగాలు పొందిన వారు.. కోల్‌కతా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు సైతం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్‌లో భాగంగా నియమితులైన 25 వేల మంది టీచర్ల నియమాకాలు చెల్లవంటూ గతంలో కోల్‌కతా హైకోర్టు వెల్లడించిన తీర్పులో.. జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తమకు అనిపించడం లేదని స్పష్టం చేసింది. వారి నియమాకాలే పెద్ద మోసం అని అర్థం అవుతుందని పేర్కొంది.
కాకపోతే.. ఇలా నియమాకాలు పొందిన అభ్యర్థులు.. ఇన్నాళ్లుగా వారు పొందిన జీతాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అాయితే వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారు.. సర్వీసులో కొనసాగ వచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మూడు నెలల వ్యవధిలో ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియామక ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నియామక ప్రక్రియ, ఉద్యోగాల కేటాయింపు.. ఇలా ఎక్కడ చూసినా మోసపూరిత విధానాలే అవలంబించారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఇంకోవైపు బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. టీఎంసీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి రూ. 700 కోట్ల ముడుపులు అందుకొన్నారని ఆరోపించారు. అందుకు నిరసనగా సోమవారం సువేందు అధికారి, తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కోల్‌కతాలో నిరసన నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం'
For National News And Telugu News