Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్
ABN , First Publish Date - 2023-07-02T09:22:24+05:30 IST
రెండు నెలల నుంచి మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (Manipur Chief Minister N Biren Singh) ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు.
న్యూఢిల్లీ : రెండు నెలల నుంచి మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ (Manipur Chief Minister N Biren Singh) ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హింస చెలరేగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మే 3 న గిరిజన సంఘీభావ కవాతు జరిగినప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్ సరిహద్దుల్లో మయన్మార్ ఉందని, చైనా కూడా సమీపంలోనే ఉందని తెలిపారు. సరిహద్దుల్లో దాదాపు 398 కిలోమీటర్ల వరకు ఎటువంటి రక్షణ లేదన్నారు. మన సరిహద్దుల్లో భద్రతా దళాలను మోహరించామని, ఎంత పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించినప్పటికీ ఇంత సువిశాల ప్రాంతాన్ని కట్టుదిట్టంగా భద్రత పరిధిలోకి తేవడం సాధ్యం కాదని చెప్పారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఇదంతా ముందస్తు ప్రణాళికతోనే జరుగుతున్నట్లు కనిపిస్తోందని, అందుకు కారణం తెలియదని చెప్పారు. ఈ విషయాన్ని పూర్తిగా నిరాకరించలేమని, అలా అని దృఢంగా చెప్పలేమని అన్నారు.
రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాను కుకీ సోదర, సోదరీమణులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడానని చెప్పారు. క్షమించి, మర్చిపోదామని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) మణిపూర్లో పర్యటించడం గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఎటువంటి సమయంలో ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ ఎజెండాతో జరుగుతున్నట్లు కనిపిస్తోందన్నారు. 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, గతంలో ఆయన ఎందుకు రాలేదని, ఇప్పుడే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ నాయకుడని, ఏ హోదాలో ఆయన ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు. ఆయన పర్యటించిన సమయం సరైనదని తాను భావించడం లేదన్నారు. ఆయన వచ్చిన తర్వాత మార్కెట్లో ఓ సంఘటన జరిగిందన్నారు. బీజేపీ కార్యాలయంపై దాడి జరిగిందని చెప్పారు. ఆయన రాజకీయంగా మైలేజ్ పొందడానికి వచ్చారా? రాష్ట్రం కోసం వచ్చారా? అని నిలదీశారు. ఆయన పర్యటించిన తీరును తాను సమర్థించనని తెలిపారు.
మే 3 నుంచి మెయిటీలు, కుకీల మధ్య జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి :
‘కోడ్’పై మౌనం పాటించండి : షాహీ ఇమామ్
Rajinikanth: అరుణాచలేశ్వరుడి సన్నిధిలో రజనీకాంత్