'Neerakshi': సముద్రాల్లో మందుపాతరల్ని గుర్తించే ‘నీరాక్షి’!
ABN , First Publish Date - 2023-07-29T02:20:04+05:30 IST
సముద్రాల అడుగున మందుపాతరల్ని గుర్తించే స్వతంత్ర మానవరహిత వాహనం(ఏయూవీ) ‘నీరాక్షి’ని డీఆర్‌డీవో, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ), ఏరోస్పేస్ ఇంజనీర్స్(ఏఈపీఎల్) సంస్థలు శుక్రవారం లాంచ్ చేశాయి.

కోల్‌కతా, జూలై 28: సముద్రాల అడుగున మందుపాతరల్ని గుర్తించే స్వతంత్ర మానవరహిత వాహనం(ఏయూవీ) ‘నీరాక్షి’ని డీఆర్‌డీవో, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్‌ఎస్‌ఈ), ఏరోస్పేస్ ఇంజనీర్స్(ఏఈపీఎల్) సంస్థలు శుక్రవారం లాంచ్ చేశాయి. జీఆర్‌ఎస్‌ఈ ప్రభుత్వ నౌక నిర్మాణ సంస్థ కాగా, ఏఈపీఎల్ ఒక సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమ. ఇరు సంస్థలు కలిసి ఏయూవీని అభివృద్ధి చేశాయని అధికారులు తెలిపారు.
మున్ముందు రోజుల్లో దేశ అవసరాలకే కాక అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల్ని సైతం భారత్ అభివృద్ధి చేస్తుందని డీఆర్‌డీఓ చైర్మన్ సమీర్ వి కామత్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఒక భారీ షిప్‌యార్డ్, ఒక ఎంఎ్‌సఎంఈతో భాగస్వామ్యం కావడం, నీరాక్షి వంటి ఒక ఉపయుక్తమైన ఉత్పత్తిని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు ఇలాంటి మరెన్నో భాగస్వామ్యాలకు ఇది తొలి అడుగు’’ అని కామత్ పేర్కొన్నారు. ఏయూవీకి వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది మధ్యకాలంలో పరీక్షలు పూర్తిచేస్తామని జీఆర్‌ఎ్‌సఈ లిమిటెడ్ చైర్మన్ పీఆర్ హరి తెలిపారు. ‘‘నేవీ, కోస్ట్ గార్డు, సైన్యం దీన్ని పరీక్షించనున్నాయి. ఆ తర్వాత వాణిజ్యపరంగానూ లాంచ్ చేస్తాం. మందుపాతరల్ని గుర్తించడంతోపాటు వాటిని తొలగించేందుకు కూడా మున్ముందు నీరాక్షిని వినియోగించుకోవచ్చు’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి పౌర స్మృతిపై 75లక్షలకుపైగా సలహాలు
న్యూఢిల్లీ, జూలై 28: ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ)పై అభిప్రాయాలు చెప్పాలన్న లా కమిషన్ వినతికి భారీగా స్పందన లభించింది. శుక్రవారం గడువు ముగిసేనాటికి 75 లక్షలకుపైగా సలహాలు అందాయి. వీటిలో సుమారు మూడు లక్షలకు రాష్ట్రపతి పేరున, మరో రెండు లక్షలు ప్రధాని పేరున వచ్చాయి. వీటన్నింటినీ అధ్యయనం చేసి ముసాయిదాను రూపొందించనుంది. యూసీసీపై అభిప్రాయాలు చెప్పాలంటూ లా కమిషన్ జూన్ 14న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు గడువును మరో 15 రోజులు పొడిగించగా, అది కూడా శుక్రవారం ముగిసింది.