Wrestlers medal immersion Row: క్రీడామంత్రి తొలి స్పందన ఏమిటంటే..?

ABN , First Publish Date - 2023-05-31T18:06:16+05:30 IST

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనలు హోరెత్తిస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగలో కలపాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పోలీసులు తమ విచారణ పూర్తి చేసేంతవరకూ రెజర్లు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు.

Wrestlers medal immersion Row: క్రీడామంత్రి తొలి స్పందన ఏమిటంటే..?

న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనలు హోరెత్తిస్తున్న రెజ్లర్లు (Wrestlers) తమ పతకాలను (Medals) గంగలో కలపాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తొలిసారి స్పందించారు. ఢిల్లీ పోలీసులు తమ విచారణ పూర్తి చేసేంతవరకూ రెజర్లు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. రెజ్లర్లు తీసుకునే చర్య వల్ల క్రీడలు, రెజ్లర్లు కావాలనకునే వారి ఆకాంక్షలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. క్రీడలు, క్రీడాకారులకు తాము సానుకూలమని చెప్పారు. రెజ్లర్లు తమ ఆందోళనను ఉధృతం చేస్తూ పతకాల నిమజ్జానికి హరిద్వార్ చేరుకోవడం, రైతు నాయకుల జోక్యంతో ఐదు రోజుల పాటు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేందుకు వారు అంగీకరించిన క్రమంలో కేంద్ర మంత్రి స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనికి ముందు, అనురాగ్ ఠూకూర్ మే 14న రెజర్లు తమ ఆందోళన విరమించుకోవాలని, శాంతిభద్రతలపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ఢిల్లీ పోలీసులు స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారని చెప్పారు. ''కమిటీ ఏర్పాటైంది. రెజ్లర్ల ఆందోళనను కమిటీ వింటుంది. రోజువారీ విచారణలు కూడా మొదలయ్యాయి'' అని హమీర్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

నేరనిరూపణ జరిగితే ఉరికి కూడా సిద్ధం: బ్రిజ్ భూషణ్

లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకునేందుకు తాను సిద్ధమని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ ప్రకటించారు. గంగానదిలో మెడల్స్ నిమజ్జనం చేసినంత మాత్రాన తనకు ఉరిపడదని అన్నారు. రెజ్లర్ల దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కోర్టుకు సమర్పించవచ్చని, అప్పుడు ఏ శిక్ష వేసినా తాను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

పోలీసుల వాదన..

కాగా, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌ను అరెస్టు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు ఇంతవరకూ లేవని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎలాంటి సపోర్ట్ ఎవిడెన్స్ కూడా తమ దృష్టికి రాలేదని, 15 రోజుల్లో కోర్టుకు నివేదిక సమర్పిస్తామని, అది ఛార్జిషీటు రూపంలో కానీ, తుది నివేదిక రూపంలో కానీ ఉంటుందని తెలిపారు.

Updated Date - 2023-05-31T18:06:16+05:30 IST