Tripura Elections: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డే...
ABN , First Publish Date - 2023-02-15T19:41:49+05:30 IST
ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల (Tripura Assembly polls) పోలింగ్ గురువారం జరగనుంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల (Tripura Assembly polls) పోలింగ్ గురువారం జరగనుంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టు చీఫ్ ఎలక్టోరల్ అధికారి (CEO) గిట్టె కిరణ్‌కుమార్ దినకర్‌రావు తెలిపారు. 60 అసెంబ్లీ స్థానాలకు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 4 గంటలకు ముగుస్తుంది. ఇందుకోసం 3,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటిలో 1,100 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా, 28 బూత్‌లను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని సీఈఓ చెప్పారు. 31,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 25,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందితో పాటు 31,000 మంది రాష్ట్ర సాయుధ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం మోహరించినట్టు చెప్పారు.
కాగా, ముందుజాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా నిషేధ ఆజ్ఞలు ఇప్పటికే అమల్లోకి తెచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలకు బయట నుంచి ఎవరూ ప్రయత్నించకుండా చూసేందుకు అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దులను సీల్ చేశారు.
ఈ ఎన్నికల్లో 20 మంది మహిళలతో సహా 259 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 13.53 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి మాణిక్ సహా బీజేపీ అభ్యర్థిగా బార్డోవలి టౌన్ నుంచి, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ బీజేపీ టిక్కెట్‌పై ధన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగా సబ్రూమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్‌టీ ఆరు నియోజకవర్గల్లో ఆరు నియోజకవర్గాల్లో పోటీలో ఉంది. సీపీఏం 47 స్థానాల్లోనూ, దాని భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ 13 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నారు. త్రిపుర రాజవంశీయుడు ప్రద్యోత్ మాణిక్య దేబ్ బర్మ నూతనంగా ఏర్పాటు చేసిన తిప్ర మోతా పార్టీ 42 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 28 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. బీజేపీ అత్యధికంగా 12 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. గ్రేటర్ తిప్ర ల్యాండ్ స్టేట్‌హుడ్ డిమాండ్‌పై తిప్ర మోతా పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది.