MahaShivRatri: మహా శివరాత్రి పర్వదినం వస్తోంది కదా.. ఈ విషయం తెలుసా మరి..!
ABN , First Publish Date - 2023-02-12T12:33:53+05:30 IST
ఈ లింగాష్టకాన్ని అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే వుంటారు. శివలింగ మహిమను తెలియచెప్తుందీ స్తోత్రం. ఆరాధన విషయంలో ఇతర దేవతలకన్నా శివుడికి ఓ ప్రత్యేకత ఉంది.
ఫిబ్రవరి 18: శివరాత్రి
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగం..
ఈ లింగాష్టకాన్ని అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే వుంటారు. శివలింగ మహిమను తెలియచెప్తుందీ స్తోత్రం. ఆరాధన విషయంలో ఇతర దేవతలకన్నా శివుడికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే శివుడిని మూర్తిరూపంలోనూ లింగ రూపం లోనూ పూజించటం. శివలింగ పూజ విశిష్టత లింగ మహాపురాణం మొదటి అధ్యాయంలో సంపూర్ణంగా కనిపిస్తుంది.
శివాలయాలలో పూజకోసం వెళ్లినప్పుడు శివలింగం కనిపిస్తూంటుంది. ఇదేమిటి మిగిలిన దేవతలంతా వారి వారి రూపాలలో ఉంటే ఇక్కడ ఈ లింగం మాత్రమే ఉందేమిటి అని తెలియని వారు అనుకోవచ్చు. అయితే మూర్తి కన్నా ఎక్కువ విశేషాలు లింగ రూపంలోనే ఉన్నాయి.
త్రిమూర్తి స్వరూపం.. శివలింగం
శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పీఠం, దానిపైన లింగం అమరి ఉంటుంది. ఆ పీఠం మామూలు పీఠం కాదు. అది బ్రహ్మ దేవుడికి ప్రతిరూపం. ఆ పీఠం మీద కొద్దిగా విశాలంగా పానవట్టం ఉంటుంది. అది విష్ణువుకు ప్రతిరూపం. దానిమీద లింగం ఉంటుంది. అది శివుడికి ప్రతీక. ఇప్పుడు మొత్తం పీఠం కింది నుంచి పైదాకా చూస్తే పీఠంలో బ్రహ్మదేవుడు, దానిపైన ఉండే పాన వట్టంలో విష్ణువు, దానిపైన ఉండే లింగంలో శివుడు ఉంటారని గ్రహించాలి. ఇలా ముగ్గురు ప్రధాన దేవతలు ఒకచోట కలిసి ఉండే స్థానం కనుకనే శివలింగానికి అంతటి గొప్పదనం వచ్చింది. సాలగ్రామాల పూజకంటే, ఇతర దేవతామూర్తుల పూజకంటే శివలింగ పూజ అందుకే గొప్పదవుతుంది. శివలింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులేకాక శక్తికూడా నిండి ఉంటుంది. ఆ శక్తి పానవట్టం కింది పీఠంలో ఉంటుంది. పైన శివలింగంలో శివుడుంటాడు. ఈ కోణంలో చూస్తే శివశక్తి స్వరూపంగా శివలింగం దర్శనమిస్తుంది. అందుకేశివుడి విషయంలో మూర్తి పూజకంటే లింగార్చననే అనంత ఫలప్రదమని వైవాగమాలు, మహా భారతంలాంటి ఇతిహాస, పురాణాలు వివరించి చెబుతున్నాయి. అలాగే అకారం, ఉకారం, మకారంతో కూడిన ప్రణవాత్మకం శివలింగం. ఇదే స్థూల, సూక్ష్మ పరాత్పరాల కలయికగా కూడా ఉంటుంది. ఈ శివలింగానికి రుగ్వేదం ముఖంగానూ, సామవేదం నాలుకగానూ, యజుర్వేదం కంఠంగానూ, అధర్వణ వేదం హృదయంగానూ ఉంటాయి.
సృష్టి అంతా లింగ స్వరూపమే..
శివలింగం సామాన్యమైనది కాదు. రజో గుణంతో బ్రహ్మదేవుడై, సత్వగుణంతో విష్ణువై, తమోగుణంతో రుద్రుడై సృష్టి, స్థితి, లయలకు ఆధారమై ఉంటుంది. అందుకే తనవిషయంలో లింగరూపాన్నే పూజించమని శివుడు అనేక సందర్భాలలో స్వయంగా వివరించినట్టు కూడా పురాణాలలో కనిపిస్తుంది. లింగం అని అంటే గుర్తు అని అర్థం. శివలింగం శివుడికి గుర్తు. ఆ గుర్తుతోనే శివుడు విష్ణువుకు, బ్రహ్మకు చాలా చోట్ల జ్ఞానోదయాన్ని కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లింగం అనే నిరాకార స్వరూపం జ్యోతిర్లింగాలు, వాయులింగాలుగా శివుడు అవతరించి భక్తులను అనుగ్రహించిన సందర్భాలు కోకొల్లలు.
అసలీ సృష్టి అంతా లింగ స్వరూపమే. పద్నాలుగు లోకాల ప్రపంచమంతా ఒక పెద్ద శివలింగంలాంటిది అని లింగపురాణం వివరిస్తోంది.
బిందునాదాత్మకం..
ఈ జగత్తంతా శివశక్త్యాత్మకమని అంటుంటారు. అలాంటి ఈ జగత్తులోబిందువు శక్తి అని, నాదమే శివుడని వివరించిచెబుతోంది శివమహాపురాణం. బిందువైన శక్తి నాదమైన శివుడిని ఆధారంగా చేసుకొని ఉంటుంది. అయితే జగత్తు అంతా బిందువును అవలం బించి ఉంటుంది. అలా చూసినట్లైతే బిందు నాదాలు రెండూ ఈ జగత్తుకంతటికీ ఆధారమని అనిపిస్తుంది. ఇక ఈ బ్రహ్మాండ మంతా ఓ పెద్ద శివలింగమే అని అను కొన్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది శక్తి, శివుడు అని ఇట్టే తెలుస్తుంది. బిందు నాదాల వల్లనే జన్మపరంపరలు ఏర్పడు తుంటాయి. అందుకే జన్మనివృత్తి కలగాలంటే శివలింగాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో అభిషేకి స్తుండాలి. బిందు స్వరూపిణి అయిన దేవి తల్లి అని, నాదస్వరూపుడైన శివుడు తండ్రి అని భావించి తల్లిదండ్రుల స్వరూపమైన శివ లింగాన్ని ఆరాధించాలి. శివలింగాన్ని పూజిం చటంతో పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది. శివలింగ పూజవల్ల ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అనంత ఆనందాన్ని ప్రాప్తింపచేస్తాడు. జీవన్ముక్తిని కోరుకొని పునర్జన్మ రాహిత్యాన్ని కాంక్షించేవారు శివలింగాన్ని ఆరాధించటమే మేలు.
ఎంతో గొప్ప పుణ్యఫలం
షడ్లింగం లేదా మహాలింగం అనేలింగార్చన ఎంతో గొప్ప పుణ్యఫలితాన్ని ఇస్తుంది. ఇంతకీ ఈ షడ్లింగం లేదా మహాలింగమంటే ఏమిటి? అనేదానికి వైవాగమం వివరణనిస్తోంది. ప్రణవం లేదా ఓంకారాన్నే షడ్లింగమని, మహా లింగమని అంటారు. ఓంకారంలో మిళితమై ఉన్న అకారాన్ని ఆచారలింగం అని, ఉకారాన్ని గురులింగమని, మకారాన్ని శివలింగమని, బిందువును చరలింగమని, నాదాన్ని ప్రసాద లింగమని అంటారు. అకార, ఉకార, మకార, బిందునాదాలు కలిసిన ప్రణవాన్ని మహా లింగమని అంటారు. అలాగే మరికొందరు ఉకారాన్ని చరలింగమని, మకారాన్ని ప్రతిష్టిత యంత్రలింగమని, బిందులింగమని, నాద లింగమని ఈ వరుసలో అకార, ఉకార, మకార బిందునాదాల కలయికతో ఏర్పడిన ప్రణవాన్ని (ఓమ్) కారాన్ని ధ్వని లింగమని అంటారు. శైవ సంప్రదాయంలో శాంభవ దీక్ష తీసుకున్న వారు షడ్లింగ, మహాలింగ లేదా ధ్వని లింగ మనే ప్రణవాన్ని పంచాక్షరి మంత్రంతో కలిపి జపం చేస్తే జీవన్ముక్తి లభిస్తుందన్నది సాధకుల మాట.
నివేదన
ఆవుపాలు, ఆవు పాలతో తయారైనపెరుగు, తేనె, నెయ్యి, పంచదార అనే పంచామృతాల తోనూ, చెరకు రసంతోనూ శివ లింగాన్ని అభిషేకించాలి. ఆవుపాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శివుడికి చేసే పూజ, అభిషేకాలన్నీ ఓంకారాన్ని జపిస్తూ చెయ్యాలి. ఈ పదార్థాలే కాక ఇంకా ఒక్కో కామ్య సిద్ధికి ఒక్కో పదార్థంతో అభిషేక నివేదనలున్నట్టు శివ, లింగ పురాణాలు పేర్కొంటున్నాయి.
- శ్రీమల్లి, 98485 43520.