Share News

HCU Land Issue: యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా ముట్టుకోం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Apr 01 , 2025 | 09:37 PM

HCU Land Issue: కంచె గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని స్పష్టం చేశారు.

HCU Land Issue: యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా  ముట్టుకోం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Government

హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ నుంచి గుంచుకున్నట్లు ప్రచారం జరుగుతోందని.. వాస్తవాలు ప్రజలకు తెలియాలని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.


2004లో 400ఎకరాలను ఐఎంజీ భారత్‌కు అప్పటి ప్రభుత్వం అప్పగించిందని మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దానికి బదులుగా అప్పటి ప్రభుత్వం గోపన్‌పల్లిలోని 397 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చిందని గుర్తుచేశారు. బిల్లీ రావుకు చెందిన ఐఎంజీ భారత్ అనే ఫ్రాడ్ కంపెనీకి ఇచ్చిన భూ ఒప్పందాన్ని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ఆ సంస్థ కోర్టుకు వెళ్లగా.. ప్రజల ఆస్తి ప్రజలకే ఉండాలని ప్రభుత్వం పోరాటం చేసిందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం కొట్లాడి కేసు గెలిచిందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.


ఆ విలువైన భూమిని కాపాడామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ భూమిని రెవెన్యూ విభాగానికి, టీజీఐఐసీకి అప్పగించామని..దీన్ని ఎవరైనా అభినందించాలని తెలిపారు. అక్కడకు అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇందులో ప్రభుత్వ స్వార్థం ఏమి లేదని చెప్పారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా తాము ముట్టుకోమని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆ యూనివర్సిటీతో తమకు కూడా అనుబంధం ఉందని గుర్తుచేశారు. 400ఎకరాలను కాపాడి తాము ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. కొంతమంది వ్యక్తుల కోసం ఆస్తిని తాకట్టు పెట్టమని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


ఇందిరాగాంధీ హయాంలోనే హెచ్‌సీయూ ఏర్పాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Pongulati-srinivas-reddy.jpg

కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై రెండు ప్రతిపక్ష పార్టీల నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఫెవికాల్ బంధం ఉన్న ఆ రెండు పార్టీలకు అక్కడ హై రైజ్ భవనాలు కడితే పర్యావరణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆనాడు ప్రభుత్వ పెద్దలు ఆ భూమిని కొట్టేయాలని చూశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.


తాము కొట్లాడి ప్రభుత్వ స్వాధీనం చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అటవీ ప్రాణులకు అక్కడ నష్టం జరిగిందా.. ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపిద్దామని సవాల్ విసిరారు. హరగోపాల్, నరసింహా రెడ్డి వంటి ప్రొఫెసర్లు, పర్యావరణ వేత్తలు అక్కడి పరిస్థితి తమకు వివరించారని గుర్తుచేశారు. హెచ్‌సీయూ భూమి ఇంచు తగ్గకుండా దానికే టైటిల్ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. విద్యార్థుల ముసుగులో కొందరు అరాచకం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. హెచ్‌సీయూ ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ హయాంలోనేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు.


ఆ భూములపై అపోహలు సృష్టిస్తున్నారు: మంత్రి శ్రీధర్ బాబు

DUDDILLA-SRIDHAR-BABU-MLA.jpg

కంచె గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూములపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. సర్వే నంబర్ 25లోని 400ఎకరాల భూమి రెండు దశాబ్దాలుగా న్యాయ పోరాటంలో ఉందని తెలిపారు. హెచ్‌సీయూ నుంచి ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలతో సంబంధాలు ఉన్న సంఘాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.


తాము పని చేయకుండా వారు అడ్డు తగులుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. రిజిస్ట్రార్‌తో తాము సంప్రదింపులు కూడా చేశామని గుర్తుచేశారు. రెండు రోజులుగా కొన్ని పార్టీల నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సహజసిద్ధ రాతి నిర్మాణాలు, పీకాక్ లేక్, లేక్‌లను కాపాడుకుంటూనే రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని తేల్చిచెప్పారు. న్యాయ పోరాటం చేసి ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చామని.. దీన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని హితవు పలికారు. విద్యార్థులు పార్టీల ప్రేరేపణకు దూరంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 09:48 PM