MahaShivratri 2023: ఓంకారం అతని స్వరూపం.. ఈరోజున శివనామాన్ని జపిస్తే.. !

ABN , First Publish Date - 2023-02-18T10:29:03+05:30 IST

తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో అతని శరీరం శిల వలె ఉండడం వల్ల మృగాలు వచ్చి ఆ రాతికి ఒంటిని రుద్దుకునేవి.

MahaShivratri 2023: ఓంకారం అతని స్వరూపం.. ఈరోజున శివనామాన్ని జపిస్తే.. !
MahaShivratri 2023

"శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే"..

శివకేశవుల్లో ఏకత్వాన్ని తెలిపే పవిత్ర క్షేత్రాల్లో ఈ మహా శివరాత్రి రోజున విశేషపూజలు, అభిషేకాలు జరుగుతాయి. 'శివస్య హృదయం విష్ణుర్విర్ణోశ్చ హృదయం శివః' అన్నారు. శివుని రూపమే విష్ణువు. విష్ణురూపమే శివుడు. ఇద్దరికీ బేధం లేదనేది శాస్త్ర ఉవాచ. కోరిన కోర్కెలను ఈడేర్చే భోళాశంకరుని ఈ శివరాత్రి పర్వదినాన స్మరించుకుంటూ, పుష్పం, ఫలం, తోయం సమర్పించుకున్నా చాలు ఆ దేవ దేవుని అనుగ్రహం పొందినట్టే.. ఇంకా ఓపిక ఉండి, స్వామిని స్మరిస్తూ రాత్రికి జాగరణ చేయడం వల్ల సర్వ సుఖాలు కలిగి దుఃఖం దరిచేరదని పురాణాలు చెపుతున్నాయి.

ఈ పర్వ దినాన పరమ శివ భక్తులైన మార్కండేయుడిని, భక్త కన్నప్పను స్పరించుకోవాలి.. ఈ సందర్భంగా.. ఒకరు శివుని ఆరాధించి ధీర్ఘాయువు పొందితే.. ఇంకొకరు అజ్ఞానాన్ని పొగొట్టుకుని పరమ భక్తునిగా మారాడు. ఈకథలు అందరికీ తెలిసినా ఈ పర్వదినాన తలుచుకుంటే భక్తకోటికి పుణ్యం పురుషార్థం దక్కుతాయి.

మార్కండేయుడు (Markandeya)...

మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగాలు వచ్చి ఆ రాతికి ఒంటిని రుద్దుకునేవి. మృగముల కండూయాన్ని తీర్చిన వాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారికున్న లోటల్లా సంతానం లేకపోవడమే. పుత్రులు లేకపోతే స్వర్గప్రాప్తి కలుగదమని వారణాశికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరాడు. వారణాశిలో రెండు లింగాలను ప్రతిష్టించి, ఘోర తపస్సు చేసి మహాదేవుని మెప్పించి కుమారుడు కావాలనే వరం కోరాడు. అయితే శివుడు పరీక్షచేయతలచి సద్గుణుడైన 16ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణాలతో చిరంజీవైన కుమారుడు కావాలా అని ప్రశ్నించగా మృకండ మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ళ కుమారుడు చాలంటాడు. మహా దేవుడు అదే వరాన్ని ఇచ్చి అదృశ్యమవుతాడు.

ఆ పుత్రునికి మార్కండేయుడు అనే నామకరణం చేశారు. 7 సంవత్సరాల 3 నెలలు నిండిన వెంటనే ఉపనయనం చేశారు. సప్తబుుషులు ఒకమారు మృకండ మహర్షిని చూడడానికి వస్తారు. మార్కండేయుడు వారికి నమస్కరించగా చిరంజీవి అని దీవిస్తారు. అది చూసిన తండ్రి మృకండుడు ఆశ్చర్యంగా తన కుమారుడికి ధీర్ఘాయువు ఉన్నదా అని ప్రశ్నిస్తాడు. దానికి సప్తబుుషులు జరిగిన కథ తెలుసుకుని మార్కండేయునికి ధీర్ఘాయువు శివుని చేతిలోనే ఉన్నదని చెప్పి వెళిపోతారు.

16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకర్లుని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవాడివి. నీ తండ్రి పుత్రుడిన్ని కోరుకోమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు. ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నాడు. అలా తనయందు భక్తి శ్రద్ధలతో ఉన్న భక్తుల్ని శివుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు.

భక్త కన్నప్ప(bhakta kannappa)..

భక్త కన్నప్ప( bhakta kannappa) గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు. శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు. ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి రక్తం కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు పూర్వ జన్మలో అర్జునుడు అనే (కిరాతార్జునీయం) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు.

Updated Date - 2023-02-18T10:39:03+05:30 IST