Nirmala Devi: సహజ యోగ క్షేత్రం... కబెల్లా

ABN , First Publish Date - 2023-02-23T23:00:54+05:30 IST

సహజ యోగులందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైన సందర్శించాల్సిన ప్రదేశం... శ్రీమాతాజీ నిర్మలాదేవి నివాసస్థలం, పుణ్య క్షేత్రం... కబెల్లా. ఇది ఇటలీలో ఉంది.

Nirmala Devi: సహజ యోగ క్షేత్రం... కబెల్లా

సహజ యోగులందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైన సందర్శించాల్సిన ప్రదేశం... శ్రీమాతాజీ నిర్మలాదేవి నివాసస్థలం, పుణ్య క్షేత్రం... కబెల్లా. ఇది ఇటలీలో ఉంది. అక్కడ ఉన్న భవనంలో... ప్రత్యేకించి వేసవికాలంలో... 2011 ఫిబ్రవరి 23న మహా సమాధి అయ్యే వరకూ, సుమారు పద్ధెనిమిదిన్నర ఏళ్ళకు పైగా శ్రీమాతాజీ గడిపారు. ఇంతకీ కబెల్లా విశిష్టత ఏమిటి?

ఇటలీ దేశంలోని కబెల్లా లిగోరె పట్టణం... ఆపెన్నినో, పైమోంత్సే లిగుర్‌ పర్వతాల మధ్య... బార్బెరా, లియసా అనే రెండు నదులు సంగమించిన ప్రదేశంలో ఉంది. కొన్ని వేల ఏళ్ళ కిందట... రోమన్‌ సామ్రాజ్య స్థాపనకు ముందే... ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు దేవీ ఆరాధన చేసేవారని తెలుస్తోంది. పంతొమ్మిదో శతాబ్దం నాటికి అక్కడ సుమారు మూడువేల మంది నివసించేవారు. ఆ పట్టణం అందరికీ అందుబాటులో, చాలా గ్రామాలకు అనుసంధానంగా ఉండేది. ఈ కారణంగానే కబెల్లా లిగోరె అన్ని రకాల జీవన వృత్తులకూ అనుకూలంగా పేరుపొందింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగాక కూడా... 1960, 70ల వరకూ ప్రశాంత గ్రామీణ వాతావరణమే అక్కడ ఉండేది. అయితే పారిశ్రామికీకరణ వేగవంతం కావడంతో... అట్టడుగు వర్గాల ప్రజలు వివిధ పట్టణాలకు వలస వెళ్ళారు. దాంతో 1981 నాటికి కబెల్లా పట్టణ జనాభా 981కి పడిపోయింది.

Cablla2f.jpg

రాజుల నుంచి యోగుల వరకూ...

కబెల్లా అంటే కాసా బెల్లా... ‘సుందరమైన ఇల్లు’ అని అర్థం. శ్రీమాతాజీ నివసించిన బంగళా... పలాజో డోరియో. దీన్ని 1313లో అప్పటి రోమన్‌ చక్రవర్తి ఏడో హెన్రీ నిర్మించాడని చరిత్ర చెబుతోంది. తరువాత అది అనేకమంది ప్రభువులు, సామంతరాజుల ఆధీనంలో ఉంది. 1797లో ఉత్తర ఇటలీ... ఫ్రెంచి వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. నెపోలియన్‌ ఏజెంట్‌ ఒకరు ఈ ప్రాంతాన్ని రిపబ్లిక్‌ ఆఫ్‌ జెనోవాలో కలిపేశాడు. అప్పటినుంచి కబెల్లాను ‘కబెల్లా లిగూర్‌’గా పిలవడం ఆరంభించారు. అనంతరం కబెల్లాలోని క్యాజిల్‌లో దాదాపు వందేళ్ళు ఎవరూ లేరు. 1893లో లిగియో మాగియానీ అనే అధికారి దీన్ని కొని, కొన్నాళ్ళకు ప్రొఫెసర్‌ మేరియో అనే డాక్టర్‌కు అమ్మేశారు. ఆ ప్రొఫెసర్‌ ఈ భవనానికి పూర్వవైభవం తీసుకువచ్చారు. రెండో ప్రపంచయుద్ధంలో.. జెనోవాలోని ఒక అనాథ శరణాలయం మీద బాంబులు పడినప్పుడు... అక్కడ ఉన్న బాలికలకు ఈ భవంతిలో ఆశ్రయం ఇచ్చారని తెలుస్తోంది. అలా ఎన్నో చేతులు మారిన ఈ భవనాన్ని శ్రీ మాతాజీ 1991లో కొన్నారు. 2006లో ‘సహజ యోగ వరల్డ్‌ ఫౌండేషన్‌’కు విరాళంగా ఇచ్చారు.

చైతన్య తరంగాల అనుభూతి

శ్రీమాతాజీ మొదటిసారిగా 1991లో ఇటలీని సందర్శించారు. ఆమె భర్త శ్రీవాత్సవ పదవీ విరమణ చేశాక... మిలాన్‌, జెనోవాల మధ్యలో ఎక్కడైనా నివాస యోగ్యంగా, నిర్వహించుకోవడానికి వీలుగా ఉండే ఒక భవనాన్ని కొనాలనుకున్నారు. ఈ క్రమంలోనే ‘పలాజో డోరియో’ (ఇప్పుటి కబెల్లా క్యాజిల్‌)ను చూశారు. వెంటనే దాన్ని ఆమె కొని, మరమ్మతుల కోసం కొందరు సహజ యోగులను కబెల్లాకు పంపారు. మొదటిసారి ఆ భవనంలోకి శ్రీమాతాజీ, ఇతర సహజయోగులు ప్రవేశించినప్పుడు... లోపల అంతా మసిపట్టి, కొన్ని గదుల్లో మూలమూలలా బూజులతో చాలా దయనీయంగా ఉంది. శ్రీ మాతాజీ కారు వెళ్ళడానికి కూడా సరైన రోడ్డు లేకపోవడంతో. ఆమె నడిచే భవంతిని చేరుకున్నారు. చూట్టూ పచ్చటి, రమణీయమైన కొండల సౌందర్యం తప్పితే... ఆ భవనం అవసాన దిశలో ఉంది. పై కప్పు మీద చిత్రించిన పెయింటింగ్స్‌ ఊడిపోయే దశలో ఉన్నాయి. చెక్కతో చేసిన గచ్చు బీటలు వారింది. అది చూసి, ఆమెతో వెళ్ళినవారు ‘‘శ్రీమాతాజీ! ఇది ఇంత దూర ప్రాంతంలో ఉంది. ఇక్కడకు ఎవరొస్తారు?’’ అని అడిగారు. ‘‘ఈ ప్రదేశం వెదజల్లుతున్న వైబ్రేషన్స్‌తో నేను తడిసిపోతున్నాను. ఈ స్థలం గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే వైబ్రేషన్స్‌ను గమనించండి’’ అని ఆమె చెప్పారు. వారు తమ చేతుల్ని పరిశీలించుకొని, చైతన్య తరంగాలను అద్భుతంగా అనుభూతి చెందారు. ‘‘రాబోయే రోజుల్లో సుమారు యాభై అయిదు దేశాల నుంచి వచ్చే సహజ యోగులకు ఆతిథ్యం ఇవ్వబోతున్నది ఇక్కడి నుంచే’’ అని శ్రీమాతాజీ ప్రకటించారు.

Carbella-Castle.jpg

హిమాలయంలా... కైలాసంలా...

ఆ భవంతిని కొనగానే శ్రీమాతాజీ చేపట్టిన ప్రప్రథమ కార్యం... ఆ ఏడాది జూలై 28న నిర్వహించిన గురుపూజ. దానికి 500 మంది వరకూ సహజ యోగులు హాజరు కావచ్చనే అంచనాతో... అంతమందికి వండడం కష్టం కాబట్టి క్యాటరర్‌ను కుదుర్చుకోవాలని ఇటాలియన్‌ సహజ యోగులు అనుకున్నారు. అయితే తానే స్వయంగా వండిపెట్టాలని శ్రీమాతాజీ నిర్ణయించుకొని, మిలాన్‌కు వెళ్ళి సరుకులు, పాత్రలు తీసుకువచ్చారు. సాయంత్రం పూజకు అనుకున్నదానికన్నా రెండింతలు ఎక్కువమంది సహజ యోగులు వచ్చారు. కానీ ఆహారం అందరికీ సరిపోయేదానికన్నా ఎక్కువగానే ఉంది. ఆ రోజు బార్బరా నది ఒడ్డున నిర్వహించిన గురుపూజలో శ్రీమాతాజీ మాట్లాడుతూ ‘‘మీరు ఉన్న ఈ ప్రదేశం ఒక హిమాలయం లాంటిది. ఒక కైలాసం లాంటిది. చాలా పవిత్రమైనది. ఇక్కడ పారుతున్న బార్బరా నది ఎంత స్వచ్ఛంగా ఉందంటే... ఇక మీరు హిమాలయాలకు వెళ్ళవలసిన పని లేదు’’ అని చెప్పారు. అదే సమయంలో డాగ్లియోలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇంటిని కూడా శ్రీమాతాజీ కొన్నారు. పూజలకోసం వచ్చిన సహజయోగులు అందులో ఉండేవారు. కాలక్రమేణా వేసవికాలంలో వివిధ దేశాల నుంచి వచ్చిన పిల్లలతో బాలల శిబిరం, యువ శక్తి సదస్సు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. 1991 సెప్టెంబరు నుంచి తన సందర్శన కోసం వచ్చే సహజ యోగి దంపతులను తనతో క్యాజిల్‌లో ఉండాల్సిందిగా శ్రీమాతాజీ ఆహ్వానించారు. ఆ ఇంట్లో సాధారణమైన సౌకర్యాలు కూడా లేవు. ‘‘అలా ఉంటేనే మనకు మంచిది’’ అని శ్రీమాతాజీ చెప్పారు. శీతకాలంలో... చాలా చల్లగా ఉండే అక్కడి వాతావరణంలో... ఏం వండాలో, ఏం తినాలో ఆమె సూచించేవారు. ప్రతిరోజూ వారికి వైబ్రేటెడ్‌ వాటర్‌, ప్రసాదం ఇచ్చేవారు. మిలాన్‌లోని యోగులు వారాంతాల్లో వచ్చి... ఆర్కిటెక్ట్స్‌ చెప్పిన విధంగా మరమ్మతు కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

లండన్‌, రష్యా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన, వివిధ వృత్తి నిపుణులైన సహజయోగులు ఆ భవనం పనుల్లో తమ నైపుణ్యాన్ని చూపించారు. పరిసరాలను శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలని శ్రీమాతాజీ చెబుతూ ‘‘నేను విశ్వానికి మహారాణిని. నా పిల్లలందరూ సుందరంగా జీవించాలి, ఎంత అందంగా, పరిశుభ్రంగా ఉండాలో మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాలి’’ అని అన్నారు. 1991 అక్టోబర్‌ 25న... వియన్నాలో ఆమె మాట్లాడుతూ ‘‘‘భవిష్యత్తులో కబెల్లాను ప్రత్యేకమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చూస్తారు. ఇక్కడ చైతన్య తరంగాలు చాలా బాగున్నాయి. వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంది. ఇక్కడ పారుతున్న నది చాలా అందంగా ఉంది. ఆ నది సహజ యోగులను గంగానదిలా చాలా తొందరగా శుద్ధి చేస్తుంది’’ అని అన్నారు. శ్రీమాతాజీ అభీష్టానికి అనుగుణంగా... ‘కబెల్లా ఇంటర్నేషనల్‌ సహజ స్కూల్‌ ప్రాజెక్ట్‌’ ఇక్కడ ఏర్పాటయింది. 2006 జూలై 8న... ‘పలాజోయోరియాకాసాఫోర్మా’ అని పిలిచే అంతర్జాతీయ సహజ యోగ పాఠశాలను (కబెల్లా స్కూల్‌) ‘సహజ యోగ వరల్డ్‌ ఫౌండేషన్‌’కు కానుకగా శ్రీమాతాజీ ఇచ్చారు.

ఆధ్యాత్మిక ఉన్నతికి అవకాశం...

ఇప్పుడు వివిధ దేశాలకు చెందిన సహజ యోగులు ఇటలీలోని ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ శ్రీకృష్ణపూజ, శ్రీ గణేశపూజ, సహజ యోగుల కుటుంబీకుల వివాహాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. సుమారు పదిరోజులపాటు జరిగే ఈ పూజోత్సవాల కోసం వివిధ దేశాల నుంచి వచ్చే సహజ యోగులను ఇక్కడి పూజామందిరం, పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళు, బార్బెరా నది ఆహ్వానిస్తాయి. ఆ పదిరోజులూ ఈ ప్రాంగణమంతా ఒక భగవత్‌ సామ్రాజ్యంలా కనిపిస్తుంది. సహజయోగులు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉదయం, సాయంత్రం నదీ తీరాన ధ్యానం చేసుకోవడం, తమ దేహంలోని చక్రాలనూ, నాడీ వ్యవస్థను శుద్ధి చేసుకోవడం, సాయంత్రం సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలతో తీరికలేకుండా గడుపుతారు. పనివారెవరూ ఉండకపోవడం ఇక్కడ ప్రత్యేకత. వంట వార్పులు, శుభ్రతా కార్యక్రమాలతో సహా అన్నీ సహజ యోగులే చేస్తారు. ఇలా సేవలు చేయడం శ్రీమాతాజీ ప్రసాదించిన మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. ఈ ప్రదేశాన్ని సందర్శించాలనుకొనేవారు సహజ యోగ సాధకులై ఉండాలి. ఈ యాత్రను విహార యాత్రగా కాకుండా.. తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపయోగించుకొనే చక్కని అవకాశంగా సహజ యోగులు భావిస్తారు.

-డాక్టర్‌ పి. రాకేష్‌

8988982200

Updated Date - 2023-02-23T23:04:33+05:30 IST