Producer Abhishek Agarwal : నిజమనిపించిందే తీశాం
ABN , First Publish Date - 2023-09-03T00:29:19+05:30 IST
అతి తక్కువ సినిమాలతో సంచలనం సృష్టిస్తున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఆయన నిర్మించిన ‘కశ్మీర్ ఫైల్స్’కు ఇటీవలే జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ నేపథ్యంలో
అతి తక్కువ సినిమాలతో సంచలనం సృష్టిస్తున్న నిర్మాత
అభిషేక్ అగర్వాల్. ఆయన నిర్మించిన ‘కశ్మీర్ ఫైల్స్’కు
ఇటీవలే జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ నేపథ్యంలో
అభిషేక్ తన ప్రస్థానం గురించి చెప్పిన విశేషాలు ‘నవ్య’కు ప్రత్యేకం.
‘‘మా తాతగారు సేట్ జగదీష్ ప్రసాద్ మోతీవాలా హర్యానా నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఆయనకు ముత్యాలవ్యాపారం ఉండేది. ఆయనకు నిజాంకు జ్యూయెలరీ చేసేవారు. చాలా పెద్ద వ్యాపారం ఉండేది. మర్వాడీలు ఆయనను బిజినెస్‌లో ‘కింగ్ ఆఫ్ హైదరాబాద్’ అని పిలిచేవారు. ఆయనకు ముంబాయి మర్చంట్ అసోసియేషన్ ‘మోతీవాలా’ అనే బిరుదు ఇచ్చింది. తాతగారికి మొత్తం పది మంది సంతానం. తొమ్మిది మంది అమ్మాయిలు. ఒక అబ్బాయి. నాన్న అందరికన్నా చిన్నవాడు. తాతగారు చనిపోవటంతో - కుటుంబభారం నాన్నమీద పడింది. కొన్ని కారణాల వల్ల నాన్న ముత్యాల వ్యాపారం మానేసి- చిట్‌ఫండ్, టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోకి వచ్చారు. మార్వాడీ కుటుంబాలలో చిన్న వయసులోనే వ్యాపారంలోకి వచ్చేస్తారు. నేను కూడా తక్కువ వయసు నుంచే నాన్నగారికి సాయం చేయటం మొదలుపెట్టా. ఆ తర్వాత సినిమా ఎగ్జిబిషన్ వ్యాపారంలోకి వచ్చాను అప్పటికి నాకు ఎగ్జిబిషన్ రంగంలో ఎటువంటి అనుభవం లేదు. నాకు తెలుగు కూడా సరిగ్గా రాదు. తెలుగు సినిమాలు కూడా ఎక్కువ చూడలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తాతగారు ఒకప్పుడు- చార్మినార్ దగ్గర ఒక థియేటర్‌ను అద్దెకు తీసుకొని సినిమాలు ప్రదర్శించేవారుట! బహుశా ఆయన జీన్స్ నాకు వచ్చి ఉంటాయి. నేను కూడా కొన్ని థియేటర్స్‌ను లీజుకు తీసుకొని సినిమాలు ప్రదర్శించటం మొదలుపెట్టాను. ఆ తర్వాత నిర్మాతగా మారితే బావుండననినిపించింది. ‘గూఢచారి’ నా మొదటి సినిమా. అనిల్ సుంకర కూడా దానిలో భాగస్వామి. నాకు మంచి స్నేహితుడు కూడా! ఆ తర్వాత నేనే సొంతంగా ఒక కంపెనీ పెడితే బావుండుననిపించింది. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ప్రారంభించాం. ఈ ప్రొడక్షన్‌లో తొలి చిత్రం ‘కశ్మీర్ ఫైల్స్’. దీనితో పాటుగా ‘వ్యాక్సిన్ వార్స్’ అనే సినిమాను కూడా మొదలుపెట్టాం.
సులభం కాదు..,
బయట నుంచి వచ్చి నిర్మాతగా మారి ఒక సినిమా తీయటం అంత సులభం కాదు. ఇది ఒక నిర్మాణ రంగమో.. ఉత్పత్తి రంగమో కాదు. దీనిలో ఎలాంటి కాలిక్యులేషన్స్ పనిచేయవు. ఉదాహరణకు ఒక ఉత్పత్తి రంగాన్నే తీసుకుందాం. ఒక ప్రొడక్ట్ చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుందనే విషయం ముందే తెలుస్తుంది. కానీ సినిమా రంగంలో అలాంటి లెక్కలేమి పనిచేయవు. ప్రతి శుక్రవారం ఒకరు పెద్ద ప్రొడ్యుసర్ అయిపోవచ్చు. అదే శుక్రవారం మరో పెద్ద ప్రొడ్యుసర్ జీరో అయిపోవచ్చు. ఎందుకంటే సినిమా రంగంలో సక్సెస్ రేటు చాలా తక్కువ. ‘అయినా కొత్త నిర్మాతలు ఎందుకు వస్తారు?’ అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే... సినిమా అనే పురుగు కుడితే... అది ఎప్పటికీ పోదు. ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. అయితే నేను సినిమాల్లోకి రావటానికి మా కుటుంబం అంగీకరించలేదు. ఎందుకంటే మార్వాడీ కుటుంబాలలో బిజినెస్ కేవలం నమ్మకంపైనే జరుగుతూ ఉంటుంది. అంతేకాదు. వారు ఎప్పుడూ నష్టపోరు కూడా! కానీ సినిమా ఒక బెట్టింగ్ లాంటిది. మా కుటుంబాన్ని చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది. ఇప్పటికీ మా బంధువులకు, స్నేహితులకు- సినిమా రంగం గురించి తెలియదు. ఉదాహరణకు పోస్టర్ మీద ‘400 కోట్ల వసూళ్లు’ అని కనిపిస్తే... అన్ని డబ్బులు నిర్మాతకే వచ్చేస్తాయనుకుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు పరిశ్రమలో 80 శాతం మంది స్నేహితులే! అందువల్ల నా ప్రవేశం సులభమయింది. ఇప్పటికీ నాకు సాయం చేయటానికి అనేక మంది సిద్ధంగా ఉంటారు.
అనుకోకుండా...
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పాలి. ప్రతి వ్యక్తికి కొన్ని మూలాలు ఉంటాయి. వాటి నుంచి ఆ వ్యక్తిని పెరికివేస్తే కలిగే బాధ అంతా ఇంతా కాదు. అతని అస్థిత్వమే ఉండదు. కశ్మీరీ పండిట్స్ విషయంలో కూడా అదే జరిగింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విషయం నా హృదయాన్ని ఎక్కడో తాకింది. దానికి సంబంధించిన వివరాలు సేకరించటం మొదలుపెట్టాను. ఆ వివరాలు తెలుసుకుంటుంటే షాకింగ్‌గా అనిపించింది. కశ్మీర్‌లో కొన్ని తరాలుగా నివసిస్తున్న కశ్మీరీ పండిట్లను- ‘‘ఇది మీ ఇల్లు కాదు.. బయటకి పొండి’’ అని తరిమేస్తే- వాళ్ల పరిస్థితి ఏమిటి? కశ్మీర్‌లో జరిగిన ఘటనలు ఇతర ప్రాంతాల్లో జరగవని ఎలా చెప్పగలం? అనే ఆలోచనలు నాలో బలంగా పాతుకుపోయాయి. దాదాపుగా అదే సమయంలో ఆర్టికల్ 370ను తొలగించారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరగటం మొదలుపెట్టింది. దీనిని నేను ఫాలో కావటం మొదలుపెట్టాను. ఆర్టికల్ 370కు కశ్మీర్‌కు మధ్య ఎలాంటి సంబంధం ఉంది... అనే విషయం తెలుసుకోవటానికి కశ్మీర్ కూడా వెళ్లాను. ఆ సమయంలో వివేక్ అగ్నిహోత్రి - పండిట్‌లపై సినిమా తీస్తున్నారని తెలిసింది. అప్పటికే ఆయన తీసిన ‘తాష్కెంట్ ఫైల్స్’ చాలా పెద్ద హిట్ అయింది. వివేక్ ‘కశ్మీర్ ఫైల్స్’ పేరిట ఒక పోస్టర్ తయారుచేశారు. అది ఎర్రరంగు బ్యాక్‌గ్రౌండ్‌తో ఉంటుంది. మేము కూడా ఒక పోస్టర్ తయారుచేశాం. అది నీలరంగు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. ఈ రంగుల తేడా తప్ప మిగిలిన కాన్సెప్ట్ అంతా ఒకటే! ఈ పోస్టర్లను చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. ‘ఒకే విధంగా ఆలోచిస్తున్నాం కదా.. కలిసి ఎందుకు పనిచేయకూడద’నిపించింది. ఆయన దగ్గరకు వెళ్లి- ‘‘మనం కలిసి పనిచేద్దాం’’ అని అడిగాను. అప్పుడు ఆయన- ‘‘ఒక సంవత్సరం నుంచి దీనిపై పనిచేస్తున్నా. ఈ సినిమా తీయగలమో లేదో తెలియదు. తీస్తే విడుదల అవుతుందో లేదో తెలియదు’’ అన్నారు. అప్పుడు నేను- ‘‘కలిసి పనిచేద్దాం. అంతా పైవాడి దయ..’’ అన్నాను. 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మొదలుపెట్టాం. కానీ కొవిడ్ రావటంతో బడ్జెట్ పెరిగిపోయింది. కానీ ఈ సినిమాను నేను ఎప్పుడూ రిస్క్ అనుకోలేదు. రిలీజ్ అయిన తర్వాత హిట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆలోచించలేదు. ‘‘కొద్ది మంది చూసినా చాలు.. ఒకరిద్దరు కశ్మీరీ పండిట్‌లు చూసి, మా బాధలు ప్రపంచానికి చెప్పాడు’’ అని అనుకొని ఆశీర్వాదం ఇస్తే చాలు’’ అనుకున్నాను. నా కల నిజమైంది. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలకు ముందు- పండిట్‌లకు సంబంధించిన ఒక సంస్థ సభ్యులతో ఒక జూమ్ కాల్‌లో పాల్గొన్నాం. ప్రపంచవ్యాప్తంగా 400 మంది దానిలో పాల్గొన్నారు. కొందరి కళ్లలో నీళ్లు, మరికొందరు మాట్లాడలేకపోతున్నారు. వారందరూ ఏకగ్రీవంగా- ‘‘ధన్యవాద్.. మీరు మా జీవితాలను ప్రపంచానికి చూపిస్తున్నారు ’’ అని చెప్పినప్పుడు- నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ‘సినిమా ఏమయినా పర్వాలేదు. నా ఆశయం నెరవేరింది’ అనిపించింది.
కష్టాలు కూడా..
సినిమాను ప్రారంభించినప్పటి నుంచి అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు- వివేక్‌జీపైన, నాపైన ఫత్వాలు జారీ చేశారు. షూటింగ్‌లు ఆపేయటానికి ప్రయత్నించారు. రిలీజ్ సమయంలో థియేటర్ల సమస్య వచ్చింది.. వీటన్నింటినీ అధిగమించి సినిమాను విడుదల చేసాం. సాధారణంగా ఈ తరహా సినిమాలకు ఎక్కువ బడ్జెట్ ఉండదు. మార్కెటింగ్ బడ్జెట్ కూడా ఎక్కువ ఉండదు. అయినా ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే దేశ ప్రజలే కారణం. అన్ని భాషల్లోనూ దీన్ని ఆదరించారు. వారే మార్కెటింగ్ చేశారు. అంతే కాదు.. ‘‘ఈ సినిమాను మేము అవార్డుల కోసం తీయలేదు. మొదటి నుంచి మేము ఈ సినిమాను దేశ ప్రజల కోసం తీశాం’’ అని చెబుతూ వచ్చాం. ‘కశ్మీర్ ఫైల్స్’కు జాతీయ అవార్డు వచ్చినప్పుడు కచ్చితంగా ఆనందం వేసింది . అయితే ఆ విజయం మాది కాదు.. దేశప్రజలదని భావిస్తున్నా. ‘కశ్మీర్ ఫైల్స్’పై అనేక విమర్శలు వచ్చాయి. మాకు ఏది నిజమనిపించిందో అది తీశాం. దేశప్రజలు దాన్ని తమదనుకున్నారు. మాపై విమర్శలు చేసేవారు కూడా ఉంటారు. అది వారి ఇష్టం. ‘కశ్మీర్ ఫైల్స్’పై విమర్శలు చేస్తే తమకు కూడా కీర్తి లభిస్తుందనుకొనేవారు కూడా ఉంటారు. ఆ రెండు నిమిషాల కీర్తి కోసం మాట్లాడేవారి గురించి ఏం చెప్పాలి? నా పని నేను చేసుకుంటూ వెళ్తా! ప్రజలు ఆదరిస్తారా? లేదా అనేది వారి ఇష్టం. ప్రస్తుతం మేము తీసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిని కూడా చాలా రీసెర్చ్ చేసి తీశాం. దీనిని కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశీస్తున్నా. బెంగాల్ అల్లర్లపై ‘ఢిల్లీ ఫైల్స్’ అనే సినిమా తీస్తున్నాం.’’
నాకు ఏ వింగ్స్ లేవు
‘‘నాకు ‘రైట్‌వింగ్... లెఫ్ట్‌వింగ్’ అని ఎలాంటి వింగ్స్ లేవు. నేను ఏ వర్గానికీ చెందిన వాణ్ణి కాదు. నాకు నచ్చిన విషయాన్ని నిజాయితీగా సినిమా తీయాలనుకుంటా. దానిని మెచ్చుకొనేవారు ఉంటారు. విమర్శించేవారూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సినిమా విజయవంతం కాకపోతే ఎవరూ మద్దతు ఇవ్వరు.’’
పరిశోధన తర్వాతే...
నేను తీసే ప్రతి సినిమాకు రీసెర్చ్ టీమ్స్‌ను పెట్టుకుంటా. అన్ని రకాల సమాచారాన్ని సేకరించి, దాన్ని వడబోసిన తర్వాతే సినిమా తీస్తా.
ఉదాహరణకు ‘‘కశ్మీర్ ఫైల్స్’ తీసేముందు అనేక మందితో మాట్లాడాం. దాదాపు రెండు వేల గంటల టెస్టిమోనియల్స్ సేకరించాం.
వాటి ఆధారంగానే కథను రూపొందించాం. ‘ఢిల్లీ ఫైల్స్’కు కూడా అదే చేస్తున్నాం. ‘టైగర్ నాగేశ్వరరావు’కు కూడా అదే చేశాం. ఎందుకంటే ఏదైనా విమర్శ వచ్చినప్పుడు- దానికి సమాధానం చెప్పగలగాలి.
సివిఎల్‌ఎన్ ప్రసాద్