Veena Srivani : ఈ వాణికి వీణే జీవితం..!
ABN , First Publish Date - 2023-05-17T23:07:37+05:30 IST
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో.. ఏ వీడియో చూసినా నవ్వుతూ వీణపై స్వరాలు పలికిస్తుంటారు శ్రీవాణి. పలు భాషల్లోని సినిమా పాటలను.. హమ్ చేసినంత సులువుగా, తేలిగ్గా వీణను వాయించటం శ్రీవాణి ప్రత్యేకత.
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో.. ఏ వీడియో చూసినా నవ్వుతూ వీణపై స్వరాలు పలికిస్తుంటారు శ్రీవాణి. పలు భాషల్లోని సినిమా పాటలను.. హమ్ చేసినంత సులువుగా, తేలిగ్గా వీణను వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. ఆమె ఇంట్లో పదమూడు వీణలున్నాయి. ధరించే ఆభరణాల్లో కూడా వీణ దర్శనమిస్తుంది. అందుకే ‘వీణా శ్రీవాణి’ అయ్యింది. సినిమా పాటలను వీణపై ప్లే చేస్తూ.. ఆధునిక తరాన్నీ ఆకట్టుకుంటున్న శ్రీవాణితో ‘నవ్య’ మాట్లాడినప్పుడు.. తన కెరీర్‌తో పాటు జీవిత విషయాల్ని పంచుకున్నారిలా...
నా పేరు సత్యవాణి. పెళ్లయ్యాక శ్రీవాణిగా మార్చుకున్నా. ఇపుడు జనాలంతా వీణ శ్రీవాణి అని పిలుస్తున్నారు. వీణపై సినిమా పాటలు ప్లే చేయటం వెనకాల కఠోరశ్రమ ఉంది. ప్రతిరోజూ కొన్ని గంటలపాటు సాధన చేస్తా. బాలీవుడ్‌లో ప్రముఖ సంగీత దర్శకులు, సింగర్స్ నా ప్రతిభను చూసి స్టాండింగ్ ఓవిషయేషన్ ఇచ్చారు. ఆసక్తి, సంగీతంపై ప్రేమ ఉంటే ఎవరైనా వీణను నేర్చుకోవచ్చు.
‘‘కొందరు వీణా విద్వాంసులు ‘హా.. ఏముందిలే! ఆ సినిమా పాటలు పాడే శ్రీవాణి’ అంటూ పెదవి విరుస్తారు. అవేమీ పట్టించుకోను. ఎందుకంటే నేను విద్వాంసురాలినని ఎక్కడా అనలేదు. మదరాసులో మహా ప్రదర్శనలు చేయలేదు. అయితేనేం ‘వీణా శ్రీవాణి’ అంటారు జనాలంతా. నాకిది చాలు. ‘ఆ సినిమా పాటలు వాయించే శ్రీవాణిలా తయారు కావాలంటే.. నేను నేర్పలేను. అసలు నువ్వు నా దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవటానికే రావొద్దు’ అన్నారట ఓ గురువుగారు. సినిమా పాటను తక్కువ చేస్తే ఒప్పుకోను. అలనాటి సంగీత దర్శకులనుంచి ఇళయరాజా, రెహ్మాన్ స్వరపర్చిన స్వరాలను వింటే.. అసలు ‘సినిమా పాట’ గొప్పతనమేంటో అర్థం అవుతుంది. అపారమైన సంగీత జ్ఞానం ఉన్నప్పుడే సినిమా పాట స్వరపరుస్తారు. ఈ విషయం తెలీకపోతే ఎలా? అనిపిస్తుంది.
మా ఆయన వల్లనే..
పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు సాధన చేయలేదు. మా ఆయన వేణుగారికి వీణంటే ఇష్టం. అందుకే డిప్లమో చేసి ఆయన్ని ఆశ్చర్యపర్చాలనుకున్నా. ఆ సమయంలో వీణను ప్లే చేస్తారా? అని పిల్లలను అడిగినప్పుడు.. ‘ఛీఛీ.. వీణను ముసలివాళ్లు వాయిస్తారు. మాకు కీబోర్డు, గిటార్ ఇష్టం’ అంటూ మాట్లాడారు. వీణకు ఇంత దీనపరిస్థితి వచ్చిందా? అనిపించింది. కొన్నాళ్ల తర్వాత వినాయక చవితి సందర్భంగా.. ఓ టెలివిజన్ కార్యక్రమంలో వీణను ప్లే చేసే అవకాశం దక్కింది. అయితే స్టేజ్ ఎక్కిన వెంటనే.. ఎప్పుడెప్పుడు ఈమె కీర్తనలు, కృతులు ఆపేస్తుందా? అనేట్లు ముఖాలు అదోరకంగా పెట్టారు. అసలు ప్రోగ్రామ్‌కే రాకపోయి ఉంటే బావుండేదని.. మా ఆయనతో చెప్పి బాధపడ్డా. ‘కీర్తనలు, కచేరీలు ఇపుడు ఎవరు వింటారు? ప్రావీణ్యం ఉన్నా అక్కర్లేదిక్కడ. అసలు అర్థం కాని విద్యను ఎందుకు ఆదరిస్తారు? అర్థమైతేనే జనాలు ఇష్టపడతారు’ అన్నారంతే. అలా సినిమా పాటలవైపు వచ్చా. ఓ రోజు ‘సింగారాల పైరుల్లోనా..’ పాటను వీణపై ప్లే చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంతే. రెండురోజుల్లో వైరల్ అయింది. ఆ తర్వాత ‘పెద్దపులి..’ పాటను వీణపై ప్లే చేయ్ చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు మా ఆయన. ఆ పాట చేశాక.. ఇక వెనక్కి చూసుకోలేదు. రోజుకు ఆరేడు గంటలు సాధన చేసి.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లోని సినిమా పాటలతో పాటు హిందీ, బెంగాళీ, ఇంగ్లీషు సినిమా పాటలను వీణపై పలికించా. పిల్లలనుంచి పెద్దలవరకూ అందరూ మెచ్చుకున్నారు.
ఏనాడూ ఊహించలేదు...
పిల్లలకు వీణపై ఆసక్తి పెరిగింది. ‘బాల్యంలో వీణ నేర్చుకున్నానమ్మా.. నీ వీడియో చూశాక.. పాతరోజులు గుర్తొచ్చి మళ్లీ వీణ ప్లే చేస్తున్నా’ అంటూ అరవయ్యేళ్ల బామ్మ ఫోన్ చేసి చెబుతోంది. పెళ్లికూతుర్లు వీణతో వెడ్డింగ్ ఫొటోషూట్స్ చేయటం ట్రెండ్ అయింది. ఇక వీణను తయారు చేసేవాళ్లు.. రిపేరు చేసేవాళ్లకు ఉపాధి దొరికింది. పాఠాలు చెప్పేవాళ్లు పుట్టుకొచ్చారు. వీణకు మళ్లీ జీవకళ రావటమంటే.. సోషల్ మీడియా మహిమే! వీణకు పునర్జన్మ. దేశంలోని వివిధ నగరాలకే కాదు.. ఇతర దేశాలకు నా బ్యాండ్‌తో వెళ్లి వీణను ప్లే చేస్తున్నా. ఇదెన్నడూ కలలో కూడా ఊహించలేదు.
అంతా అమ్మ చలువే..
అమలాపురం దగ్గర నందంపూడి అనే అగ్రహారంలో పుట్టాను. నాకో ఇద్దరు అన్నయ్యలు, ఓ చెల్లెలు. అమ్మకు సంగీతం అంటే పిచ్చి. ఒక్కొకరికి ఒక్కో సంగీత పరికరం నేర్పించింది. నా వంతు వీణ! అలా రెండో తరగతిలోనే వీణకు దగ్గరయ్యా. ప్రముఖ విద్వాంసులు వీణ చిట్టిబాబుగారి శిష్యురాలు పిచ్చిక సీతామహాలక్ష్మిగారు మా గురువు. ఆమె దగ్గర బొబ్బిలి వీణలుండేవి. వాటి మీద సంగీతం సాధన చేసేవాళ్లం. పాఠాలు ఒకసారి వింటే చాలు గుర్తుపెట్టుకొనేదాన్నట. ‘ఇంకా బాగా నేర్చుకోవాలి’ అంటూ అమ్మ కొట్టేది(నవ్వుతూ). దీంతో తెలీకుండా సాధన పెంచేశా. అలా ఏడాదిలోపే కొన్ని కీర్తనలు నేర్చేసుకున్నా. మూడో తరగతిలోనే తొలి ప్రోగ్రామ్ ఇచ్చేశా. చిన్నపిల్లదాన్ని కాబట్టి చాలా మంది ఆహ్వానించేవారు. ఆ సమయంలో నా కాళ్లకు కూడా సరిగా చెప్పులు ఉండేవి కావు. ఎవరో సైకిలు బహుమతి ఇస్తే చదువుకోవటానికి, సంగీతం ప్రదర్శించటానికి సైకిల్‌పై వెళ్లేదాన్ని. ఆ కష్టాలను మర్చిపోలేను. అవే రాటుదేల్చాయి. ఏ పోటీకి వెళ్లినా అవార్డులు వచ్చేవి. తొమ్మిదో తరగతిలోనే వీణ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించా. క్లాసులోనే చిన్నదాన్ని కావటంతో పాటలు పాడించుకునేవాళ్లు సీనియర్లు. అలా అప్పట్లో వచ్చిన ‘చిన్నదాన.. ఓసి చిన్నదాన..’ పాటను వీణపై ప్లే చేస్తే ఆశ్చర్యపోయారంతా. ఆరేళ్లు మా ఊరిలో వీణ అభ్యసించాక సర్టిఫికేట్ కోర్సు కోసం రాజమండ్రికి మకాం మార్చాం. అక్కడ గురువు సత్యప్రసాద్‌గారు ప్రతిభను మెచ్చుకుని ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు.
వీణంటే ఆరాధన..
చదువుల్లోనూ మెరిట్ విద్యార్థినినే. పదోతరగతి పూర్తయ్యాక ఆర్.ఆర్.బి.లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించా. ఈ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన నేను.. ఆ రైల్వే ఉద్యోగం పడదని రాజీనామా చేశా. సిటీకేబుల్‌లో కొన్నాళ్లు యాంకరింగ్ చేశా. 2006లో జీతెలుగు టీవీ కార్యక్రమం ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్’ పోటీలో రన్నరప్ అయ్యా. ఆ తర్వాత అదే ఛానెల్‌లో ‘సదా మీ సేవలో’ అనే ఓ సంగీత కార్యక్రమానికి యాంకరింగ్ చేశాక.. ఈ రంగంలో ఆరేడేళ్ల పాటు బిజీ అయ్యా. ఆ సమయంలోనే వీణను పూర్తిగా పక్కనపెట్టేశా. వీణ వాయించేది పాతతరమే.. అనే మాట నచ్చక మళ్లీ వీణపై సాధన చేశా. వీణను భక్తితో నేర్చుకున్నా. వీణంటే ఆరాధన. ఎవరైనా.. వీణను తక్కువ చేసి మాట్లాడితే నచ్చదు.
అదే నా లక్ష్యం..
వీణలో 24 మెట్లు, ఏడు తంత్రులు ఉంటాయి. అందుకే వీణను వాయించటం కష్టం. ఆ మాటకొస్తే వీణను తయారు చేయటమూ కష్టమే. ఒక్కో మెట్టుకూ ఒక్కో కొలత ఉంటుంది. ఏ మెట్టు తేడా వచ్చినా ఇబ్బందే. రవివర్మ అనే కళాకారుడు వీణను ట్యూనర్ పెట్టి తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ సంగీత పరికరాన్ని తయారు చేయాలంటే.. శృతి, జ్ఞానం తెలిసి ఉండాలి. వీణలు చేసేవాళ్లు లేకుంటే.. నాలాంటి వాళ్లుండరు. అందుకే వీణను చేసే కళాకారులను సత్కరిస్తుంటా.వీణ వల్ల ఏకసంధాగ్రహిని అయ్యా. తెలివితేటలతో పాటు క్రమశిక్షణ వచ్చింది. వీణపై రాగాలు పలికిస్తుంటే సమయమే తెలీదు. ఆకలవ్వదు. సాధనే నా బలం. వీణ నా హీరోయిన్. నా ప్రాణం. నా జీవితం కూడా. వీణవల్లే మంచి భర్త దొరికారు. నా జీవితమే మారిపోయింది. ఏదేమైనా.. వీణను వచ్చే తరానికి అందించాలి. ఇదే నా లక్ష్యం.
• రాళ్లపల్లి రాజావలి