Global Investors Summit 2023: తీరు మార్చుకోని జగన్.. రాజధానిపై మళ్లీ పాతపాటే..

ABN , First Publish Date - 2023-03-03T14:12:20+05:30 IST

సాగర నగరం విశాఖ కేంద్రంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో (Global Investors Summit 2023) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) కీలక ప్రకటన..

Global Investors Summit 2023: తీరు మార్చుకోని జగన్.. రాజధానిపై మళ్లీ పాతపాటే..

విశాఖ: సాగర నగరం విశాఖ (Vizag) కేంద్రంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో (Global Investors Summit 2023) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని అని, త్వరలో విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తానని జగన్ మరోమారు వ్యాఖ్యానించారు. రాజధాని కేసు (AP Capital Case) సుప్రీంకోర్టు విచారణలో (Supreme Court Hearing) ఉండగానే మరోసారి ఏపీ రాజధానికి సంబంధించి సీఎం జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు (CM Jagan Controversial Comments) చేయడం గమనార్హం.

జగన్ పోకడను పరిశీలిస్తే.. ఆయనకు రాజ్యాంగ వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతోందని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శించారు. ఈ తరహా వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేయడం ఇది రెండోసారి. ‘‘రానున్న రోజుల్లో రాష్ట్ర రాజధాని కానున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరికొద్దినెలల్లో నేను కూడా విశాఖకు మకాం మార్చబోతున్నాను. ఈ ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు రావడమే కాకుండా మా రాష్ట్రంలో వ్యాపారం చేయడం ఎంత సులభమో విదేశాల్లో ఉన్న మీ సహచరులకు కూడా చెప్పి.. తీసుకురండి’’ అని ఢిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సన్నాహక సమావేశంలో కూడా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విషయంలో జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్‌ తగిలిన 24 గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ రాజధానిపై ప్రకటన చేయడం విమర్శలకు తావిచ్చింది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై త్వరగా విచారణ పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

గతంలో చెప్పినట్లుగాఈ నెల 28వ తేదీనే విచారిస్తామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు చాలా పెద్దదని.. రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయని జస్టిస్‌ జోసెఫ్‌ తెలిపారు. దీనిపై విచారణ చేపడితే.. ఒక సార్థకత అంటూ ఉండాలని వ్యాఖ్యానించారు. 28న విచారణంటే ఆలస్యమవుతుందని రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి మళ్లీ పేర్కొన్నారు. అయితే 28వ తేదీనే విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేయడంతో.. అందుకు ఆ ఒక్క రోజే సరిపోదని, 29, 30 తేదీల్లో (బుధ, గురువారాలు) కూడా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు.

నోటీసులు ఇచ్చిన కేసుల్లో బుధ, గురువారాల్లో విచారణ జరుపరాదని ప్రధాన న్యాయమూర్తి సర్క్యులర్‌ ఇచ్చారని ధర్మాసనం గుర్తు చేసింది, దీనిపై ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతివ్వాలని న్యాయవాదులు కోరారు. ఇందుకు తన అనుమతి అవసరం లేదని జస్టిస్‌ జోసెఫ్‌ స్పష్టం చేశారు. ‘మీ ఇష్టం.. మీరు సీజేఐ ముందు ప్రస్తావించాలనుకుంటే ప్రస్తావించవచ్చు. అయితే నేను జూన్‌లో రిటైరవుతున్నాను. ఆ విషయం కూడా ప్రధాన న్యాయమూర్తికి చెప్పండి. రిటైరయ్యేలోపు ఈ కేసు విచారణ పూర్తి కావాలని కోరుకుంటున్నాను’ అని జస్టిస్‌ జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. దీంతో బుధ, గురువారాల్లో (29, 30ల్లో) కూడా అమరావతి కేసుపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ న్యాయవాదులు చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ను కోరే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-03-03T14:12:40+05:30 IST