CBN Arrest : సెప్టెంబర్-10న బాబు-భువనేశ్వరి పెళ్లి రోజు.. ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందా..?
ABN , First Publish Date - 2023-09-09T23:12:29+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Arrest) అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా..? ఈ అరెస్ట్ వెనుక కుట్ర జరిగిందా..? అంటే గత కొన్నిరోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్షరాలా ఇదే నిజమని అనిపిస్తోంది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Arrest) అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా..? ఈ అరెస్ట్ వెనుక కుట్ర జరిగిందా..? అంటే గత కొన్నిరోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్షరాలా ఇదే నిజమని అనిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ సర్కార్ ఎందుకింతలా చంద్రబాబుపై కుట్ర పన్నింది..? బాబుపై ఎందుకింత పగ..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
42 వసంతాలు!
సెప్టెంబర్ 10 చంద్రబాబు-నారా భువనేశ్వరిల పెళ్లిరోజు (Chandrababu-Bhuvaneswari Marriage Day). 1981,సెప్టెంబర్ 10న ఉదయం 8 గంటల 6 నిమిషాలకు చెన్నైలోని మౌంట్ రోడ్డులోని గవర్నమెంట్ ఎస్టేట్ కలైవాసర ఆరంగంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగే నాటికే చంద్రబాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పనితనం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయించారు. వీరికి పెళ్లి అయిన ఒకటిన్నర సంవత్సరానికి 1983లో లోకేష్ జన్మించారు. రేపటితో ఈ జంట 42 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. కాగా.. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో అటు చంద్రబాబు.. ఇటు భువనేశ్వరి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉంటే.. భువనేశ్వరి హెరిటేజ్ డైరీని విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలను భువనేశ్వరి చూసుకునేవారు.
జగన్ ప్లాన్ ఇదేనా..?
అభిమానులు, కార్యకర్తలు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు మధ్య పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవాలని బాబు, భువనేశ్వరి భావించారు. అయితే ఒకరోజు ముందే బాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసింది. పెళ్లికి ముందురోజు అరెస్ట్ చేయడమేంటి..? అని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరోవైపు.. బాబును అరెస్ట్ చేసి జగన్ తన పైశాచిత ఆనందాన్ని పొందారనే ఆరోపణలు సామ్యాన్యులు, నెటిజన్లు నుంచి సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా కుట్రేనని.. అంతా ప్లాన్ ప్రకారమే ఏపీ ప్రభుత్వం.. సీఐడీతో ఆడించిందని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ప్రతిపక్ష నేతకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరచకుండా విచారణ పేరుతో ఐదున్నర గంటలకుపైగా వేధిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పెళ్లిరోజును దృష్టిలో ఉంచుకుని కవాలనే సీఐడీ ఇంటరాగేషన్ పేరుతో రాత్రంతా సీఐడీ ఆఫీసులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కన్నెర్రజేస్తున్నారు. ఒకప్పుడు జగన్ కూడా పెళ్లి రోజు, పుట్టిన రోజు జైల్లోనే జరుపుకున్నారట. అందుకే ఒకరోజు ముందే చంద్రబాబును ఇలా అరెస్ట్ చేసి అహం చల్లార్చుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తల్లికి చెప్పుకున్నా..!
కాగా.. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు చంద్రబాబుతో కలిసి అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి తొలుత భావించారు. కానీ.. శనివారం ఉదయమే చంద్రబాబును సీఐడీ పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో శనివారం నాడే అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘ నా భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నాను. ఆయనకు మనోధైర్యాన్ని కలిగించాలని అమ్మను కోరాను. నా భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారు. ఈ పోరాటం విజయం సాధిస్తుంది. చంద్రబాబు పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలి. ఎవరికైనా మనస్సుకు బాధ కలిగితే కష్టాలు వస్తే తల్లికి చెప్పుకుంటారు. అందుకే నేను నా కష్టాన్ని దుర్గమ్మ తల్లికి చెప్పుకుందామని వచ్చాను’ అని భువనేశ్వరి మీడియాకు వెల్లడించారు. చూశారు కదా.. చంద్రబాబు-భువనేశ్వరి ఎన్నో అనుకున్నారు కానీ.. కుట్ర చేసిన ఏపీ ప్రభుత్వం పెళ్లికి ఒకరోజు ముందే ఇలా చేయడం గమనార్హం.