Shocking Video: 'పైత్యం ఎక్కువైతే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి మరి'.. వధువు ప్రాణాల మీదకు తెచ్చిన ఫొటో షూట్..!

ABN , First Publish Date - 2023-08-23T12:20:41+05:30 IST

ప్రస్తుతం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ (Pre Wedding Photo Shoot) అనేది ఒక ట్రేండ్‌గా మారిపోయింది. కాబోయే వధూవరులు చిత్ర విచిత్రమైన ఫోజులతో, వింత అలంకరణతో ప్రమాదకర స్థలాలకు వెళ్లి మరి ఫొటో షూట్స్ చేస్తున్నారు. దాంతో ఒక్కొసారి ప్రాణాంతక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Shocking Video: 'పైత్యం ఎక్కువైతే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి మరి'.. వధువు ప్రాణాల మీదకు తెచ్చిన ఫొటో షూట్..!

Shocking Video: ప్రస్తుతం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ (Pre Wedding Photo Shoot) అనేది ఒక ట్రెండ్‌గా మారిపోయింది. కాబోయే వధూవరులు చిత్ర విచిత్రమైన ఫోజులతో, వింత అలంకరణతో ప్రమాదకర స్థలాలకు వెళ్లి మరి ఫొటో షూట్స్ చేస్తున్నారు. దాంతో ఒక్కొసారి ప్రాణాంతక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకేముంది.. ఆ క్షణాలు జీవితాంతం గుర్తిండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవాలనే తాపత్రయంలో జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని పీడకలగా మార్చుకుంటున్నారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఇదో కోవలో జరిగిన ఓ ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాలను గమనిస్తే వధువు చావును చాలా దగ్గరి నుంచి చూసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఫొటో కోసం ఓ పెళ్లి కూతురు (Bride) ఏకంగా సముద్రంలోనే దూకింది. ఆ సమయంలో ఆమె ఓ పొడవాటి పెళ్లి గౌను ధరించి ఉంది. అంతే.. ఆ భారీ గౌనుతో ఆమె సముద్రంలోకి దూకడంతో పైకి రాలేకపోయింది. వధువు నీటిలోకి దూకగానే ఆ గౌను తడిసిపోయి ఆమెను చుట్టేసింది. ఆమె ముఖం మొత్తం అందులోనే చిక్కుకుపోవడంతో శ్వాస ఆడకపోయేసరికి కొద్దిసేపు ఉక్కిరిబిక్కిరి అయింది. అలా చాలా సేపటి వరకు నీటిలోనే చిక్కుకుని బయటపడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడింది.

ఇక అప్పటికే నీటిలో ఉన్న ఓ వ్యక్తితో పాటు గట్టున నిలబడిన మరో వ్యక్తి వెంటనే నీటిలోకి దూకి ఆమెను కాపాడారు. దాంతో బతుకు జీవుడా అంటూ ఆమె ఒడ్డుకు చేరింది. ఇంకా చెప్పాలంటే వధువు చావు అంచులదాకా వెళ్లొచ్చింది. ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు తెలియనప్పటికీ.. ఈ ఘటన తాలూకు వీడియో కాస్తా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు 'పైత్యం ఎక్కువైతే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి మరి' అని చురకలంటిస్తున్నారు.

Anand Mahindra Tweet: ఈ చింపాంజీ మనకు పెద్ద జీవిత పాఠమే నేర్పిందంటున్న మహీంద్రా.. వైరల్‌ అవుతున్న వీడియో!

Updated Date - 2023-08-23T12:26:43+05:30 IST