Virat Kohli: ఆటలోనే కాదు.. గూగుల్‌లోనూ కింగే.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడిగా విరాట్ కోహ్లీ!
ABN , First Publish Date - 2023-10-25T12:47:51+05:30 IST
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో చెలరేగాడు. ఒక పాకస్థాన్‌తో మ్యాచ్ మినహా మిగతా నాల్గింటిలో కోహ్లీ చెలరేగాడు. ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో ఏకంగా 354 పరుగులు బాదేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపుతున్నాడు. టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో చెలరేగాడు. ఒక పాకస్థాన్‌తో మ్యాచ్ మినహా మిగతా నాల్గింటిలో కోహ్లీ చెలరేగాడు. ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో ఏకంగా 354 పరుగులు బాదేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే కోహ్లీ మైదానంలో బ్యాటుతో దుమ్ములేపడమే కాకుండా సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గూగుల్‌లో అత్యధిక మంది శోధించిన అథ్లెట్ల జాబితాలో కోహ్లీ టాప్ 5లో ఉండడం విశేషం. ఇక ఆసియా అథ్లెట్ల నుంచి అయితే ఈ జాబితాలో టాప్ 10లో కోహ్లీ ఒక్కడు మాత్రమే ఉండడం గమనార్హం. దీంతో ఆసియా దేశాలకు చెందిన అథ్లెట్ల జాబితాలో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. దీనిని బట్టే చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఏ స్థాయిలో అభిమానులున్నారో.. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 68 మిలియన్ల మంది విరాట్ కోహ్లీ పేరును గూగుల్‌లో శోధించారు. వారంతా కోహ్లీ గురించి అనేక విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. దీంతో ఆటలోనే కాకుండా గూగుల్‌లో కోహ్లీ కింగ్ అనిపించుకున్నాడు. ఈ జాబితాలో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మర్, లియోనల్ మెస్సీ, భాస్కెట్ బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. రోనాల్డో గురించి అత్యధికంగా 199.4 మిలియన్ల మంది శోధించారు. ఆ తర్వాత నెయ్‌మర్ గురించి 140.9 మిలియన్ల మంది, లియోనల్ మెస్సీ గురించి 104.4 మిలియన్ల మంది, లెబ్రాన్ జేమ్స్ 72.1 మిలియన్ల మంది గూగుల్‌లో వెతికారు.
ఇక వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉన్న టీమిండియా తమ తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 29న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హార్దిక్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో ఆడే తర్వాతి మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఆడడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. పలు నివేదికల ప్రకారం నవంబర్ 5న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.