History: బఠాణీలు తిన్నంత ఈజీగా రన్స్‌.. చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ.. వన్డేలో 450 పరుగుల తేడాతో భారీ విజయం

ABN , First Publish Date - 2023-08-15T19:16:55+05:30 IST

ఐసీసీ అండర్ 19 పురుషుల ప్రపంచకప్ అమెరికా క్వాలిఫైయర్ రౌండులో(ICC U19 Men’s Cricket World Cup Americas Qualifier match) యూఎస్ఏ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ 19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.

History: బఠాణీలు తిన్నంత ఈజీగా రన్స్‌.. చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ.. వన్డేలో 450 పరుగుల తేడాతో భారీ విజయం

ఐసీసీ అండర్ 19 పురుషుల ప్రపంచకప్ అమెరికా క్వాలిఫైయర్ రౌండులో(ICC U19 Men’s Cricket World Cup Americas Qualifier match) యూఎస్ఏ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ 19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది. అలాగే పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. టొరంటో(Toronto) వేదికగా అర్జెంటీనా అండర్ 19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ అండర్ 19 జట్టు ఏకంగా 515 పరుగుల కొండంత స్కోర్ చేసింది. ఒక అండర్ 19 వన్డే ఫార్మాట్‌లోనే కాదు, అన్ని రకాల వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో 2002లో కెన్యాపై ఆస్ట్రేలియా అండర్ 19 టీం చేసిన 480 పరుగుల రికార్డును యూఎస్‌ఏ బ్రేక్ చేసింది. అంతేకాకుండా అన్ని రకాల వన్డే క్రికెట్‌లో 500 పరుగుల మార్కు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర నిలిచింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోనూ ఇప్పటివరకు అత్యధిక స్కోర్ 498 పరుగులే. ఈ రికార్డును 2022లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ సాధించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై యూఎస్‌ఏ ఏకంగా 450 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అన్ని రకాల వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయంగా చరిత్రకెక్కింది.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ అండర్ 19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది. భవ్య మెహతా, కెప్టన్ రిషి రమేష్(Bhavya Mehta and captain Rishi Ramesh) సెంచరీలతో విశ్వరూపం చూపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 14 ఫోర్లు, 3 సిక్సులతో 91 బంతుల్లోనే 136 పరుగులు చేసిన భవ్య మెహతా రనౌట్ అయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 149గా ఉంది. కెప్టెన్ రిషి రమేష్ 13 ఫోర్లు, 2 సిక్సులతో 59 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 169గా ఉంది. ఇక ఓపెనర్ ప్రన్నవ్ చెట్టిపాళయం 10 ఫోర్లతో 43 బంతుల్లో 61 పరుగులు, అర్జున్ మహేష్ 9 ఫోర్లతో 44 బంతుల్లో 67 పరుగులతో చెలరేగారు. అమోఘ్ ఆరెపల్లి 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 బంతుల్లో 48 పరుగులు, ఉత్కర్ష్ శ్రీవాస్తవ 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 బంతుల్లో 45 పరుగులతో రాణించాడు.

అనంతరం 516 పరుగుల కొండంతో లక్ష్యంతో బరిలోకి దిగిన అర్జెంటీనా అండర్ 19 జట్టు 19.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 65 పరుగులకే కుప్పకూలింది. అర్జెంటీనా జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. దీంతో యూఎస్‌ఏ అండర్ 19 జట్టు రికార్డు స్థాయిలో 450 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. యూఎస్‌ఏ బౌలర్ ఆరిన్ నద్కర్ణి(Aarin Nadkarni) 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆర్యన్ సతీష్ రెండు, ఆర్యన్ బాత్రా, పార్థ్ పటేల్ తలో వికెట్ తీశారు. అయితే సోషల్ మీడియాలో ఈ మ్యాచ్ గురించి తెలుసుకున్న క్రికెట్ అభిమానులు యూఎస్‌ఏ ఆటగాళ్లు బఠాణీలు తిన్నంత సులభంగా పరుగులు చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-08-15T19:20:07+05:30 IST