BRS party : కోల్‌బెల్ట్‌ ‘కారు’లో చిచ్చు!

ABN , First Publish Date - 2023-09-02T02:33:07+05:30 IST

ఉద్యమకాలం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్ముకున్నారు. ఒకసారి కాకపోతే మరోసారైనా తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోతుందా? అని ఎదురుచూశారు. కానీ, సిటింగ్‌ల పేరుతో ఇతర పార్టీల నుంచి వచ్చిన

BRS party : కోల్‌బెల్ట్‌ ‘కారు’లో చిచ్చు!

సింగరేణి ఏరియా బీఆర్‌ఎస్‌లో టికెట్ల రగడ

సిటింగ్‌లకే కేటాయించడంపై సీనియర్ల గుస్సా

అసంతృప్తులతో గులాబీ శిబిరంలో గుబులు

అధికార పార్టీకి గుదిబండగా మారిన హామీలు

13 సెగ్మెంట్లలో సింగరేణీయుల ప్రభావం

గత ఎన్నికల్లో 3 చోట్లనే బీఆర్‌ఎస్‌ గెలుపు

ఎమ్మెల్యేలు ఫిరాయించినా కాంగ్రెస్‌ దూకుడు

కామ్రేడ్లతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం

భూపాలపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉద్యమకాలం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్ముకున్నారు. ఒకసారి కాకపోతే మరోసారైనా తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోతుందా? అని ఎదురుచూశారు. కానీ, సిటింగ్‌ల పేరుతో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే మళ్లీ మళ్లీ టికెట్లు కేటాయిస్తుండడంతో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీని వీడే యోచనలో కొందరు, ప్రతీకారం తీర్చుకునేందుకు మరికొందరు వ్యూహరచన చేస్తున్నారు. అధిష్ఠానం దూతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా అసమ్మతి చల్లారడంలేదు. కోల్‌బెల్ట్‌లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఎన్నికల నాటికి ఇది మరెంత తీవ్రరూపం దాలుస్తుందోనన్న గుబులు గులాబీ శిబిరంలో మొదలైంది. మరోవైపు.. గతంలో కన్నా కాంగ్రెస్‌ బలపడటం, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతుండటం, సింగరేణిలో హామీలు అమలుకు నోచుకోకపోవడం వంటివి అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సింగరేణీయుల ప్రభావం ఉండగా, 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మూడు చోట్ల మాత్రమే గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ గాలి వీచినా.. కోల్‌బెల్ట్‌ ఏరియాలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడి 13 నియోజకవర్గాలకుగాను మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలను మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుచుకోగలిగింది. ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. సత్తుపల్లిలో టీడీపీ, రామగుండం, వైరా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలిచారు. అయితే ఆ తరువాత బీఆర్‌ఎస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌క’ు తెర తీసింది. దీంతో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో మంథని, భద్రాచలం ఎమ్మెల్యేలు మినహా మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలతో పాటు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కూడా బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. ఇలా ఈ ప్రాంతంలో గెలిచిన 10 మంది విపక్ష ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది కారెక్కడంతో.. కాంగ్రె స్‌కు కంచుకోటగా ఉన్న కోల్‌బెల్ట్‌లో పాగా వేశామని గులాబీ నేతలు భావించారు. కానీ, ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ల అసంతృప్తితోనే ఆందోళన చెందుతున్నారు.

బుజ్జగించినా చల్లారని అసమ్మతి..

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మినహా మిగతా ఆరుగురికి తిరిగి బీఆర్‌ఎస్‌ టికెట్లు కేటాయించింది. దీంతో గత ఎన్నికల్లో వీరి చేతిలో పరాజయం పొందిన గు లాబీ నేతలు అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. రామగుండం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి బీఆర్‌ఎ్‌సలో చేరిన కోరుకంటి చందర్‌కు టికెట్‌ ఇవ్వవద్దని ఓ వర్గం కొంతకాలంగా ఆందోళనకు దిగింది. స్వయంగా కేటీఆర్‌ జోక్యం చేసుకున్నా అసమ్మతి చల్లారడం లేదని తెలుస్తోంది. పైగా రామగుండం మాజీ మేయర్‌ జాలి రాజమణి బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయడం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు. ఇక భూపాలపల్లిలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారికి టికెట్‌ ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరినప్పటికీ.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వెంకటరమణారెడ్డికే అధిష్ఠానం అవకాశం కల్పించింది. దీంతో సిరికొండ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గండ్ర స్వయంగా సిరికొండ ఇంటికి వెళ్లి మాట్లాడటంతో ఆయన సానూకూలత వ్యక్తం చేసినా.. క్యాడర్‌ మాత్రం గుర్రుగా ఉంద నే ప్రచారం జరుగుతోంది. అలా గే మంథనిలో మరోసారి పుట్ట మధుకే అవకాశం ఇవ్వటంతో టికెట్‌పై గంపెడాశలతో ఉన్న కాటారం పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్లా నారాయణరెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నారాయణరెడ్డిపై ఒత్తిడి తెస్తోంది.

పునరాలోచనకు డిమాండ్లు..

మంచిర్యాల టికెట్‌ను సిటింగ్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకే ఇవ్వటంతో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వర్గం రగిలిపోతోంది. పార్టీ పునరాలోచన చేయకపోతే తమ దారి తాము చూసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నా మళ్లీ ఆయనకే టికెట్‌ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుకే టికెట్‌ ఇవ్వటంతో జలగం వెంకట్రావు నారాజ్‌ అవుతున్నారు. తన వర్గంతో చర్చించి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన వైద్యశాఖ డిప్యూటీ కమిషనర్‌ గడల శ్రీనివాసరావు వర్గం సైతం నారాజ్‌లో ఉంది. వైరా, ఆసిఫాబాద్‌లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించి, గత ఎన్నికల్లో ఓడిపోయిన మదన్‌లాల్‌, కోవా లక్ష్మికి బీఆర్‌ఎస్‌ టికెట్లు కేటాయించటంతో సిటింగ్‌ ఎమ్మెల్యే వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. వీటితో పాటు పినపాక, ఇల్లందు, భద్రాచలం తదితర నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి నేత ల అసంతృప్తి దడ పుట్టిస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. చాలా మంది అసంతృప్త నేతలు కాంగ్రెస్‌ నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి బయటకు రాకుండానే అంతర్గతంగా కాంగ్రె్‌సకు సహకరించేలా బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతల నుంచి హామీ లభిస్తున్నట్టు సమాచారం.

అమలు కాని హామీలతో ఆందోళన..

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గులాబీ పార్టీకి గుదిబండగా మారాయని తెలుస్తోంది. ప్రధానంగా వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియమాకాల ద్వారా భర్తీ చేస్తున్నారు. అయినప్పటికీ అర్హులైనవారికి అవకాశం రావటం లేదని, దళారులు రూ.లక్షల్లో వసూళ్లు చేసి అనర్హులకు అవకాశాలు ఇస్తున్నారని కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే సొంత ఇల్లు నిర్మించుకునే కార్మికుడికి రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి కార్మికుడికీ 200 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామన్నారు. కానీ, ఈ హామీలేవీ ఆరేళ్లుగా అమలుకు నోచుకోవడంలేదు. సింగరేణిలో కొత్తగా 30వేల మంది ఉద్యోగాలను తీసుకుంటామని, కొత్తగా భూగర్భ గను లు ప్రారంభిస్తామని, డిస్మిస్‌ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, భవిష్యత్తులో డిస్మిస్‌ అనేదే ఉండదని కేసీఆర్‌ హామీ ఇచ్చా రు. అయినా వాటిని అమలు చేయకపోవటంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


‘హస్త’గతం చేసుకోవాలని..

కోల్‌బెల్ట్‌ ఓటర్లలో బీఆర్‌ఎ్‌సపై ఉన్న అసంతృప్తిని క్యాచ్‌ చేసుకోవటంతో పాటు సింగరేణిలో గట్టి పట్టున్న కామ్రేడ్లను కలుపుకొనిపోవడానికి కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ గెలిచిన భద్రాచలం, మంథని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎ్‌సకు సరైన అభ్యర్థులే లేరనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరటంతో భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఊపు వచ్చిందనే అభిప్రాయాలున్నాయి. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు మాజీ మంత్రి తుమ్మల లాంటి నేతలు పార్టీలో చేరుతారనే ప్రచారం కాంగ్రె్‌సలో ఉత్సాహం నింపుతోంది. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గండ్ర సత్యనారాయణరావు గత ఏడాది కాంగ్రె్‌సలో చేరటం కూడా కలిసొచ్చే అంశమని కాంగ్రెస్‌ భావిస్తోంది.

Updated Date - 2023-09-02T02:41:12+05:30 IST