KTR: కేసీఆర్ అన్నీ గమనిస్తున్నారు!
ABN , First Publish Date - 2023-04-03T01:22:25+05:30 IST
క్షేత్రస్థాయిలో పార్టీలో ఏం జరుగుతోందో అధినేత కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.

పార్టీ కార్యక్రమాల అమలును పరిశీలిస్తున్నారు
ఆత్మీయ సమ్మేళనాల్లో అందరూ పాల్గొనాలి
సోషల్ మీడియా కమిటీలు బలోపేతం కావాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన
జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి
స్టీల్‌ప్లాంట్‌కు వెంటనే 5 వేల కోట్లు ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పార్టీలో ఏం జరుగుతోందో అధినేత కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో పార్టీ నేతలు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, అన్నింటినీ గమనిస్తున్నారని తెలిపారు. పార్టీ శ్రేణులు అధినాయకత్వం సూచనల ప్రకారం సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనాలు చేపడుతున్న తీరు, కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు పది మందితో కమిటీని నియమించినట్లు చెప్పారు.
పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల తీరును పరిశీలిస్తోందని తెలిపారు. ఈ కమిటీ ద్వారానే అధినేత కేసీఆర్.. ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలిపారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్నవారు, పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనేలా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రతి ఎమ్మెల్యే అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌సూచించారు. వారిని ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు.
ప్రతి నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు వరకు చేపట్టే అవకాశం ఉన్నందున అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ చేపట్టే ప్రతి ఆత్మీయ సమ్మేళనాన్ని సీఎం కేసీఆర్ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలని ఆయన సూచించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ఫై కుట్ర!
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్రం కొనసాగిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ కుట్రలను అక్కడి కార్మికులు, అనేక సంఘాలు, బీఆర్‌ఎస్ వంటి పార్టీలు ఎప్పటికప్పుడు అ డ్డుకుంటున్న నేపథ్యంలో కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని ఆరోపించారు. వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలంటూ కేంద్రానికి కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం తన అజెండా అమ లు కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్‌ను క్రమంగా చంపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకొంటోందని, కానీ.. మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దానిని నష్టాలపాలు చేసి, వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా తమ ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ముడిసరుకు కేటాయించకుండా మోకాలడ్డు
స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని కేటీఆర్ ఆరోపించారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60ు వరకు పూర్తిగా ముడిసరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. మరోవైపు ప్రైవే ట్ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40ు లోపే ఉంటోందని చెప్పా రు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాల పాలవుతోందని తెలిపారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు రూ.12.5 లక్షల కోట్లను రద్దు చేసి న ప్రధాని మోదీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు లేదని ప్రశ్నించారు.
వందశాతం సామర్థ్యంతో పనిచేస్తే లాభాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి 7.3 ఎంటీపీఏ కెపాసిటీ ఉన్నా, కేవలం ముడిసరుకును, మూలధనాన్ని కేంద్రం ఇవ్వకపోవడంవల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న 50ు కెపాసిటీకి కూడా 100ు కెపాసిటీ ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని చెప్పారు. ఒకవేళ కేంద్రం పూర్తిగా మద్దతు ఇస్తే 100శాతం కెపాసిటీతో పని చేసి లాభాల బాట పడుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాదాపు రూ.లక్ష కోట్లతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిందని చెప్పారు. ఈ సంస్థను వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తో కలపవచ్చన్నారు. సెయిల్ సంస్థ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్‌తోపాటు కడపలోనూ మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకో సిస్టం ఏర్పడుతుందన్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల ఆస్తులు కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం దాదాపు రూ.25 వేల కోట్ల వరకు మాత్రమే రుణాల మానిటైజేషన్ చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని కేటీఆర్ తెలిపారు. కానీ, అదే స్థాయిలో ఆస్తుల విలువ కలిగిన ప్రైవేట్ కంపెనీలకు మాత్రం దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు రుణాలను పొందగలిగే సౌకర్యం కల్పించిందన్నారు. ప్రయివేట్ కంపెనీలతో సమానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కూ రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. కనీసం రూ.5 వేల కోట్లు కేంద్రమే కేటాయించాలన్నారు. ఇందుకు సరిపడా ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చన్నారు.
కేటీఆర్‌ను ఎలా ఆకట్టుకోవాలి..?
చాట్ జీపీటీ సమాధానమిదే..!!
‘‘మంత్రి కేటీఆర్‌ను ఎలా ఆకట్టుకోవాలి..?’’ అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు చాట్‌జీపీటీ(ఏఐ) టూల్ సవివరంగా సమాధానం ఇచ్చింది. ‘‘ట్విటర్‌లో కేటీఆర్ క్రియాశీలంగా ఉంటారు. ఆయన ట్వీట్లను అనుసరించాలి. ఆయన మంత్రిగా ఉన్న శాఖలకు సంబంధించి, వినూత్న ఆలోచనలు ఆయనకు షేర్ చేయాలి. కేటీఆర్‌ను అనుసరిస్తున్న వారు చాలా మంది ఉన్నందున.. మీ ట్వీట్‌కు ఆయన స్పందిస్తారనే గ్యారెంటీ లేదు’’ అని పేర్కొంది. ఈ విషయాన్ని ఆ విద్యార్థి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయగా.. ‘‘మీ ప్రయత్నానికి ధన్యవాదాలు’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలుగు వారంతా ఏకం కావాలి
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ధి బీఆర్‌ఎ్‌సకు ఉందని కేటీఆర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పనిచేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం కలిసివచ్చే శక్తులు, ప్రజా సంఘాలు, పార్టీలతో కలిసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దానిని కాపాడుకోవడం కోసం తెలుగు వారందరూ కలిసిరావడం అవసరమని తెలిపారు. కేంద్రం కుట్రలు కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతోనే ఆగవని పేర్కొన్నారు. ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎదుర్కొనేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి సంఘీభావం తెలియజేయాలని బీఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు కేటీఆర్ సూచించారు.