Share News

CM Revanth challenge: మీరు వచ్చినప్పుడే చర్చ.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:22 PM

CM Revanth challenge: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్‌కు ఛాలెంజ్‌ విసిరారు సీఎం.

CM Revanth challenge:  మీరు వచ్చినప్పుడే చర్చ.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
CM Revanth challenge

హైదరాబాద్, మార్చి 15: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (Former CM KCR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని అన్నారు. తాము తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని.. కానీ ఇప్పటి వరకు కేసీఆర్‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. రోజా ఇంట్లో కేసీఆర్‌ రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తుచేశారు. ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని అన్నారని.. కానీ గుండెల్లో పెట్టుకుని మహబూబ్‌నగర్ ప్రజలు రాజకీయ భిక్షపెడితే గుండెల మీద తంతారా అని, ఎంపీగా గెలిపించిన పాలమూరు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలోనే సాగర్‌కు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అప్పుడు సైలెంట్‌గా ఉన్న బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కృష్ణా నీటి విషయంలో రాష్ట్రానికి మరణశాసనం రాశారన్నారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచారని గుర్తుచేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా తీసుకుంటామన్నది నిజం కాదా అని నిలదీశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కి.మీ మేర పూర్తి చేశారని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో ప్రాజెక్ట్‌ పనులే చేపట్టలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సానుభూతి చూపించాల్సిన బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. ‘మీ స్ట్రేచర్‌ గురించి ఉన్న ఆలోచన స్టేట్‌ ఫ్యూచర్‌ మీద లేదా. బీఆర్‌ఎస్ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నా.. తప్పేముంది. నేను కేసీఆర్‌ను కించపరిచినట్టు కేటీఆర్‌, హరీష్ రావు‌ విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు.


అది వారి అజ్ఞానమే...

రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని సీఎం అన్నారు. 2022 బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వానికి ప్రజాస్వామ్య విలువలు పాటించలేదని విమర్శించారు. మహిళా గవర్నర్‌ను గత ప్రభుత్వం అవమానించిందన్నారు. గవర్నర్‌ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉండదని.. తమ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజాపాలన అని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తి కాదన్నారు. బలహీనవర్గాలకు చెందిన మహిళా గవర్నర్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవహేళన చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు సీఎం.


బీఆర్‌ఎస్ వాకౌట్..

అయితే సీఎం మాట్లాడుతున్న సమయంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్‌ చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం ప్రసంగాన్ని వినబోమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


ఇలా చేస్తే మిగిలేది సున్నానే..

దీనిపై సీఎం స్పందిస్తూ.. బీఆర్‌ఎస్‌ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సున్నానే మిగులుతుందంటూ ఎద్దేవా చేశారు. కేబినెట్‌ ఆమోదం పొందిన అంశాలే గవర్నర్‌ ప్రసంగంలో ఉంటాయని తెలిపారు. కనీస అవగాహన లేకుండా విపక్ష నేతలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజల కోసం విపక్షాలు సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. గత ప్రభుత్వం కేబినెట్‌ ఆమోదం లేకుండానే గవర్నర్‌ ప్రసంగం ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు గవర్నర్‌ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. అప్పులతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. మొదటి ఏడాదిలోనే రూ.20 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశామన్నారు. మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు. రైతుల నుంచి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడించారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇచ్చామన్నారు. గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అన్నారని.. కానీ కాళేశ్వరం నీళ్లు లేకున్నా రికార్డ్‌ స్థాయిలో ధాన్యం పండిందని తెలిపారు. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసిందన్నారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్‌ అనలేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

Justice for Viveka: ఆరు ఏళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

Turmeric farmers crisis: పసుపు రైతుల పరిస్థితి ఇదీ.. ఆదుకోండి ప్లీజ్

గర్ల్ ఫ్రెండ్‎కి సర్ప్రైజ్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 01:46 PM

News Hub