Telangana BJP: కనీస మర్యాద ఇవ్వకపోతే ఎలా? ఆయనే కారణమంటూ నేతల ఫైర్

ABN , First Publish Date - 2023-09-20T04:46:20+05:30 IST

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ సీనియర్‌ నేతల్లో పలువురిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

Telangana BJP: కనీస మర్యాద ఇవ్వకపోతే ఎలా? ఆయనే కారణమంటూ నేతల ఫైర్

  • అధిష్ఠానంపై బీజేపీ రాష్ట్ర నేతల అసంతృప్తి

  • ఇటీవలి పర్యటనలో అమిత్‌షా కొందరితోనే భేటీ కావటంపై కినుక

  • తమను ఎందుకు ఆహ్వానించలేదని ఆగ్రహం

  • ఈటల ఏకపక్ష వైఖరితో తీవ్ర నష్టమని విమర్శ

  • అంతర్గతంగా సమావేశమై చర్చించిన నేతలు

  • 24న ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం!

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ సీనియర్‌ నేతల్లో పలువురిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అమిత్‌ షా నిర్వహించిన సమావేశానికి తమను ఆహ్వానించకపోవడం పట్ల వారు కినుక వహించినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్‌ నివాసంలో పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, చాడ సురేశ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్‌ విజయరామారావు, రవీంద్రనాయక్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్ఠానం వైఖరి, భవిష్యత్‌ కార్యాచరణతోపాటు పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్‌ వ్యవహార సరళిపైనా చర్చించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్‌షా, ఆదివారం ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘పార్టీ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడి ముఖ్యమైన నాయకులకు సమయం ఇవ్వకపోవడం బాధాకరం. రాష్ట్ర పార్టీలో తామే నలుగురైదుగురం ఉండాలని కొందరు భావిస్తే ఎలా? ఇక మేమెందుకు? ఎన్నికలు వస్తున్న దృష్ట్యా, ఏం చేయాలో కూడా చర్చించకపోతే ఎలా?’ అని ఈ సమావేశంలో పలువురు నేతలు వాపోయారని పార్టీవర్గాలు తెలిపాయి. తమను కూడా ఆహ్వానించే విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని ఉండాల్సిందని, ఆయన చొరవ తీసుకుని సమయం కోరితే అమిత్‌షా కాదనేవారా? అని మరో సీనియర్‌ నేత అన్నారు. మంచి ఊపులో ఉన్న పార్టీని ఇప్పటికే చేజేతులా దెబ్బతీశారు.. ఇప్పుడు ముఖ్యనేతలకూ గుర్తింపు ఇవ్వకపోతే ఎలా? భారీ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కోసం వ్యయప్రయాసలకోర్చి చిత్తశుద్ధితో పని చేస్తున్న తమకు.. కనీస మర్యాద కూడా ఇవ్వకపోతే ఎలా? కృతజ్ఞత లేదు.. అభినందన లేనే లేదు అంటూ సమావేశంలో కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ నేతలు తమ ప్రయోజనాల కోసం మా రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నారేమో అనిపిస్తోంది. ఇక, రాష్ట్రపార్టీలో అన్నీ తామే అంటున్నవారు వారి వ్యక్తిగత ప్రయోజనాలే చూసుకుంటున్నారు’ అని మరో ముఖ్యనేత వాపోయారు. ఈ నెల 24న లేదా ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఒక సీనియర్‌ నేత వెల్లడించారు. కాగా, శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికిన సందర్భంగా, అమిత్‌షా, తమతో చూసీచూడనట్లుగా వ్యవహరించారని మరొక నాయకుడు వాపోయారు.

ఈటల కారణంగానే ఈ దుస్థితి

ఈటల ఒంటెత్తు పోకడతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని కొంతమంది నేతలు విమర్శలు గుప్పించారు. పలు నియోజకవర్గాల నుంచి జరుగుతున్న చేరికల సందర్భంగా తమను కనీసం సంప్రదించడం లేదని ఒకరిద్దరు నేతలు ఆరోపించారు. సిటింగ్‌ ఎమ్మెల్యేలు వస్తారంటూ జాతీయ నాయకత్వాన్ని నమ్మించినోళ్లు, ఇప్పుడు ఊరూపేరూ లేనోళ్లను తీసుకొచ్చి చేరుస్తున్నరు.. అని వారు పేర్కొన్నట్లు సమాచారం.

వచ్చే నెల 2న రాష్ట్రానికి మోదీ !

ప్రధాని మోదీ అక్టోబరు 2న తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం మోదీ 2న మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఆరోజు ఉదయం మహబూబ్‌నగర్‌లో, సాయంత్రం నల్లగొండ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని రాష్ట్ర పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Updated Date - 2023-09-20T12:45:10+05:30 IST