లక్ష్యం చేరేనా!
ABN , First Publish Date - 2023-02-21T00:43:13+05:30 IST
వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో మందకొడిగా కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం గడువు ముంచుకొస్తుండడంతో కేటాయించిన పని రోజుల లక్ష్యం పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధిక సంఖ్యలో కూలీలు హాజరైతే పనిరోజుల లక్ష్యం చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఉపాధి పనులకు ముంచుకొస్తున్న గడువు
మిగిలింది 40 రోజులే !
ఇప్పటి వరకు పూర్తి చేసింది 50.13 లక్షల పని రోజులు
ఇంకా పూర్తి చేయాల్సింది 21.47 లక్షల పని దినాలు
కూలీల సంఖ్య పెరిగితేనే లక్ష్యం చేరువ
వంద రోజులు పని కల్పించిన అంశంలో 3వ స్థానంలో వికారాబాద్ జిల్లా
వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో మందకొడిగా కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం గడువు ముంచుకొస్తుండడంతో కేటాయించిన పని రోజుల లక్ష్యం పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధిక సంఖ్యలో కూలీలు హాజరైతే పనిరోజుల లక్ష్యం చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.
వికారాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే వారికి పనులు కల్పించాలనేది ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం ముఖ్య ఉద్దేశం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 71.60 లక్షల పని రోజుల పని కల్పించాలనే లక్ష్యం నిర్దేశిస్తే... ఇప్పటి వరకు 50.13 లక్షల పని రోజుల ఉపాధి కల్పించగలిగారు. జిల్లాలో కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యం చేరుకోవాలంటే మరో 21.47 లక్షల పని రోజులు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాకు కేటాయించిన పని రోజుల లక్ష్యంలో ఇప్పటి వరకు 70.01 శాతం పూర్తి చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మిగిలిన 29.99 లక్ష్య శాతం పూర్తి చేయాల్సి ఉంది. పని రోజుల లక్ష్యం పూర్తి చేసేందుకు మరో 40 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 566 గ్రామ పంచాయతీల పరిధిలో 1,80,708 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా, 3,71,043 మంది కూలీలు నమోదయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధి హామీ పనులకు 17,588 మంది హాజరవుతున్నారు. గత నెలతో పోలిస్తే జిల్లాలో కూలీల సంఖ్యను గణనీయంగా పెంచగలిగారు. గతనెల జనవరి 20వ తేదీ నాటికి ఉపాధి హామీ పనులకు 3 వేల మంది కూలీలు హాజరు కాగా, నెల రోజుల వ్యవధిలోనే కూలీల సంఖ్య 17 వేల మందికి పైగా పెంచగలిగారు. ఈనెలాఖరు వరకు కూలీల సంఖ్య 25 వేలకు పైగా పెరిగేలా జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,186 కుటుంబాలు మాత్రమే 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. సాధారణంగా ఉపాధి కూలీకి రోజుకు రూ.257 కూలీ వేతనం నిర్ణయించగా, జిల్లాలో సరాసరి కూలీ వేతనం రూ.202.20 పొందుతున్నారు. ఈ ఏడాది ఇంత వరకు రూ.101.37 కోట్ల వేతనం (కూలీ) పొందేలా కూలీలు ఉపాధి పనులు చేశారు.
కూలీల సంఖ్య పెరిగితేనే ...
ఉపాధి కింద జాబ్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి ఏడాదిలో తప్పని సరిగా వంద రోజుల పాటు ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మారిన నిబంధనలతో పని రోజుల లక్ష్యం సాధించడం ప్రశ్నార్థకంగా మారింది. వేసవి సీజన్‌లో కూలీలు ఎక్కువ సంఖ్యలో ఉపాధి పనులకు హాజరయ్యేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నా కూలీల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. కూలీలు ఎక్కువ సంఖ్యలో హాజరైతే పనిరోజుల లక్ష్యం చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా, వారం రోజులుగా మండుతున్న ఎండల నేపథ్యంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఏ మేర పెరుగుతుందనేది చూడాల్సిందే. ఎండలతో కూలీలు ఇబ్బందులు పడకుండా ఉదయం ఆరు గంటలకే ఉపాధి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా కృషి చేస్తేనే మిగిలిన గడువులోగా పని రోజుల లక్ష్యం సాధించగలుగుతారు. లేదంటే పని రోజుల లక్ష్యంలో వెనకబడడమే కాకుండా ఆ రోజులకు సంబంధించిన కూలీ వేతనాన్ని జిల్లా కూలీలు నష్టపోయే అవకాశం ఉంది.
వంద రోజుల పని కల్పించడంలో తృతీయం
పని అడిగిన ప్రతి కూలీకి లేదనకుండా ఉపాధి కల్పించాలి. కాగా, జిల్లాలో 1,186 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని రోజులు కల్పించగలిగారు. గత ఏడాది జిల్లాలో 20 వేల కుటుంబాల వరకు వంద రోజుల పని దినాల ఉపాధి కల్పించగలిగారు. అయితే ఈ ఏడాది ఎక్కువ కుటుంబాలకు వంద రోజుల ఉపాధి కల్పించడంలో ఆశించిన ప్రగతి సాధించలేకపోయారు. కాగా ఎక్కువ కుటుంబాలకు వంద రోజుల పని కల్పించడంలో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా 3వ స్థానంలో కొనసాగుతోంది.