Telangana: కాకరేపుతున్న కొత్తగూడెం రాజకీయం
ABN , First Publish Date - 2023-05-21T21:08:55+05:30 IST
కొత్తగూడెం రాజకీయం కాకరేపుతోంది. డీహెచ్ శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (MLA Vanama Venkateswara rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం రాజకీయం కాకరేపుతోంది. డీహెచ్ శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (MLA Vanama Venkateswara rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న కౌంటర్ రాజకీయాలపై ఎమ్మెల్యే వనమా మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయ ప్రసంగాలపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ దూకుడుకు BRS పెద్దలు బ్రేక్ వేయకపోవడంతో వనమా అనుచరులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే నాదని వనమా వర్సెస్ డీహెచ్ పోటీపడుతున్నారు. వనమా రాజకీయాల నుంచి తప్పుకోవాలని డీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదిలావుండగా... పబ్లిక్ హెల్త్ డైరక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస రావు (Gadala Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు మాదిరి రిటైర్‌మెంట్ ఉండాలన్నారు. వనమా ఎనభై ఎండ్ల వయస్సులో ఇంకా రాజకీయాలు ఎందుకు? అని ప్రశ్నించారు. నేను జీఎస్.అర్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తోంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీటింగ్‌లకు వచ్చే వారికి దళిత బంధు పెన్షన్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోరాడితే పోయేదేమీ లేదు భానిస సంకెళ్లు తప్ప అంటూ గడల సంచలన వ్యాఖ్యలు చేశారు.