Share News

Immunotherapy for Liver Cancer: ఇమ్యునోథెరపీతో కాలేయ క్యాన్సర్‌ ఖతం

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:38 AM

ఇమ్యునోథెరపీ ద్వారా కాలేయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ప్రాముఖ్యమైన చికిత్స అందించబడుతోంది. ఈ కొత్త పద్ధతి, సర్జరీ మరియు కీమోథెరపీతో పోలిస్తే మరింత సమర్థవంతమైన పరిష్కారం చూపిస్తోంది

Immunotherapy for Liver Cancer: ఇమ్యునోథెరపీతో కాలేయ క్యాన్సర్‌ ఖతం

క్యాన్సర్‌ కేర్‌

కాలేయంతో తిష్ఠ వేసి, సంప్రదాయ చికిత్సలకు లొంగని క్యాన్సర్‌కు ముకుతాడు వేసే ఇమ్యునోథెరపీ చికిత్స అందుబాటులోకొచ్చింది. కణితిని కృశించేలా చేయడంతో పాటు, సర్జరీ, కీమోథెరపీ చికిత్సలకు తగ్గట్టు వ్యాధి తీవ్రతను తగ్గించే ఈ చికిత్సతో సత్ఫలితాన్ని సాధించవచ్చంటున్నారు వైద్యులు.

సాధారణంగా కాలేయ క్యాన్సర్లలో రెండు రకాలుంటాయి. ఒక రకం క్యాన్సర్‌ శరీరంలోని ఇతరత్రా అవయవాల నుంచి కాలేయానికి సోకుతూ ఉంటుంది. ఇంకొక రకం క్యాన్సర్‌, కాలేయంలోనే పుడుతూ ఉంటుంది. పొట్ట, పెద్ద పేగులు... ఇలా జీర్ణ వ్యవస్థ నుంచి కాలేయానికి పాకే క్యాన్సర్లను, ‘హెపటో సెల్యులర్‌ కార్సినోమా’ (హెచ్‌సియు) అంటారు. సాధారణంగా శరీరంలో పుట్టుకొచ్చే రొమ్ము క్యాన్సర్‌, థైరాయిడ్‌ క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్ల లాంటి ఇతర క్యాన్సర్లు కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటే, కాలేయ క్యాన్సర్‌ ఒక్కటే అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. పైగా ప్రపంచవ్యాప్తంగా హెచ్‌సియు ఆరవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా, ప్రపంచవ్యాప్తంగా మరణానికి కారణమయ్యే మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా గుర్తింపు పొందింది. కాలేయ క్యాన్సర్‌ అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్‌గా పరిణమించడానికి కారణం, అప్పటికే సిర్రోసిస్ తో దెబ్బతిన్న కాలేయంలో క్యాన్సర్‌ గడ్డ పెరగడమే! సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లేదా థైరాయిడ్‌ క్యాన్సర్లు ఆయా అవయవాలకు సోకిన సందర్భాల్లో, ఆయా అవయవాలు అప్పటివరకూ ఆరోగ్యంగానే ఉంటాయి. కాబట్టి ఆ క్యాన్సర్‌లను నయం చేయడం సులభతరం అవుతూ ఉంటుంది. కానీ హెపటో సెల్యులర్‌ కార్సినోమాలో, సిర్రోసిస్ తో ముందు నుంచే దెబ్బతిన్న కాలేయానికి క్యాన్సర్‌ సోకుతుంది. కాబట్టి ఈ క్యాన్సర్‌ చికిత్స క్లిష్టమవుతుంది.


sfjhv.jpg

కారణాలు అనేకం

గతంలో మన దేశంలో, కాలేయ క్యాన్సర్‌కు హెపటైటిస్‌ బి, సి వైర్‌సలు ప్రధాన కారకాలుగా ఉండేవి. దీంతో సిర్రోసిస్ కు గురైన కాలేయంలో క్యాన్సర్‌ కణుతులు పెరుగుతూ ఉండేవి. కానీ ప్రస్తుతం కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం మూలంగా కాలేయ క్యాన్సర్‌ సోకే సందర్భాలు పెరిగిపోతున్నాయి. అలాగే టైప్‌2 మధుమేహం, ఊబకాయాలు కూడా కాలేయ కొవ్వుకు తోడ్పడి, కాలేయ సిర్రోసిస్ కూ, అంతిమంగా కాలేయ క్యాన్సర్‌కూ దారి తీస్తున్నాయి. కాలేయ కొవ్వు సమస్య ఉన్నప్పుడు కాలేయం సిర్రోసిస్‌ దశకు చేరుకునేలోపే క్యాన్సర్‌ కణుతులు ఏర్పడే ప్రమాదం 30 శాతం మేరకు ఉంటుంది. కాబట్టి ఈ కోవకు చెందిన వారు అప్రమత్తంగా ఉంటూ, క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్, సిటి స్కాన్‌, ట్యూమర్‌ మార్కర్‌ పరీక్షలు చేయించుకుంటూ, పరిస్థితి అనుమానాస్పదంగా కనిపించినప్పుడు ఎమ్మారై చేయించుకుని చికిత్సలను ఆశ్రయించాలి.


పలు రకాల చికిత్సలతో...

కాలేయ క్యాన్సర్‌కు వైద్యులు రెండు రకాల చికిత్సలను అనుసరిస్తూ ఉంటారు. కణితితో పాటు దాని చుట్టూరా ఉన్న కణజాలాన్ని తొలగించడం లేదా కాలేయ మార్పిడి చేపట్టడం... ఈ రెండు చికిత్సలనే వైద్యులు ఆశ్రయిస్తూ ఉంటారు. ఒకవేళ కణితిని తొలగించే పరిస్థితి లేనప్పుడు, కణితిని కాల్చేసే మైక్రోవేవ్‌, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ చికిత్సలను అనుసరిస్తారు. అలాగే క్రయోథెరపీ ద్వారా కణితిని ఘనీభవించేలా చేయడం లేదా కణితిని చంపేలా దానితో అనుసంధానమై ఉన్న రక్తనాళం ద్వారా నేరుగా కణితికి ఔషధాన్ని సరఫరా చేసే చికిత్సను కూడా వైద్యులు ఎంచుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్‌ పైపూత కలిగిన బీడ్స్‌ను కణితికి రక్తసరఫరా చేసే రక్తనాళంలో ప్రవేశపెడతారు. మునుపు, బయటి నుంచి అందించే రేడియేషన్‌ వల్ల, సిర్రోసిస్‌ బారిన పడి ముందునుంచే దెబ్బతిన్న కాలేయం మరింత దెబ్బతినే పరిస్థితి తలెత్తుతూ ఉండేది. కానీ ఈ నష్టాన్ని నివారించడం కోసం అత్యాధునిక చికిత్సా విధానం అమల్లోకొచ్చింది. అదే.. ‘ఎమ్‌ఆర్‌ లినాక్‌’!


సమర్థమైన ఇమ్యునోథెరపీ

ఎమ్‌ఆర్‌ లినాక్‌ చికిత్సలో రేడియేషన్‌ సూటిగా క్యాన్సర్‌ కణితికే తప్ప, దాని చుట్టూరా ఉన్న కణజాలానికి సోకదు. దాంతో రేడియేషన్‌ సహాయంతో క్యాన్సర్‌ కణితిని సమర్థంగా కాల్చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాలేయంలో ఒకటి కంటే ఎక్కువ కణుతులు ఉన్నప్పుడు, ఇలాంటి రేడియేషన్‌తో ఒకొక్క కణితినీ కాల్చుకుంటూ వెళ్లడం వీలుపడదు. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు సిస్టమిక్‌ థెరపీని ఎంచుకుంటారు. సాధారణంగా పలు రకాల క్యాన్సర్ల చికిత్సల్లో మొదట సర్జరీ, ఆ తర్వాత కీమో ఇవ్వడం జరుగుతుంది. కానీ కాలేయ కణుతులు కీమోథెరపీకి పెద్దగా స్పందించవు. కాబట్టి ఈ తరహా కాలేయ క్యాన్సర్‌కు అందించే కీమోథెరపీ, నోటి మాత్రలతో కొనసాగుతుంది. అలాగే సమర్థమైన ఇమ్యునోథెరపీ కూడా సత్ఫలితాన్ని అందిస్తుంది. ఈ ధెరపీలో శరీరానికి అందించే ఏజెంట్స్‌ వ్యాధినిరోధకవ్యవస్థను చైతన్యం చేస్తాయి. శరీరంలో కణితికి సంబంధించిన కణాలు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, నిఘా కణాలు ఈ అసాధారణ కణాలను కనిపెట్టి, అవి తిష్ఠవేసిన అవయవం దగ్గరకు చేరుకుని వాటిని అంతమొందిస్తూ ఉంటాయి. కానీ కొందర్లో ఈ నిఘా కణాలు చురుకుదనాన్ని కోల్పోతాయి. ఇలాంటి సందర్భాల్లోనే కణుతులు ఏర్పడతాయి. ఇమ్యునోథెరపీ చికిత్సతో వ్యాధినిరోధక వ్యవస్థను కుదుపుకు గురి చేసి, చురుకుదనాన్ని కోల్పోయిన కణాలను చైతన్యపరచడం జరుగుతుంది. అయితే ఇమ్యునోథెరపీలో రెండు రకాల ఔషధాలను అందిస్తారు. ఒకటి వ్యాధినిరోధక కణాల సంఖ్యను పెంచితే, ఇంకొకటి కణితి చుట్టూరా కొత్త రక్తనాళాలు పెరగకుండా నివారిస్తుంది.


మునుపు కాలేయ క్యాన్సర్‌ చివరి దశకు చేరుకున్న వారికి, జీవించే అవకాశాలు ఎంతో పరిమితంగా ఉండేవి. వీరి జీవితకాలం కొన్ని నెలలకే పరిమితమై ఉండేది. తాజా ఇమ్యునోథెరపీతో ఈ సమయాన్ని కొన్నేళ్లకు పెంచే వీలు కలుగుతోంది. మరీముఖ్యంగా స్ర్టైడ్‌ చికిత్సా విధానంతో ఐదేళ్ల వరకూ ఆయుష్షును పెంచుకునే వెసులుబాటు కలుగుతోంది. మునుపు ఈ దశకు చేరుకున్న రోగులకు సర్జరీ, కాలేయ మార్పిడిలను ఆశ్రయించే పరిస్థితి ఉండేది కాదు. కానీ తాజా ఇమ్యునోథెరపీతో కాలేయ మార్పిడికి వీలుగా, కాలేయంలోని కణుతుల సంఖ్యను తగ్గించే సౌలభ్యం దక్కుతోంది.

ఈ లక్షణాల మీద కన్నేసి...

  • పైపొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం

  • పక్కటెముకల అడుగున ముడి ఏర్పడినట్టు అసౌకర్యం కలుగుతూ ఉండడం

  • కామెర్లు

  • పొట్ట వాపు, పొట్టలో నీరు

  • ఆకలి మందగించడం

  • బరువు తగ్గడం

  • వాంతులు, తలతిరుగుడు

నివారణ ఇలా...

సిర్రోసిస్ ను నియంత్రించగలిగితే హెపటో సెల్యులర్‌ కార్సినోమా అనే కాలేయ క్యాన్సర్‌ను నివరించుకోవచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలైన హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, స్థూలకాయం, మధుమేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్లు తీసుకోవాలి. మధుమేహాన్ని సకాలంలో గుర్తించి చికిత్స మొదలుపెట్టాలి. మధుమేహం అదుపు తప్పకుండా చూసుకోవడంతో పటు సమతులాహారంతో బరువును అదుపులో పెట్టుకోవాలి. అలాగే కాలేయాన్ని దెబ్బతీసే మద్యపానం లాంటి దురలవాట్లను మానుకోవాలి.

-డాక్టర్‌ ధర్మేష్‌ కపూర్‌

సీనియర్‌ హెపటాలజిస్ట్‌ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ స్పెషలిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.


ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 05:38 AM