Share News

Hyderabad: హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:15 AM

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులను చల్లబర్చే నిర్ణయాలు తీసుకుంది.

Hyderabad: హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత
HCU

  • వర్సిటీ క్యాంపస్‌ నుంచి బలగాల ఉపసంహరణ

  • రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థుల విడుదలకు చర్యలు

  • ఫేక్‌ ఫోటోలు, వీడియోల ప్రచారంపై కేసులు తప్పవు

  • వర్సిటీ టీచర్లతో భేటీ అనంతరం భట్టి కమిటీ నిర్ణయం

  • 400 ఎకరాల్లో పోలీసుల మోహరింపు ఉంటుంది

  • సుప్రీంలో తేలేవరకు దాని యథాతథ స్థితిని కాపాడాలి

  • కారణాలను వివరించిన మంత్రుల బృందం

  • సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షీ నటరాజన్‌

  • ఫేక్‌ వీడియోలపై కఠిన చర్యలకు సీఎం రేవంత్‌ ఆదేశం

  • ఇప్పటికే 150 మందిపై కేసుల నమోదు

  • పోస్టులను తొలగించిన కిషన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులను చల్లబర్చే నిర్ణయాలు తీసుకుంది. కంచ గచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపై నమోదైన కేసులను సోమవారం ఉపసంహరించింది. యూనివర్సిటీలోని పోలీసు బలగాలను కూడా ఉపసంహరించుకుంది. అయితే కృత్రిమ మేథ(ఏఐ) ఆధారంగా తప్పుడు (ఫేక్‌) ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసిన వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఫొటోలు, వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్న వారు ఎవరైనా, వారి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని, అందరిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ సచివాయ వర్సిటీ ఉపాధ్యాయులతో, ప్రజాసంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబులతో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంటలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అభిషేక్‌ మహంతి, న్యాయశాఖ అధికారులు కూడా హాజరయ్యారు.


వర్సిటీ అధ్యాపకుల సంఘం, పౌర సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లను మంత్రుల కమిటీ ముందు ఉంచారు. వర్సిటీలో బలగాల ఉపసంహరణ, విద్యార్థులపై కేసుల ఎత్తివేత అందులో ప్రధానమైనవి. కేంద్ర సాధికార కమిటీ క్యాంప్‌సను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడానికి, జీవవైవిధ్య సర్వే నిర్వహణకు నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకుల బృందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే జేఏసీ నాయకులు మంత్రుల కమిటీతో భేటీ అవుతారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందిస్తూ, కేసుల తీవ్రతను తెలుసుకున్న తర్వాత వాటిని ఎత్తివేయడంపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వర్సిటీ విజ్ఞప్తి మేరకే క్యాంప్‌సలో బలగాలను మోహరించామని, మళ్లీ వర్సిటీయే లిఖితపూర్వకంగా కోరితే తొలగిస్తామని తెలిపారు. సమావేశం ముగిసిన కాసేపటికే వర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల విజ్ఞప్తిని అనుసరించి, విద్యార్థులపై కేసులను ఎత్తేస్తున్నట్లు భట్టి ప్రకటించారు. పోలీసు బలగాలను ఉపసంహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జ్యుడీషియల్‌ రిమాండులో ఉన్న ఇద్దరు విద్యార్థుల కేసుల ఉపసంహరణకు తక్షణమే చర్యలు చేపట్టాలని నిర్దేశించినట్లు ప్రకటించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.


తాము తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ బీజే రావుకు లేఖ రాశారు. 400 ఎకరాల్లో మినహా యూనివర్సిటీలో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని, వర్సిటీలో శాంతి భద్రతల సమస్యను యూనివర్సిటీయే చూసుకోవాలని తేల్చిచెప్పారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని రక్షించడానికి పోలీసుల పహారా తప్పనిసరి అని స్పష్టం చేశారు. తదుపరి కోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరినీ 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని చెప్పారు. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి మంత్రుల కమిటీ అనుకూలంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న దృష్ట్యా న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు రావడం కుదరదని స్పష్టం చేశారు. అయితే, విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు వినడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మంత్రుల బృందాన్ని కలిసిన వారిలో వర్సిటీ అధ్యాపకులు సౌమ్య దేచమ్మ, శ్రీపర్ణ దాస్‌, భంగ్యా భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు కిరణ్‌ కుమార్‌, వి.సంధ్య, సజయ, ఇమ్రాన్‌ సిద్దిఖీ తదితరులు ఉన్నారు.


సమావేశానికి ముందు సీఎంతో మంతనాలు

వర్సిటీ టీచర్లతో సమావేశానికి ముందు ఉదయం మంత్రుల బృందం సచివాలయంలోనే ఉన్న ముఖ్యమంత్రితో చర్చించింది. విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయమై నలుగురూ మాట్లాడుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసుల నమోదుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫేక్‌ పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో విచారణ అంశాలను సీఎం ఆరా తీశారు. ఇందులో రాజకీయ నాయకులు, ప్రముఖులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సినీ ప్రముఖుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.


పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

అధ్యాపక సంఘం విజ్ఞప్తి మేరకు వర్సిటీ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ బీజే రావుకు రాసిన లేఖలో వెల్లడించారు. ‘‘హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్వయంప్రతిపత్తి, బోధన, పరిశోధనల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అచంచల విశ్వాసం ఉంది. యూనివర్సిటీలో శాంతి భద్రతలు, విద్యార్థులు, అధ్యాపకుల భద్రతకు క్యాంప్‌సలో పోలీసులను అందుబాటులో ఉంచాలంటూ ఈ నెల 2న మీ రిజిస్ట్రార్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు గతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ఉపాధ్యాయ జేఏసీ, పౌర సంఘం సభ్యుల విజ్ఞప్తికి స్పందించి కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమిలో మినహా మెయిన్‌ క్యాంపస్‌ సమీపంలో పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నాం’’ అని వివరించారు. వీసీ నుంచి లిఖితపూర్వకంగా హామీ లభించిన తర్వాతే బలగాలను ఉపసంహరిస్తున్నట్లు భట్టి తెలిపారు.

మీనాక్షి హాజరుపై చర్చ

సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ హాజరవడం హాట్‌ టాపిక్‌గా మారింది. శనివారం మంత్రుల కమిటీ సమావేశంలో ఆమె పాల్గొనడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఏ హోదాలో ఆమె పాల్గొన్నారని నిలదీశారు. గాంధీభవన్‌ ఉండగా ఆమె సచివాలయానికి వచ్చి మంత్రులతో పాటు సమీక్షించడమేంటని అన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ సోమవారం ఆమె మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొనడం చర్చనీయంగా మారింది.


కట్టడి చేయండి: డీజీపీ జితేందర్‌

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ జితేందర్‌ పోలీసు అధికారులను కోరారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాల వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి వాటి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ సోమవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, సీఐడీ చీఫ్‌ శిఖా గోయెల్‌, శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్‌ భగవత్‌ ఇతర ముఖ్య అధికారులు, కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలు పాల్గొన్నారు. 2024లో మొదటి అర్ధ భాగంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రంలో నేరాల సంఖ్య 4.9ు తగ్గాయని సీఐడీ చీఫ్‌ శిఖా గోయెల్‌ వివరించారు. దొంగతనాలు మినహా అన్ని ప్రధాన నేరాలు తగ్గాయన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల పరిష్కారం 20.49 శాతం పెరిగిందని తెలిపారు.


అటవీ శాఖ అధికారుల భేటీ

కంచ గచిబౌలి భూములపై అటవీ శాఖ అధికారులు అరణ్య భవన్‌లో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. అవి అటవీ భూములు కాదన్న విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ వన్య ప్రాణుల రక్షణ అటవీ శాఖ పరిధిలోకి వస్తుండటంతో ప్రధానంగా ఆ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. వివాదాస్పద భూముల్లో వన్య ప్రాణుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో శాఖాపరంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. జింకలు మృతి చెందడం, గాయపడి జనావాసాల్లోకి వస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిల్లో వాస్తవికత ఎంత అన్న దానిపై నివేదికలు రూపొందిస్తున్నారు. ఆ ప్రాంతంలో కుక్కల దాడిలో జింకలు గాయపడటం, మృతి చెందడం అప్పుడప్పుడూ జరుగుతున్నదే అయినప్పటికీ వర్సిటీ వివాదం నేపథ్యంలో వాటి రక్షణకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో అనుసరించనున్న విధానాలపై అటవీ శాఖ అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..

మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 07:30 AM