Share News

Global Market Meltdown: బ్లాక్‌ మండే

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:31 AM

ట్రంప్‌ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ 5% క్షీణించి మదుపరుల ₹14 లక్షల కోట్ల సంపద ఆవిరైంది

Global Market Meltdown: బ్లాక్‌ మండే

  • కుప్పకూలిన ప్రామాణిక సూచీలు .. ఆరంభ ట్రేడింగ్‌లో 5 శాతానికి పైగా క్షీణించిన సెన్సెక్స్‌, నిఫ్టీ

  • క్షణాల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి.. చివరికి 2,226 పాయింట్ల నష్టంతో

  • 73,137.90 వద్ద ముగిసిన సెన్సెక్స్‌.. నిఫ్టీ 743 పాయింట్లు డౌన్‌.. 22,161 వద్ద క్లోజింగ్‌

  • మదుపరులకు రూ.14 లక్షల కోట్ల నష్టం

ముంబై: ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను ట్రంప్‌ సుంకాలు కుదిపేస్తున్నాయి. ఆ ధాటికి సూచీలు కుప్పకూలుతున్నాయి. మన దలాల్‌స్ట్రీట్‌ కూడా రక్తమోడింది. భారీ పతనంతో మదుపరుల నష్టాల ఘోష మిన్నంటింది. ట్రేడింగ్‌ ఆరంభంలోనే సూచీలు 5 శాతానికి పైగా క్షీణించాయి. క్షణాల్లో రూ.20 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ సంపద హరించుకుపోయింది. ఈ ‘సుంక’ష్టాలు ఇంతటితో ఆగేలా.. ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. ముందుంది ముసళ్ల పండగ. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం తీవ్రతరం కానుందని.. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం దాదాపు ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంటే, మార్కెట్లకు ఇది ట్రైలరేనా..? బేర్‌ మహా విశ్వరూపాన్ని త్వరలోనే చూడాల్సి వస్తుందా..? వేచి చూడాల్సిందే..

  • బీఎస్ ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే 3,939.68 పాయింట్లు (5.22 శాతం) పతనమై 71,425.01 వద్దకు జారుకుంది. ఆ తర్వాత కాస్త తేరుకున్న సూచీ, చివరికి 2,226.79 పాయింట్ల (2.95 శాతం) నష్టంతో 73,137.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ప్రారంభంలోనే 1,160.80 పాయింట్లు (5.06 శాతం) క్షీణించి 21,743.65 వద్దకు జారుకుంది. చివర్లో 742.85 పాయింట్ల (3.24 శాతం) నష్టంతో 22,161.60 వద్ద ముగిసింది. ట్రంప్‌ సుంకాల దెబ్బకు సూచీలు భారీగా నష్టపోవడం వరుసగా ఇది మూడో రోజు.

  • ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రారంభ ట్రేడింగ్‌లో రూ.20.16 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. చివరికి రూ.14.09 లక్షల కోట్ల తరుగుదలతో రూ.389.25 లక్షల కోట్లకు (4.54 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.


  • గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఫిబ్రవరి వరకు వరుసగా 5 నెలల పాటు దిద్దుబాటుకు లోనైన స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు గత నెలలో మళ్లీ 6 శాతం వరకు పుంజుకున్నాయి. ట్రంప్‌ సుంకాల ప్రభావంతో ఏర్పడిన వరుస నష్టాల కారణంగా సూచీలు మళ్లీ వేగంగా తగ్గుతూ వచ్చాయి. మార్చి 24 గరిష్ఠ స్థాయితో పోలిస్తే దాదాపు రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో హిందుస్థాన్‌ యూనిలీవర్‌ మినహా అన్నీ నష్టపోయాయి. టాటా స్టీల్‌ షేరు 7.73 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌ 5 శాతానికి పైగా పతనమవగా.. కోటక్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం 4.33 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 3 శాతానికి పైగా క్షీణించాయి.

  • బీఎస్ఈలోని స్మాల్‌క్యాప్‌ సూచీ 4.13 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3.46 శాతం నష్టపోయాయి. రంగాలవారీ సూచీలన్నీ నేలచూపులు చూశాయి. మెటల్‌ ఇండెక్స్‌ ఏకంగా 6.22 శాతం తరిగిపోయింది. రియల్టీ 5.69 శాతం పడిపోయింది. కమోడిటీస్‌, ఇండస్ట్రియల్స్‌ 4 శాతానికి పైగా తగ్గాయి.

  • ఠ బీఎ్‌సఈలో 3,515 కంపెనీల షేర్లు నష్టపోగా.. 570 లాభపడ్డాయి. 140 యథాతథంగా ముగిశాయి. 775 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 11 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

  • ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు క్షీణించి రూ.85.76 వద్ద ముగిసింది. గడిచిన ఐదు వారాల్లో రూపాయి మారకం విలువలో ఇదే అతిపెద్ద నష్టం. అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడటంతో పాటు ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ ఈక్విటీ మార్కెట్లో భారీ నష్టాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉపసంహరణ మన కరెన్సీకి గండికొట్టాయని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి.

  • అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు పీపా ధర ఒకదశలో 3.61% తగ్గి 63.21 డాలర్లకు దిగివచ్చింది.


మెల్టింగ్‌ మెటల్‌

సుంకాల దెబ్బకు లోహ రంగ షేర్ల ధరలు వేగంగా కరిగిపోతున్నాయి. మిగతా రంగాలతో పోలిస్తే మెటల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రతరమైంది. బీఎ్‌సఈలో నాల్కో షేరు 8.18 శాతం పతనమవగా.. టాటా స్టీల్‌ 7.73 శాతం, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ 7.58 శాతం, సెయిల్‌ 7.06 శాతం, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ 6.90 శాతం, వేదాంత 6.90 శాతం, జిందాల్‌ స్టెయిల్‌నెస్‌ స్టీల్‌ 6.36 శాతం, హిందాల్కో 6.26 శాతం, ఎన్‌ఎండీసీ 5.75 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 4.89 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 4.77 శాతం నష్టపోయాయి. దాంతో బీఎ్‌సఈలోని మెటల్‌ సూచీ 6 శాతానికి పైగా తగ్గింది.

డీమ్యాట్‌ ఖాతాలపైనా సుంకాల ఎఫెక్ట్‌!

ట్రంప్‌ సుంకాల కారణంగా గత కొంతకాలంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. దాంతో మార్కెట్‌ భవిష్యత్‌ దిశ, రాబడులపైనా అనిశ్చితి నెలకొంది. తత్ఫలితంగా స్టాక్‌ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించాలనుకునేవారూ సరైన సమ యం కోసం వేచి చూస్తున్నారు. ఇది మార్కెట్లో ట్రేడింగ్‌ నెరిపేందుకు అవసరమైన డీమ్యాట్‌ ఖాతాల వృద్ధిపైనా ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది మార్చిలో కొత్తగా 20.4 లక్షల డీమ్యాట్‌ అకౌంట్లను తెరిచారు. నెలవారీ ఖాతాల వృ ద్ధిలో 23 నెలల (2023 ఏప్రిల్‌ తర్వాత) కనిష్ఠ స్థాయి ఇది. ఈ ఫిబ్రవరిలో కొత్తగా తెరిచిన 30.3 లక్షల అకౌం ట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి. కొత్త ఖాతాలు తగ్గడం వరుసగా ఇది మూడోనెల. ఫిబ్రవరిలో 19.040 కోట్లుగా ఉన్న మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య ఈ మార్చి చివరి నాటికి 19.244 కోట్లకు చేరుకుంది.


రూ.9,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సోమ వారం ఒక్కరోజే నికరంగా రూ.9,040 కోట్ల షేర్లను విక్రయించారు.విలువపరంగా ఎఫ్‌పీఐలకు ఈ ఏడాదిలో ఇది రెండో అతిపెద్ద ఒక్కరోజు నికర విక్రయం. ఫిబ్రవరి28న మార్కెట్‌ నుంచి నికరంగా రూ.11,639 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

టాప్‌-5 కుబేరులకు 85,800 కోట్ల నష్టం

స్టాక్‌ మార్కెట్‌ మహా పతనంతో దేశంలోని ఐదుగురు అత్యంత ధనవంతుల సంపద ఒక్కరోజులోనే 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.85,800 కోట్లు) మేర తరిగిపోయింది. ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్ల జాబితా ప్రకారం.. భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఆస్తి 290 కోట్ల డాలర్ల (రూ.24,882 కోట్లు) మేర తగ్గి మొత్తం 8,840 కోట్ల డాలర్లకు (రూ.7.58 లక్షల కోట్లు) పడిపోయింది. రెండో అతిపెద్ద ధనవంతుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ నెట్‌వర్త్‌ 280 కోట్ల డాలర్ల (రూ.24,024 కోట్లు) తగ్గుదలతో 5,760 కోట్ల డాలర్లకు (రూ.4.94 లక్షల కోట్లు) జారుకుంది. దేశంలో అత్యంత సంపన్న మహిళ, జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ 230 కోట్ల డాలర్లు (రూ.19,734 కోట్లు) నష్టపోయారు. దాంతో ఆమె కుటుంబ ఆస్తి 3,380 కోట్ల డాలర్లకు (రూ.2.90 లక్షల కోట్లు) పడిపోయింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ నెట్‌వర్త్‌ 90.2 కోట్ల డాలర్లు (రూ.7,740 కోట్లు) తగ్గి 3,150 కోట్ల డాలర్లకు (రూ.2.70 లక్షల కోట్లు) జారుకుంది. దేశంలో ఐదో అత్యంత సంపన్నుడు, సన్‌ ఫార్మా చైర్మన్‌ దిలీప్‌ సంఘ్వీ 63.2 కోట్ల డాలర్లు (రూ.5,423 కోట్లు) నష్టపోయారు. దాంతో ఆయన ఆస్తి 2,630 కోట్ల డాలర్లకు (రూ.2.26 లక్షల కోట్లు) పరిమితమైంది.


  • గ్లోబల్‌ సూచీలు విలవిల

  • మన మార్కెట్టే కాస్త మెరుగు

అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లతో పోలిస్తే భారత సూచీలు తక్కువ నష్టాలతోనే సరిపెట్టుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే, సోమవారం చైనాకు చెందిన షాంఘై ఇండెక్స్‌ 7.34 శాతం, జపాన్‌ నిక్కీ 7.83 శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 13.22 శాతం క్షీణించాయి. యూరప్‌ మార్కెట్లదీ అదే పరిస్థితి. గతవారం చివరి రెండు సెషన్లలో 10 శాతం వరకు క్షీణించిన ఐరోపా సూచీలు.. సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో 4 శాతం వరకు నష్టపోయాయి. గత శుక్రవారం అమెరికాలోని డౌజోన్స్‌ 5.50 శాతం, నాస్‌డాక్‌ 5.82 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 5.97 శాతం పతనమయ్యాయి. గత వారంలో చివరి రెండు సెషన్లలో అమెరికా స్టాక్‌ మార్కెట్లో 5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.428 లక్షల కోట్లు) సంపద ఆవిరైంది. సోమవారం ట్రేడింగ్‌లోనూ యూఎస్‌ ఇండెక్స్‌లు తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో డౌజోన్స్‌ 700 పాయింట్ల వరకు తగ్గింది. ఎస్‌ అండ్‌ పీ, నాస్‌డాక్‌ సైతం ఒక శాతానికి పైగా నష్టపోయాయి.

  • గత 10 నెలల్లో అతిపెద్ద క్షీణత

మన ఈక్విటీ సూచీలకు గత 10 నెలల్లో ఇదే అతిపెద్ద ఒక్కరోజు క్షీణత. చివరగా, 2024 జూన్‌ 4న సెన్సెక్స్‌ 4,389.73 పాయింట్లు (5.74 శాతం), నిఫ్టీ 1,379.40 పాయింట్లు (5.93 శాతం) పతనమయ్యాయి. ఇంట్రాడేలోనైతే సెన్సెక్స్‌ 6,234.35 పాయింట్లు (8.15 శాతం), నిఫ్టీ 1,982.45 పాయింట్ల (8.52 శాతం) పడిపోయాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ లభించకపోవడం అందుకు కారణం. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో 2020 మార్చి 23న సెన్సెక్స్‌, నిఫ్టీ ఒక్కరోజే 13 శాతం మేర నష్టపోయాయి.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 05:39 AM