Share News

ప్యాడీ క్లీనింగ్‌ చేస్తేనే కాంటా వేస్తాం

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:34 AM

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్యాడీ క్లీనర్‌తో శుభ్రం చేసిన ధాన్యం మాత్రమే కాంటా వేయాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు రావడం తో నిర్వాహకులు కొనుగోళ్లు నిలిపివేశారు.

ప్యాడీ క్లీనింగ్‌ చేస్తేనే కాంటా వేస్తాం
తిప్పర్తిలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో అశోక్‌రెడ్డి

నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా అధికారులు

తిప్పర్తి మార్కెట్‌లో నాలుగు రోజులుగా రైతుల అవస్థ

తిప్పర్తి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్యాడీ క్లీనర్‌తో శుభ్రం చేసిన ధాన్యం మాత్రమే కాంటా వేయాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు రావడం తో నిర్వాహకులు కొనుగోళ్లు నిలిపివేశారు. ధాన్యంలో తాలు ఉందనే కారణంతో తిప్పర్తి మార్కెట్‌ యార్డులో నాలుగు రోజుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం సుమారు మూడు వేల క్వింటాళ్ల ధాన్యం లోడ్‌ చేసేందుకు కాంటా వేసి ఉంచగా బస్తాలు పాడవకుండా లోడ్‌తో మిల్లులకు వెళ్లిన లారీలు ఇప్పటి వరకు దిగుమతి కాలేదు. ఈ కారణంతో లారీ యజమానులు లోడ్‌ చేసేందుకు అనుమతించలేదు. దీంతో మరో రెండు రోజులు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటి నుంచి మంచి ధాన్యం పంపిస్తామని నిర్వాహకులు చెప్పడంతో రెండు, మూడు లారీల ధాన్యం దిగుమతి చేసుకున్న మిల్లు నిర్వాహకులు ఎక్కువ తాలు వస్తోందని ఆదివారం నుంచి దిగుమతి నిలిపివేశారు. దీంతో అక్కడికి వెళ్లిన నాలుగు లారీల ఽధాన్యం దిగుమతి కాకుండానే మిల్లుల్లోనే ఉండిపోయింది. ఈ కారణంతో సోమవారం తిప్పర్తి మార్కెట్‌లో కాంటా వేయడమే నిలిపివేశారు. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకోవడంతో మార్కెట్‌లో నిల్వ ఉన్న ధాన్యం సుమారు 25 వేల నుంచి 30 వేల క్వింటాళ్ల వరకు ఉండవచ్చు. ధాన్యం కాంటాలు నిలిచిపోయాయనే సమాచారంతో సోమవారం సాయంత్రం నల్లగొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి, డీసీవో పాఛ్చానాయక్‌లతో పాటు జిల్లా, మండల స్థాయి నాయకులు ధాన్యం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ధాన్యం ప్యాడీ క్లీనర్‌లతో శుభ్రం చేస్తే తప్ప కాంటా వేసేది లేదని నిర్వాహకులకు సూచించి వెళ్లారు. అదే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్‌లో ప్యాడీ క్లీనర్‌ నడిచేలా విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ పరుశురామ్‌, మార్కెట్‌ చైర్మన్‌ జూకూరి రమేష్‌, పాశం సంపత్‌రెడ్డి, ఏవో సన్నిరాజు, ఏఈవో అవినా్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:34 AM