ప్రపంచంలోనే ప్రప్రథమం.. వర్మ చేతుల మీదుగా ‘తెలుగు పబ్’ ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-16T01:04:12+05:30 IST
ప్రపంచంలోనే ప్రప్రథమం.. వర్మ చేతుల మీదుగా ‘తెలుగు పబ్’ ప్రారంభం
హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో ‘రుచికరమైన విప్లవాలు’ ఎన్నింటినో అలవోకగా ఆవిష్కరిస్తున్న ప్రముఖ దర్శకుడు కూచిపూడి వెంకట్... తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. ఆహ్లాదకరమైన అటవీ వాతావరణాన్ని తలపించేలా వెంకట్ సారథ్యంలో గచ్చిబౌలిలో ప్రారంభమై... నోరూరించే రుచులతో భోజన ప్రియులను ఉర్రూతలూగిస్తున్న ‘మారేడుమిల్లి’ రెస్టారెంట్‌కు అనుసంధానంగా ‘తెలుగు పబ్’కు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెంకట్.. ‘డీజే అప్పారావ్’ అనే సంగీత ప్రియుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. హోటల్ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన ‘మారెడుమిల్లి’ రెస్టారెంట్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘తెలుగు పబ్’ను దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించి.. ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి.. కూచిపూడి వెంకట్ ప్రవేశ పెట్టిన ‘బీర్టెయిల్ - డీజే అప్పారావ్’ అనే కాన్సెప్ట్ తనకు విపరీతంగా నచ్చాయని, ఇవి కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతాయని ఆర్జీవి పేర్కొన్నారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఈ అచ్చ ‘తెలుగు పబ్’ పసందైన వినోదం అందించనుంది.
‘మొదటి సినిమా, జాన్ అప్పారావు 40 ప్లస్’ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకున్న కూచిపూడి వెంకట్.. పబ్‌లో పాశ్చాత్య సంగీతం మాత్రమే ఎందుకు ప్లే చేయాలి? అచ్చమైన మన తెలుగు పాటలు ఎందుకు వినిపించకూడదు? మన పాటలు... ఏ పాటల కంటే తక్కువ? అనే మథనం నుంచి ‘తెలుగు పబ్’ పురుడు పోసుకుందని తెలిపారు. అలాగే బీరును పలు రకాల తెలుగు ఫ్లేవర్స్‌లో అందించడం కోసం ‘బీర్టెయిల్’కు జీవం పోశామని, ‘మారేడుమిల్లి’ ప్రియులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేరే ఫ్లోర్‌లో ఇది ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే తన మూడో చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా ఆయన వెల్లడించారు.