TDP: పక్కదారి పట్టిన మద్యం
ABN , Publish Date - May 12 , 2024 | 12:09 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకరోజు ముందే మద్యం షాపుల్లో మందు కరువైంది. వైనషాపుల్లోకి రాకముందే పక్కదారి పట్టడంతోనే దుకాణాలు మూసివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎక్కడచూసినా వైనషాపుల వద్ద మందుబాబులు ఎగబడి మరీ దొరికిన మద్యాన్ని తీసుకున్నారు.
ఎగబడ్డ మందుబాబులు
బార్లలో అధికరేట్లకు విక్రయం
తాడిపత్రిటౌన, మే11: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకరోజు ముందే మద్యం షాపుల్లో మందు కరువైంది. వైనషాపుల్లోకి రాకముందే పక్కదారి పట్టడంతోనే దుకాణాలు మూసివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎక్కడచూసినా వైనషాపుల వద్ద మందుబాబులు ఎగబడి మరీ దొరికిన మద్యాన్ని తీసుకున్నారు. కొన్నిషాపుల్లో అరగంట, గంటసేపు మాత్రమే విక్రయాలు జరిపి మూసివేశారు. మద్యం దొరకనివారు బార్లలో అధికరేట్లు వెచ్చించి మద్యం కొనుగోలు చేయడం గమనార్హం. పోలింగ్‌ను పురస్కరించుకొని 48గంటల ముందే మద్యంషాపులు, బార్లు మూసివేయాలన్న నిబంధన ఉంది. కానీ కొందరు రెండురోజుల ముందునుంచే పెద్దఎత్తున మద్యంకేసులను గ్రామాలకు తరలించారని సమాచారం. ముఖ్యంగా అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే అమ్మకాలు జరుగుతుండడంతో ముందుగానే ఓటర్లకు పంచేందుకు తరలించారని తెలుస్తోంది. అలాగే యల్లనూరు, పుట్లూరు మండలాల్లో మద్యం షాపులు మూతపడడంతో కర్ణాటక నుంచి అక్రమంగా తెచ్చిన టెట్రాప్యాకెట్లు హల్‌చల్ చేస్తున్నాయి.
గుంతకల్లుటౌన,: పట్టణంలో మధ్యాహ్నానికే మద్యం షాపులు బంద్ అయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడనున్నది. మద్యం విక్రయానికి 6గంటల వరకు సమయం ఉండగా మద్యం అయిపోయిందని షాపులు మూసివేశారు. ఎప్పుడూ లేని విధంగా మధ్యాహ్నం 2గంటలకే షాపులు బంద్ చేయడంతో ప్రభుత్వంపై మందు బాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుత్తి: సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో శనివారం మధ్యాహ్నం మద్యం షాపుల వద్ద మందుబాబులతో కిటకిటలాడాయి. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయడంతో మద్యం దుకాణాల వద్ద మందు బాబులు క్యూకట్టారు.