CID Investigation :అష్టదిగ్బంధనంలో అరబిందో
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:25 AM
వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది.
కాకినాడ పోర్టు లాభాలను పంచుకోడానికి వీల్లేదు
ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోం
డివిడెండ్లు తీసుకున్నా చర్యలు తప్పవని సీఐడీ హెచ్చరిక
లాక్కోవడమే అక్రమం.. ఇక లాభాలు అంటే నేరమే
నాలుగేళ్లలో రూ.102 కోట్లు తీసుకున్నారు
ఇక ఆపేయండంటూ అధికారుల స్పష్టీకరణ
అరబిందో డైరెక్టర్లను త్వరలో విచారించనున్న సీఐడీ
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో డైరెక్టర్లు, ఆరో ఇన్‌ఫ్రా సంస్థకు తాజాగా లేఖలు రాసింది. వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడి 2021లో కేవీ రావు నుంచి 41.12 శాతం వాటాలు లాక్కున్నారని, దానిపై వచ్చిన లాభాలు, డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదని ఆ లేఖలో హెచ్చరించింది. అలా పంచుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆ లేఖలో స్పష్టం చేశారు. ‘‘డివిడెంట్ కింద రూ.102కోట్లు నాలుగేళ్లలో తీసుకున్నారు. ఇక ఆపేయండి’ అని తేల్చిచెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు లేఖలో ఏముందంటే.. ‘ కేవీ రావు నుంచి యాజమాన్య హక్కులు లాక్కున్న దానిపై మేం విచారణ జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఆ రోజు మీరు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారు. అధికారం ఉందని ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం ఉంది. దానిపై విచారణ జరుపుతున్నాం. పూర్తి హక్కులున్న కేవీ రావును బెదిరించినట్లు ఆయన చెబుతున్న అంశాలపై సమాచారం సేకరిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక్క అడుగు ముందుకేసినా చట్టపరమైన చర్యలు తప్పవు. ఇప్పటివరకు కూడా పూర్తి హక్కులు తనకే ఉన్నట్లు కేవీ రావు ఆధారాలు సమర్పించారు. మీకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించండి.. దానిపైనా న్యాయబద్ధంగా విచారణ చేపడతాం.. బాధితుడిగా ఉన్న కేవీరావు హక్కులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.
అసలైన బాధితుడికి రక్షణ కల్పించడమే మా విధి. కేవీ రావును బెదిరించి ఆయనకు సంబంధించిన వాటాలు రాయించుకున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఇదే నిజమని తేలితే మీరు చట్టపరంగా బాధ్యులు అవుతారు. అప్పట్లో అధికారంలో ఉన్న వ్యక్తులు మీకు బెదిరింపులకు సంబంధించి సహకరించారన్నదానిపై పోలీసు శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి ఒక్క రూపాయి కూడా ఏ రూపంలోనూ తీసుకోవడానికి మీరు అర్హులు కారు. లావాదేవీలన్నీ ఆపేయండి’ అని సీఐడీ రాసిన లేఖలో వివరించినట్లు తెలసింది.
‘ డైరెక్టర్లను పిలిచి విచారిస్తాం’
అరబిందో డైరెక్టర్లను త్వరలో విచారిస్తామని సీఐడీ తెలిపింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు సీఐడీ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ లేఖ రాశారు. అరబిందో డైరెక్టర్లను పిలిచి విచారించబోతున్న సీఐడీ అధికారులు....తమకు లభించే ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించ బోతున్నారు. జగన్ ప్రభుత్వంలో భయపెట్టి.. బెదిరించి... కాకినాడ పోర్టు, సెజ్‌లు లాగేసుకోవడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న కుమారుడు ఈ వ్యవహారంలో ఏ1గా ఉండగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి(అరబిందో), శ్రీధర్ సంతానం ఎల్‌ఎల్‌పీ ఆడిటర్ ఇందులో మిగతా నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వమే మాఫియాగా చెలరేగి ఒక వ్యాపారవేత్త నుంచి లాక్కున్న వందల కోట్ల ఆస్తుల వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తిరగదోడి బాధితుడికి న్యాయం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులోభాగంగా నిందితులకు నోటీసులు జారీ చేసింది. చట్టపరమైన చర్యలకు ఉపక్రమించబోతోంది.