AP HIgh Court: వైసీపీకి కి గట్టి షాక్!
ABN, Publish Date - Jun 02 , 2024 | 03:58 AM
పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో
ఈసీ ఉత్తర్వులపై జోక్యం చేసుకోం
ఎన్నికల పిటిషన్ దాఖలుకు అవకాశం
అది కూడా ఫలితాలు ప్రకటించాకే
హైకోర్టు ఉత్తర్వులు.. పిటిషన్ కొట్టివేత
బెడిసి కొట్టిన అధికార పార్టీ కుటిల వ్యూహం
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది.
ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యాన్ని పరిష్కరించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శనివారం తీర్పు చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఇదే పిటిషన్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరుతూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల డ్యూటీలో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులకు గత నెల 30న ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు.
ఫెసిలిటేషన్ సెంటర్‌లోని అటెస్టింగ్ ఆఫీసర్‌ను రిటర్నింగ్ అధికారే నియమించారని, ఈ నేపథ్యంలో ఫాం 13(ఏ)పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆ అధికారి పేరు, సీలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 329(బీ) ప్రకారం ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు.
ఈసీ నిర్ణయాలపై ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే సవాల్ చేయగలరని తెలిపారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో ధర్మాసనం శుక్రవారం తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం శనివారం నిర్ణయాన్ని వెల్లడించింది.
బెడిసి కొట్టిన వైసీపీ వ్యూహం
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని రకాల అడ్డదార్లు తొక్కి విఫలమైన వైసీపీ, చివరికి కోర్టులో కూడా భంగపాటుకు గురైంది. ఎన్నికల అధికారులు, విపక్షాలపై అనేక విమర్శలు చేసిన వైసీపీ చివరికి పోస్టల్ బ్యాలెట్‌పై భారీ ఆరోపణలు గుప్పించింది. పోస్టల్ బ్యాలెట్‌ను తప్పుదోవ పట్టించి టీడీపీని దెబ్బకొట్టాలని ప్రయత్నించింది.
కానీ వైసీపీ రాజకీయ కుటిల వ్యూహానికి హైకోర్టు చెక్ పెట్టేంది. పోస్టల్ బ్యాలెట్‌లో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. కాగా, పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత ఓటమి ఖాయమని తాడేపల్లి పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ ఏదో ఒక విధంగా ఎన్నికల ప్రక్రియలో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్‌పై రాజకీయం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్‌ను అడ్డుకోవానికి కోర్టును ఆశ్రయించారు. అక్కడే వైసీపీ మాస్టర్ ప్లానతో పాటు కుటిల వ్యూహం బట్టబయలైంది. పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోతే దాన్ని తిరస్కరించాలన్నది వైసీపీ డిమాండ్. ఒక రాజకీయ పార్టీగా ఉండి, ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు ఈ ఆలోచన రావడమే విచిత్రం.
నిబంధనలకు అనుగుణంగానే
బ్యాలెట్ పేపర్‌పై పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, ఫొటో, దానికి ఎదురుగా పార్టీ గుర్తు ఉంటాయి. ఓటరు తన ఓటు ఎవరికి వేయాలని నిర్ణయిస్తారో ఆ గుర్తుపై స్వస్థిక్ మార్క్ వేస్తారు. ఇప్పుడు ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ కూడా అలానే ఉంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌పైన స్వస్థిక్ సింబల్ కాకుండా వారు ఎవరికి ఓటు వేయాలని అనుకుంటున్నారో ఆ గుర్తుపై టిక్ చేస్తే సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగానే ఓటు వేశారు.
అంతేకాకుండా ఆర్వో సంతకం ఉందా? సీల్ వేయాలా? అసలు ఆర్వో ఉన్నారా? ఆర్వోను ఈసీనే నియమించిందా? వంటి విషయాలతో ఉద్యోగులకు సంబంధం లేదు. తాము ఓటు వేశామన్న విషయాన్ని మాత్రమే వారు చూసుకుంటారు. కానీ, వైసీపీ మాత్రం ఆర్వో సంతకం, సీల్ వేయని ఓట్లు చెల్లకుండా చేయాలని వాదనకు దిగింది. భారీగా వేసిన ఉద్యోగుల ఓట్లు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించడంతోనే ఈ వివాదాన్ని సృష్టించినట్టు పరిశీలకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వాటిని చెలుబాటు కాకుండా చేసే ఎత్తుగడ వేసింది. ఈ కుట్రలో భాగంగానే కోర్టుకు వెళ్లింది. అయితే, హైకోర్టు మాత్రం ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. దీంతో ఆ పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది.
Updated Date - Jun 02 , 2024 | 03:58 AM