AP Elections: వైసీపీలో వణుకు పుట్టిస్తున్న ఆ మహిళ..!
ABN, Publish Date - Apr 26 , 2024 | 07:58 PM
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న కొందరు నాయకులు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లో చేరిపోయారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో ఎక్కువ భాగం రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి వైపు మళ్లింది. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసినా ఒక్కసీటు గెలుపొందలేదు. క్రమంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును జగన్ తనవైపు తిప్పుకోగలిగారు.
కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సాధించడానికి ప్రస్తుతం తన ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికిప్పుడు పూర్వ వైభవం రాకపోయినా.. నెమ్మదిగా రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా వామపక్షాలతో కలిసి ఏపీలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించడం ద్వారా.. కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దీంతో కాంగ్రెస్‌కు దూరమైన ఓటు బ్యాంకు మళ్లీ హస్తం పార్టీకి దగ్గరయ్యే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. దీంతో తమకు గతంతో పోలిస్తే ఓట్ల శాతం తగ్గుతుందనే ఆందోళనలో వైసీపీ నాయకులు ఉన్నట్లు కనిపిస్తోంది.
AP Elections 2024: రాపాక నమ్మించి ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్
షర్మిల ఎంట్రీతో..
ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌లోనే ఉంటూ క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్న నాయకులను ఒకచోటకు చేర్చగలిగారు. దీంతో గతంలో హస్తం పార్టీలో ఓ వెలుగు వెలిగిన రఘువీరారెడ్డి, పల్లంరాజు వంటి నాయకులను షర్మిల యాక్టివ్ చేయగలిగింది. మరోవైపు ఎన్నికల్లో పోటీచేయడానికే అభ్యర్థులు లేరనే స్థాయి నుంచి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగలిగే ప్రయత్నానికి షర్మిల శ్రీకారం చుట్టారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపారు. కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు లేకపోయినా.. హస్తం పార్టీ చీల్చగలిగే ఓట్లపై ఇతర పార్టీల గెలుపోటములు ఆధారపడే అవకాశం ఉంది. మరోవైపు షర్మిల కడప ఎంపీగా పోటీచేస్తుండటంతో.. ఆమె ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. దీంతో కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలనే వైసీపీ ఆశలపై షర్మిల నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది.
వైసీపీకి ఓట్లు తగ్గితే..
వైసీపీ 2019లో 151 సీట్లు సాధించడంలో ఎస్సీ, ఎస్టీల ఓట్లు కీలకపాత్ర పోషించాయి. 2014కు ముందు ఈ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవాళ్లు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ యాక్టివ్ అవుతుండటంతో ఆ పార్టీ వైపు ఈ ఓటర్లు మొగ్గుచూపితే మాత్రం వైసీపీకి భారీ దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత వైసీపీలో వణుకు మొదలైందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో వైసీపీకి లాభమా.. నష్టమా అనేది మాత్రం జూన్4న తేలనుంది.
AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest Election News or Telugu News
Updated Date - Apr 26 , 2024 | 08:11 PM