AP Election Results: పైకి గెలుపు గాంభీర్యం.. లోపల భయం.. ఇదీ నేతల పరిస్థితి..
ABN, Publish Date - May 19 , 2024 | 09:14 AM
ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన పామర్రులో అధికారం మాదంటే మాదేనంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా పేదలకు అందించిన పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలతో వైసీపీ అభ్యర్థి రెండోసారి గెలుపొందటం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ప్రగాల్భాలు పలుకుతుండగా, వారికి దీటుగా ఎన్టీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ..
పామర్రు, మే 19: ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన పామర్రులో అధికారం మాదంటే మాదేనంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా పేదలకు అందించిన పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలతో వైసీపీ అభ్యర్థి రెండోసారి గెలుపొందటం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ప్రగాల్భాలు పలుకుతుండగా, వారికి దీటుగా ఎన్టీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు గత ఐదేళ్ల వైసీపీ పాలనతో అభివృద్ధిని విస్మరించి ఇసుక, పేదల ఇళ్లస్థలాల్లో జరిగిన అవినీతి పాలనకు ప్రజలు విసుగు చెంది ఉన్నారని, అంతేకాక ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని, చంద్రబాబు పేదల సంక్షేమానికి పెట్టిన సూపర్ సిక్స్ పథకాల పట్ల ఆకర్షితులై సైకిల్, గాజు గ్లాసు గుర్తుకు అధికంగా ఓట్లు వేశారనే ధీమాతో ఉన్నారు. అంతేకాక నియోజవర్గంలో అధికంగా ఉన్న ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన యువ ఓటర్లతోపాటు, ఆ కులానికి చెందిన వారి ఓటుబ్యాంకు నూటికి 80 శాతం ఈసారి టీడీపీకి లభించిందని దాంతో ఈసారి టీడీపీ గెలుపును ఆపడం ఎవరి తరం కాదంటున్నారు.
2019లో 87.44 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం ప్రస్తుత 88.11 శాతంగా నమోదై జిల్లాలోనే రెండోస్థానంలో అత్యధిక శాతం నమోదైంది. మహిళల ఓట్లు కూడా గతం కంటే ఎక్కువగా నమోదైంది. దీంతో ప్రజలు తమకే అనుకూలంగా తీర్పునిచ్చారని గ్రామాల్లో ఇరుపార్టీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. నియోజకవర్గంలో ఎస్సీల తరువాత అధికంగా ఉన్న కాపు, బీసీ వర్గాల ఓట్లు వైసీపీకి పడినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ ఓటర్లు నూటికి నూరు శాతం వైసీపీ వైపునే ఉన్నారని, ఇది తమ పార్టీ గెలుపునకు తోడ్పడతాయంటున్నారు.
ఇదిలా ఉండగా టీడీపీ సైతం మాజీ సీఎం చంద్రబాబు పామర్రులో నిర్వహించిన ప్రచారంతో పార్టీనేతలు కలిసికట్టుగా పనిచేశారని, అందుకే ఆయా వర్గాలు తమ అభ్యర్థికే ఓటు వేశారని చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి చేసిన తప్పిదాల కారణంగా ఆ పార్టీలోని కొందరు నేతలు సహకరించి తమ పార్టీ గెలుపునకు చేయూతనిచ్చారని టీడీపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఏది ఏమైనా జూన్4న ఫలితాలు వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. నేతలు మాత్రం పైకి విజయం మాదేనంటూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఎక్కడో అనుమానం ఆందోళన వెంటాడుతూనే ఉంది.
విజయావకాశాలపై విస్తృత సమీక్షలు..
ఇదిలా ఉండగా అసెంబ్లీ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థుల కార్యాలయాల్లో విజయావకాశాలపై విస్తృత సమీక్షలు నిర్వహించేందుకు పొలిటికల్ ఆడిటర్లు రంగంలోకి దిగారు. గ్రామాలు, బూత్‌ల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయోనని బూత్ ఏజెంట్లు గ్రామస్థాయి నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎక్కడ వీక్‌గా ఉన్నారనే అంశాలపై చర్చలు జరుపు తూ బిజీగా ఉన్నారు. బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, ప్రత్యర్థి పార్టీకి ఎన్ని, అనుకూలంగా ఎన్ని పోలయ్యాయనే అంచనా ల్లో తల మునకలై ఉన్నారు. ఫలితాలకు ఇంకా పక్షం రోజుల పైనే వ్యవధి ఉండటంతో అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది.
నియోజకవర్గంలో ఐదు మండలాల్లో తోట్లవల్లూరులో వైసీపీ కొంతబలంగానే ఉన్నట్టు, మొవ్వలో కొన్ని గ్రామాలు వైసీపీ ప్రభావం ఉన్నా చివరికి సల్ప అధిక్యత టీడీపీకే ఉంటుందని, పెదపారుపూడి 50–50గా నిలిచినా, పమిడిముక్కల, పామరర్రు మండలాల్లో అత్యధిక మెజార్టీ టీడీపీదేనని పొలిటికల్ ఆడిటర్లు లెక్కలు వేసినట్టు తెలుస్తోంది. ఈ ఉత్కంఠ చివరకు భారీస్థాయిలో బెట్టింగ్‌కు దారితీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అయితే బెట్టింగుల్లోనూ వైసీపీ గెలుపుపై పందెం కాసేందుకు పందెం రాయుళ్లు కొంత వెనకడుగు వేస్తున్నట్టు భోగట్టా.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 19 , 2024 | 10:16 AM