AP Elections 2024: ఓటమి భయమా..? నాని, వంశీ కొత్త ట్రిక్స్..!
ABN, Publish Date - Apr 26 , 2024 | 11:41 AM
‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’
తన చివరి ఎన్నికలంటూ కొడాలి నాని ఇప్పటికే సానుభూతి అస్త్రం
అదే బాటలో వల్లభనేని వంశీ కూడా..
వచ్చే ఎన్నికల్లో దుట్టా కుమార్తె పోటీ అంటూ మరో వ్యాఖ్య
మాటలతో దుట్టా ఫ్యామిలీని మంచి చేసుకునే ప్రయత్నం
నామినేషన్ అనంతరం కల్లబొల్లి కబుర్లు
నాడు పదవి రాకుండా అడ్డుపడి.. నేడు ఓట్ల కోసం డ్రామాలు
‘వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు(Dutta Ramachandra Rao) కూతురు సీతామహాలక్ష్మి వైసీపీ(YSRCP) తరఫున పోటీలో ఉంటారు. ఆమెకు మేము సపోర్టు చేస్తాం. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, గతంలో ఏ రకంగా అయితే విజయవాడ(Vijayawada) పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయినా మా అమ్మ పేరుతో చారిటబుల్ ట్రస్టు పెట్టి గన్నవరంలో ఏ విధంగానైతే సేవలు చేశామో అవన్నీ కొనసాగుతాయి.’
..గురువారం గన్నవరంలో నామినేషన్ వేసిన అనంతరం వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలివి. ఒకప్పుడు దుట్టా రామచంద్రరావును నానా దుర్భాషలాడిన వంశీకి అకస్మాత్తుగా ఆయన కుమార్తె గురించి ఎందుకంత పాజిటివ్‌గా మాట్లాడారు? ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఒక్కసారిగా దుట్టా ఫ్యామిలీపై ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది..? అనే గుసగుసలు గన్నవరం నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి.
(విజయవాడ–ఆంధ్రజ్యోతి) : ఆది నుంచీ దుట్టా రామచంద్రరావు కుటుంబం ఎదుగుదలను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహించలేకపోయారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రభావవంతమైన నాయకుడిగా ఉన్న దుట్టా రామచంద్రరావుకు వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో, ఆ తర్వాత వైసీపీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన దుట్టా.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ చేతిలో 10వేలలోపు ఓట్లతో ఓడిపోయారు. 2019లో వైసీపీ అధిష్ఠానం యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ కేటాయించినా.. దుట్టా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎప్పుడైతే వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారో అప్పటి నుంచి దుట్టా అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో దుట్టా వర్గం మద్దతు కోసం వంశీ ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఇటీవల నియోజకవర్గంలో బస్సు యాత్ర చేసిన సమయంలో జగన్ వద్దకు దుట్టా రామచంద్రరావును పిలిపించిన వంశీ తనకు మద్దతుగా పనిచేయాలని చెప్పించగా, ఆయన ఎలాంటి హామీ ఇవ్వకుండా వెనుదిరిగారని సమాచారం. దీంతో ఎలాగైనా దుట్టా మద్దతు కూడగట్టేందుకు తొలుత ఆయన అల్లుడు శివభరత్‌రెడ్డితో తనకు అనుకూలంగా మాట్లాడించిన వంశీ.. తాజాగా దుట్టా కుమార్తె మద్దతు కూడగట్టేందుకు వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని ప్రకటించి మైండ్‌గేమ్‌కు తెరదీశారు. ఈ కారణంగానైనా దుట్టా మద్దతు లభిస్తుందన్న ఆలోచనలో వంశీ ఉన్నట్లు తెలుస్తోంది.
నాడు పదవి రాకుండా చేసి..
వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దుట్టా సీతామహాలక్ష్మి ఉంగుటూరు నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో కాపు సామాజికవర్గానికి చెందిన సీతామహాలక్ష్మికి జెడ్పీ పీఠం ఖాయం అన్న ప్రచారం జరిగింది. అయితే, చివరి నిమిషంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ చక్రం తిప్పి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న గుడ్లవల్లేరు జెడ్పీటీసీగా గెలుపొందిన బీసీ సామాజికవర్గానికి చెందిన ఉప్పాల హారికకు చైర్‌పర్సన్ పీఠం దక్కేలా చేశారు. దుట్టా కుటుంబానికి జెడ్పీ పీఠం దక్కితే గన్నవరం నియోజకవర్గంలో తనకు పోటీ అధికార కేంద్రం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వంశీ పావులు కదపడం వల్లే దక్కాల్సిన పదవి దక్కకుండా పోయిందని అప్పట్లో దుట్టా వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఓటమి భయం వెంటాడుతుండటంతో వంశీ అదే కుటుంబానికి పదవి ఆశచూపి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని దుట్టా వర్గీయులు విమర్శిస్తున్నారు.
ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ డ్రామా..
వంశీ గురువారం చేసిన వ్యాఖ్యల్లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీతామహాలక్ష్మి వైసీపీ తరఫున పోటీ చేస్తారని, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు.. నన్ను గెలిపించాలి..’ అని పరోక్షంగా ప్రజలకు విజ్ఞప్తి చేసి సెంటిమెంట్‌తో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు ఆయన మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. గతంలో విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీచేసి ఓడిపోయినా గన్నవరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగించానని, ఈసారి కూడా సేవలు కొనసాగుతాయని అన్న మాటలు అందుకు సంకేతాలు ఇచ్చేలా ఉన్నాయని వైసీపీ నాయకులే చెబుతున్నారు. వంశీ సన్నిహితుడు, గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కూడా ఇవే తన చివరి ఎన్నికల సెంటిమెంట్‌ను ఇప్పటికే గుడివాడలో ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన సోదరుడి కొడుక్కి ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తాడని నాని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చివరి ఎన్నికలు కాబట్టి ఈ ఒక్కసారి తనకు ఓటు వేయాలంటూ ఓటర్లను సెంటిమెంట్‌తో ఆకట్టుకునేందుకే నాని ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం మీద బూతు బ్రదర్స్‌గా పేరొందిన నాని, వంశీలు ఇద్దరూ ఒకే సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకుని ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నించడం గమనార్హం.
For More Andhra Pradesh and Telugu News..
Updated Date - Apr 26 , 2024 | 11:41 AM