Mla Pinnelli: మాచర్లలో పిన్నెల్లి అనుచరుల రౌడీయిజం
ABN, Publish Date - May 27 , 2024 | 03:59 AM
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్ అలియాస్ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు.
టీడీపీ మహిళపై వైసీపీ గూండా వెంకటేశ్ పాశవిక దాడి
వేటకొడవలితో నరకడంతో.. ఆమె తల, ముఖానికి తీవ్రగాయాలు
ఇతడు మాజీ చైర్మన్ తురకా కిశోర్‌కు ప్రధాన అనుచరుడు
ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో నిందితుడు
టీడీపీ కార్యాలయం ధ్వంసంలో కూడా..
144 సెక్షన్ అమల్లో ఉన్నా రౌడీ మూకలను నియంత్రించడంలో పోలీసులు విఫలం
పైగా పరారీలో ఉన్నట్లు బుకాయింపు
మాచర్ల టౌన్, మే 26: పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్ అలియాస్ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు. పట్టణంలోని 22వ వార్డు పాత వడియరాజులపాలెంలో అతడు బాగా మద్యం సేవించి వీధుల్లో గొడవ చేస్తుండగా. టీడీపీకి చెందిన మహిళ తమ్మిశెట్టి లీలావతి ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించింది.
దీంతో అతడు వేటకొడవలితో ఆమెపై విచక్షణరహితంగా దాడి చేశాడు. లీలావతికి ముఖం, తలపై, చేతికి, ఒంటిపై తీవ్రమైన గాయాలయ్యాయి. తనతో పెట్టుకుంటే ఎవరినీ బతకనివ్వనని.. మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అందరికీ ఇదే గతి పడుతుందంటూ వీరంగం వేశాడు. చుట్టుపక్కల ప్రజలు కేకలు వేసి గుమికూడడంతో అక్కడి నుంచి ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన లీలావతిని బంధువులు మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్ అలియాస్ మసి మాచర్ల వైసీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిశోర్‌కు ప్రధాన అనుచరుడు. పలు కేసుల్లో నిందితుడు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక చిన్న కాన్వెంట్ వద్ద టీడీపీ నేత మంజుల వెంకటేశ్వర్లు కుమారుడు కేశవను దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఏ-1గా ఉన్నాడు. పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన అనంతరం బూత్ వెలుపల టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై జరిగిన దాడిలో.. పీడబ్ల్యూడీ కాలనీలో పోలింగ్‌రోజున టీడీపీ నాయకుడు కేశవరెడ్డి ఇంటిపై దాడి చేసి.. పలువురిని గాయపరిచి వాహనాలను ధ్వంసం చేసిన ఘటనలో.. పోలింగ్ మర్నాడు కారంపూడిలో టీడీపీ కార్యాలయం, టీడీపీ సానుభూతిపరుల ఆస్తుల ధ్వంసం, సీఐ నారాయణస్వామిపై జరిగిన దాడిలోనూ వెంకటేశ్ నిందితుడు.
పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ రౌడీల దాడులు కొనసాగుతుండడం, వాటిని అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గూండాలు యథేచ్ఛగా సంచరిస్తూ రాత్రి వేళల్లో దాడులకు దిగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని నిలదీస్తున్నారు. పైగా.. ఎన్నికల సమయంలో గొడవలకు దిగిన వైసీపీ రౌడీ మూకలు పరారీలో ఉన్నట్లు బుకాయిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఆ మూకలే పట్టణంలో విశృంఖలంగా దాడులకు పాల్పడుతున్నారని... వీరిని పట్టుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారని జనం పోలీసులను నిలదీస్తున్నారు.
Read Latest Sports News and Telugu News
Updated Date - May 27 , 2024 | 11:30 AM