AP Elections: మేమూ రెడ్లమే.. జగన్‌ను మళ్లీ గెలిపిస్తే..?
ABN, Publish Date - Apr 02 , 2024 | 04:30 AM
‘పోయిన ఎన్నికల సమయంలో జగన్ గెలిస్తే రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తాడని టీడీపీ నేతలు చెప్పినా వినలేదు..
లోకేశ్‌ను కాదని మిమ్మల్ని గెలిపించి బికారులయ్యాం
మేమూ రెడ్లమే.. రాజధాని మార్పుతో తీవ్రంగా నష్టపోయాం
జగన్‌ను మళ్లీ గెలిపిస్తే... ఆయన విశాఖకు పోతే మా గతేంది?
తాడేపల్లిలో ఆళ్ల, మురుగుడు లావణ్యను నిలదీసిన స్థానికులు
మంగళగిరి, ఏప్రిల్ 1: ‘పోయిన ఎన్నికల సమయంలో జగన్ (YS Jagan Mohan Reddy) గెలిస్తే రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తాడని టీడీపీ నేతలు చెప్పినా వినలేదు. లోకేశ్‌ను ఓడించాం. మిమ్మల్ని గెలిపించాం. జగన్ సీఎం కాగానే మూడు రాజధానులు ముందుకు తెచ్చారు. అమరావతిని కాదని, విశాఖ పరిపాలనా రాజధాని అన్నారు. నమ్మి ఓట్లేసిన మేం బికారులయ్యాం’ అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని స్థానికులు నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో సోమవారం స్థానికులతో సమావేశమైన ఎమ్మెల్యే ఆళ్ల, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యలకు ఎదురైన నిలదీతల పర్వం ఇది.
‘మేమంతా రెడ్లమే. జగన్ మూడు రాజధానుల ప్రకటనతో తీవ్రంగా నష్టపోయాం’ అని సూటిగా చెప్పడంతో వైసీపీ నేతలు బదులివ్వలేకపోయారు. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి లోకేశ్ ఇటీవల వరుసగా బ్రేక్‌ఫాస్ట్ విత్ లోకేశ్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా ఆయనలాగే అపార్ట్‌మెంట్ వాసులతో భేటీ అవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. తొలిగా సోమవారం తాడేపల్లిలోని అమరావతి వన్ అపార్ట్‌మెంట్స్ నుంచి మొదలుపెట్టారు. అభ్యర్థి లావణ్య, ఆళ్ల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తదితరుల బృందం ఆ అపార్ట్‌మెంట్ వాసులతో సమావేశమైంది. ప్రారంభంలోనే ఓ యువకుడు మైకు తీసుకుని. ‘భూముల విలువలు బాగా పడిపోయాయి. మా కమ్యూనిటీనే తీసుకోండి. ఈ అపార్టుమెంట్‌లో ఎస్‌ఎ్‌ఫటీ రూ.5,500 ఉండేది. మూడు రాజధానుల నిర్ణయంతో రూ.3,300లకు కూడా కొనేవారే లేరు. ఈ అపార్టుమెంట్‌లో ఎక్కువమంది రైతు కుటుంబాలే. చాలావరకు మన రెడ్లు ఉండగా, కొందరు చౌదరీస్ కూడా ఉన్నారు. మా అపార్టుమెంట్‌లోని ప్లాట్లలో దేవుడి బొమ్మలు లేవు. అందరి ఇళ్లలో రాజశేఖరరెడ్డి ఫొటోలే ఉన్నాయి. జగన్ మూడు రాజధానుల ప్రకటనతో మేమంతా నష్టపోయాం. ఆయన ప్రస్తుతానికి తాడేపల్లిలో ఉంటున్నారు. రేపు ఎన్నికలయ్యాక విశాఖ నుంచే పాలన చేస్తానంటున్నారు. అపుడు మా పరిస్థితి ఏమిటి? మా ఆస్తుల విలువలు మరింత దిగజారిపోవా? మీరే సమాధానం చెప్పాలి’ అంటూ నిలదీశారు. దీంతో నేతలు కంగుతిన్నారు. ఏం చెప్పాలో పాలుపోక నీళ్లు నమలాల్సి వచ్చింది.
Updated Date - Apr 02 , 2024 | 08:10 AM