తెరపైకి మాజీ డీజీపీ పేరు!
ABN , Publish Date - Sep 01 , 2024 | 04:32 AM
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ మాజీ డీజీపీ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
కాదంబరి కేసులో మరో ట్విస్టు
రెండోరోజూ ముంబై నటి వాంగ్మూలం
శనివారం 10 గంటల పాటు జెత్వానీ
వాంగ్మూలం.. అంతా వీడియో రికార్డింగ్
పోలీసులు ఫిర్యాదుగా స్వీకరించే చాన్స్
సుమారు 200 డాక్యుమెంట్లను చూపించిన విచారణాధికారి
వివరాలు సేకరించిన ఏసీపీ స్రవంతి
తల్లిదండ్రుల నుంచీ వాంగ్మూలం
మరోసారి మీడియా ముందుకు జెత్వానీ
పీఎస్‌ఆర్, కాంతిరాణా కనుసన్నల్లో కేసు
ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్
విజయవాడ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ మాజీ డీజీపీ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడలో కాదంబరి జెత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని విచారణాధికారి స్రవంతిరాయ్ నమోదు చేశారు. శనివారం సుదీర్ఘంగా పది గంటల పాటు కాదంబరి వాంగ్మూలం తీసుకున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి కాదంబరి కుటుంబ సభ్యులు పోలీసు కమిషనరేట్‌కు ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు. రాత్రి 9.30 గంటలకు వారు బయటకు వచ్చారు. వారి వెంట న్యాయవాదులు ఉమే్‌షచంద్ర, పాల్ ఉన్నారు. కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేంద్రకుమార్ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీలను స్రవంతిరాయ్ విచారించారు. వారికి కొంతదూరంగా న్యాయవాదులు ఉన్నారు. కాదంబరిపై నమోదు చేసిన కేసు డైరీని దగ్గర పెట్టుకుని విచారించారు. కాదంబరి శుక్రవారం వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వాంగ్మూలాన్ని స్రవంతిరాయ్ శనివారం మరోసారి నిర్ధారించుకున్నారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని చదివి వినిపించారు. వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. తాను చెప్పిన వాంగ్మూలమంతా సరైనదేనని కాదంబరితో సంతకం చేయించుకున్నారు. ఆ తర్వాత నరేంద్రకుమార్ జెత్వానీ, ఆశా జెత్వానీల వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఇద్దరి వాంగ్మూలాన్ని రికార్డు చేయలేదు. కాదంబరిపై నమోదు చేసిన కేసులో పోలీసులు 200 వరకు డాక్యుమెంట్లను జత చేశారు. వాటిలో ఒక్కోదాన్ని విచారణాధికారి ఆమెకు చూపించారు. ఆ డాక్యుమెంట్‌కు సంబంధించి ముందు, వెనుక జరిగిన వివరాలను కాదంబరి నుంచి సేకరించారు. ప్రతి విషయాన్ని ఆమె కూలంకుషంగా విచారణాధికారికి వివరించారు. అనంతరం విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబును కలిశారు. ఈ కేసులో పోలీసు అధికారులు చేసిన వ్యవహారాలకు సంబంధించి మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఓ మాజీ డీజీపీ పేరు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పోలీసు కమిషనరేట్‌లో కొద్దిరోజుల క్రితం వరకు పనిచేసి ఏలూరు రేంజ్‌కు సరెండర్ అయిన మరో ఇన్‌స్పెక్టర్ పేరు ఈ కేసులో వినిపిస్తోంది. కాదంబరి జెత్వానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు ఫిర్యాదుగా స్వీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సీపీకి అన్నీ వివరించా: కాదంబరి
అన్ని విషయాలను విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబుకు వివరించానని ముంబై నటి కాదంబరి జెత్వానీ చెప్పారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత కొండంత ధైర్యాన్ని ఇచ్చారన్నారు. రెండోసారి శనివారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇంత జరుగుతున్నా ఇంకా కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. నేను హనీట్రాప్ చేసి మోసం చేశానని ఆరోపణలు చేస్తున్నారు. వారికి అసలు హనీట్రాప్ అంటే ఏమిటో తెలుసా? నేను, మాలవ్‌దాని అనే వ్యక్తి వివాహం చేసుకోవాలనుకున్నాం. తర్వాత రద్దు చేసుకున్నాను. నేను మాలవ్‌దానిపై ఎలాంటి కేసు పెట్టలేదు. ఆయన నాపై ఏ కేసూ పెట్టలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్‌లోకి మాలవ్‌దాని విషయాన్ని లాగుతున్నాయి. దానికి, ఈ కేసుకు ఏ సంబంధం ఉంది? ఇప్పుడు జరుగుతున్న కేసు డబ్బులకు సంబంధించినది. ఇద్దరికి నేను భూమి అమ్మాలనుకున్నానని ఆరోపించి కేసులో చేర్చారు. ఇప్పుడు ఆ ఇద్దరూ విద్యాసాగర్‌పై కేసు పెట్టారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, పోలీసు కమిషనర్ కాంతిరాణా కనుసన్నల్లో నాపై కేసు నమోదు చేసి వేధించారు. విశాల్‌గున్నీ ముంబైలో నేను ఉంటున్న అపార్ట్‌మెంట్ వివరాలను స్వయంగా సేకరించారు. 10-15 మంది పోలీసులు లగ్జరీ కారుల్లో వచ్చి ముంబై నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను అరెస్టు చేసి తీసుకొచ్చారు’ అని కాదంబరి చెప్పారు.
ఆమె ఎవరో నాకు తెలియదు
తమకు కాదంబరి జెత్వానీతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెతో ఎలాంటి భూ క్రయవిక్రయాలు జరగలేదని మొవ్వ మండలం కోసూరుకు చెందిన చిందా వీరవెంకట నాగేశ్వరరావు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లతో తన భూమిని వీరవెంకట నాగేశ్వరరాజుకు విక్రయించడానికి కాదంబరి ప్రయత్నాలు చేసిందని విద్యాసాగర్ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు రికార్డుల్లో రాసిన విషయం తెలిసిందే. దీనిపై వీర వెంకట నాగేశ్వరరాజు కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తిరుపతి దర్శనం సిఫార్సు లేఖ కోసం ఆధార్ కార్డుల ఫొటోస్టాట్ కాపీలను గొరిపర్తి శ్రీనివాసరావుకు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్ వాటితో తనతో పాటు బోరుకాటి భరత్‌కుమార్ పేరుపై తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారని ఫిర్యాదు చేశారు. కాదంబరి జెత్వానీ నుంచి పొలం కొనుగోలుకు రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చామని ఇబ్రహీంపట్నం పోలీసులు ఫోన్ చేస్తేనే విషయం తెలిసిందని విరించారు. వాస్తవానికి ఆమె ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు.