Guntur: భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్..
ABN, Publish Date - Nov 30 , 2024 | 07:01 AM
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కల్తీ ఆహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధినిల ఆందోళన నేపథ్యంలో బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించి, త్వరితగతిన నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అమరావతి: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం సంఘటనపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించింది. మహిళా హాస్టల్‌లో ఆహారం నాసిరకంగా ఉండడమే కాకుండా వారం రోజుల క్రితం భోజనంలో కాళ్లజెర్రి వచ్చిందని విద్యార్థినిలు ఆరోపించారు.
నాలుగు రోజుల క్రితం భోజనంలో కప్ప వచ్చిందని.. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు వరసగా అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి వారు ఆందోళనకు దిగారు. వర్సిటీలోని మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ చాంబర్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థినులు నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ ఆందోళన కొనసాగించారు. విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. విచారణ నివేదికను వెంటనే ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - Nov 30 , 2024 | 08:29 AM