AP Govt: కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి.. ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
ABN, Publish Date - Aug 31 , 2024 | 04:23 PM
ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి.కుండపోతగా వాన పడుతుండటంతో విజయవాడలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నలుగురు మృతి చెందారు.
అమరావతి: ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి.కుండపోతగా వాన పడుతుండటంతో విజయవాడలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జలదిగ్బంధంలో ఇబ్రహీంపట్నం, కొండపల్లి...
ఎన్టీఆర్ జిల్లా (ఇబ్రహీంపట్నం): జలదిగ్బంధంలో ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. బుడమేరు వల్ల పెను ప్రమాదం పెంచిఉంది. బుడమేరు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండపల్లి ఇబ్రహీంపట్నంలో అధికారులు విద్యుత్ నిలిపివేశారు. ముంపు ప్రాంతాలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కలెక్టర్ సృజన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Aug 31 , 2024 | 06:06 PM