Minister Gottipati: తిరుమల లడ్డూను కల్తీ చేయడంతో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టారు
ABN, Publish Date - Sep 22 , 2024 | 05:28 PM
పింఛన్ రూ. 1000 పెంచడానికి జగన్‌కి ఐదేళ్లు పట్టిందని.. ఒక్క సంతకంతో రూ. 3 వేలు పింఛన్ చంద్రబాబు రూ. 4 వేలు చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 100 రోజుల్లోనే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రకాశం: పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం కల్తీ చేయడంతో.. కల్తీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు చేశారు. 100 రోజుల్లో ఏం చేశారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని.. మరీ ఐదేళ్లలో మాజీ సీఎం జగన్ ఏం చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. జగన్ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిచామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి రైతులను కాపాడామని స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ... పింఛన్ రూ. 1000 పెంచడానికి జగన్‌కి ఐదేళ్లు పట్టిందని చెప్పారు. ఒక్క సంతకంతో రూ. 3 వేలు పింఛన్‌ను చంద్రబాబు రూ. 4 వేలు చేశారని అన్నారు. 100 రోజుల్లోనే సీఎం చంద్రబాబు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
వరదలో ప్రొక్లైన్‌పై 24 కిలోమీటర్లు చంద్రబాబులా తిరిగిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరని అన్నారు. ఓట్లు వేసే వరకు జనంలో జగన్ ఉన్నారని... ఓట్లు వేసిన తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. అందుకే ప్రజలు ఆయన్ని శాశ్వతంగా ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. జగన్, వైసీపీ నాయకులపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా జగన్‌కి దక్కలేదని అన్నారు. అందుకే వైసీపీ నాయకులు కూడా జగన్‌ని వదిలిపెట్టి వెళ్తున్నారని అన్నారు. గత ఐదేళ్ల క్రితం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకున్నామో ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. వైసీపీ అవినీతిలో మునిగిపోయిన పార్టీ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు చేశారు.
వైసీపీని శాశ్వతంగా తరిమేయాలి: మంత్రి బాల వీరాంజనేయస్వామి
ప్రకాశం : వైసీపీ నాయకులు వెంకటేశ్వరస్వామి లడ్డూను కూడా దుర్వినియోగం చేశారని మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. వైసీపీని శాశ్వతంగా తన్ని తరిమేయాలని అన్నారు. వైసీపీ నాయకులను ప్రజలు తన్ని తరిమేసినా బుద్దిరాలేదన్నారు. ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో మంత్రి బాల వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ... దొంగే దొంగ అన్న విధంగా వైసీపీ నేతల తీరు ఉందని విమర్శించారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
100 రోజుల్లోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని తెలిపారు. మహిళలకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం ప్రవేశపెడతామని ప్రకటించారు. మహిళలకు నెలకు ఇస్తామని చెప్పిన రూ. 1500 ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.
Updated Date - Sep 22 , 2024 | 05:49 PM