Share News

Heavy Rains : కోస్తాకు మళ్లీ వాన గండం!

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:39 AM

కోస్తా జిల్లాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది.

Heavy Rains : కోస్తాకు మళ్లీ వాన గండం!

  • మరోసారి దిశ మార్చుకుంటున్న తీవ్ర అల్పపీడనం

  • అరుదైన ఘటన అంటున్న వాతావరణ నిపుణులు

విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): కోస్తా జిల్లాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది. నాలుగు రోజులపాటు ఉత్తరాంధ్రలో వరి రైతులకు తీరని నష్టం కలిగించిన అల్పపీడనం దిశ మార్చుకుని చివరకు తీవ్ర అల్పపీడనంగా దక్షిణ కోస్తా దిశగా వస్తోంది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ ఏడాది డిసెంబరులో ఇప్పటికే మూడు పర్యాయాలు అల్పపీడనాలు/వాయుగుండం/తుఫాన్‌ ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వరి, పత్తి, పొగాకు, అపరాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మరోసారి భారీ వర్షాలు కురిస్తే మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

  • బలహీనపడుతుందనుకుంటే...

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం శనివారం సాయంత్రం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా అక్కడే కొనసాగుతోంది. ఇది సముద్రంలోనే తూర్పు ఈశాన్యంగా పయనించే క్రమంలో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ బులెటిన్‌లో శనివారం అంచనా వేశారు. అయితే తీవ్ర అల్పపీడనం ముందుకు వెళ్లేందుకు వాతావరణం సహకరించలేదు. అదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఒంగోలు, మచిలీపట్నానికి మధ్యలో ఉన్న ప్రాంతం నుంచి సమాంతరంగా... తీరానికి సుమారు 400 కి.మీ. దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతిగా దిశ మార్చుకుని సోమవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానున్నది. ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులో ఎక్కడ తీరం దాటుతుంది? అసలు తీరం వరకు వస్తుందా? లేక సముద్రంలోనే బలహీనపడుతుందా? అనేది వాతావరణశాఖ వెల్లడించలేదు.


దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపటవేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ తర్వాత కూడా రెండుమూడు రోజుల వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో వరి, పొగాకు, మిర్చి, పత్తి, ఇతర పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుడొకరు సూచించారు. పొలాల్లో వరి కుప్పలను భద్రపరచుకోవాలన్నారు.

  • వాతావరణ మార్పుల వల్లే..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకోవడం అరుదుగా జరిగే ఘటన అని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా బంగాళాఖాతంలోని తుఫాన్లు కోస్తాంధ్ర వైపుగా వస్తూ.. ఒడిశా/పశ్చిమ బెంగాల్‌ లేదా మయన్మార్‌ తీరం దిశగా వెళ్తుంటాయి. మేలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్‌లు మధ్యబంగాళాఖాతం వరకు వచ్చిన తరువాత మయన్మార్‌ తీరం వైపు.. లేదా కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చిన తరువాత తీరానికి సమాంతరంగా పశ్చిమబెంగాల్‌ వైపు పయనించిన ఘటనలు పలు పర్యాయాలు జరిగాయి. కానీ అల్ప పీడనాలు/తీవ్ర అల్పపీడనాలు సముద్రంలోనే పయనించి వాతావరణం అనుకూలించకపోతే అక్కడే బలహీనపడుతుంటాయి. అటువంటిది పశ్చిమ మధ్యబంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుని దక్షిణ కోస్తా, తమిళనాడు దిశగా పయనించడం అరుదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం అధికారి ఎస్‌.జగన్నాథ కుమార్‌ తెలిపారు. ఇది ఈశాన్యంగా పయనించేందుకు అక్కడి పరిస్థితులు సహకరించడంలేదన్నారు.


అదే సమయంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 28 నుంచి 29 డిగ్రీలు నమోదవుతున్నాయని, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తేమగాలులు నైరుతి బంగాళాఖాతంలోకి పయనిస్తున్నాయని, దీంతో తీవ్ర అల్పపీడనం దిశమార్చుకుందని తెలిపారు. వాతావరణంలో మార్పుల ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనం/వాయుగుండం/తుఫాన్‌లు సంభవిస్తున్నాయన్నారు. ఈ ఏడాది నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తేమ ఉధృతంగా తయారవుతోందని తెలిపారు. సోమవారం కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వ హణ సంస్థ తెలిపింది. తిరుపతి జిల్లాతో పాటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కొన్ని ప్రాంతాల్లో వాన పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. మంగళవారం ఉత్తరాం ధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

Updated Date - Dec 23 , 2024 | 03:41 AM