Share News

ఎన్నాళ్లకు.. ఎన్నేళ్లకు..!

ABN , Publish Date - May 13 , 2024 | 04:51 AM

ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్ల తర్వాత సొంతూరు పులివెందులలో బసచేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన సతీసమేతంగా ఆదివారం పులివెందులకు విచ్చేశారు.

ఎన్నాళ్లకు.. ఎన్నేళ్లకు..!

ఐదేళ్ల తర్వాత సొంతూరిలో సీఎం జగన్‌ బస

2019 ఎన్నికలకు... తిరిగి 2024 ఎన్నికల ముందు

ఇదేనా పులివెందులపై ప్రేమ అంటూ విమర్శలు

కడప, మే 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్ల తర్వాత సొంతూరు పులివెందులలో బసచేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన సతీసమేతంగా ఆదివారం పులివెందులకు విచ్చేశారు. రాత్రికి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకుంటారు. 2019 ఎన్నికల సందర్భంగా పోలింగ్‌కు ఒకరోజు ముందు ఆయన సతీసమేతంగా పులివెందులకు వచ్చారు. ఆరోజు రాత్రి బాకరాపురంలోని ఆయన ఇంట్లో బస చేశారు. సీఎంఅయ్యాక ఏనాడూ పులివెందుల లో బస చేయలేదు. పులివెందులకు వచ్చినా ఆయా కార్యక్రమాలలో పాల్గొని వెళ్లిపోయేవారు. పులివెందుల లేదా కడప పర్యటనకు జగన్‌ వస్తే నేరుగా హెలికాప్టర్‌ ద్వారా ఇడుపులపాయకు వెళ్లి అక్కడ బసచేసేవారు. బాకరాపురంలోని తన ఇంట్లో ఉండేవారు కాదు. వివేకా మృతి అనంతరం భద్రతా కారణాల వల్లే ఆయన ఇక్కడ బస చేయలేదని సమాచారం. బాకరాపురంలో జగన్‌ ఇంద్రభవనాన్ని తలపించే స్థాయిలో సొంతఇంటిని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. కానీ, ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత ఊరిలో బసచేయలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని సొంతూరి ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రతి నెలా పులివెందుల పర్యటనకు వచ్చేవారని, ఇక్కడే అనేకసార్లు బస చేసేవారని అంటున్నారు. పులివెందులకు వచ్చినపుడు ఆ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ కనీసం ఒకరిద్దరిని పేర్లతో పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే వారు. కానీ జగన్‌ దీనికి పూర్తి భిన్నంగా సొంత నియోజకవర్గానికి జగన్‌ వచ్చినా.. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు తప్ప వేరొకరు ఆయన్ను కలవడానికి అవకాశం ఉండదు. సొంత నియోజకవర్గంలోకి వచ్చినప్పటికి పెద్దఎత్తున భద్రత ఏర్పాటు చేయడం, ట్రాఫిక్‌ పూర్తిగా మళ్లించడం, పరదాలు కట్టడం, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టడం జగన్‌ పంథాగా మారింది. మొన్న నామినేషన్‌ వేసేందుకు వచ్చినప్పుడు కూడా అక్కడి ప్రజలు ట్రాఫిక్‌ సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో పులివెందుల ప్రజల్లో జగన్‌పై అంసతృప్తి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజార్టీ తగ్గే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - May 13 , 2024 | 05:24 AM