ఏపీకి ఐఏఎస్ రాజమౌళి
ABN , Publish Date - Jul 07 , 2024 | 03:34 AM
సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక అధికారి రాబోతున్నారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఎ.వి.రాజమౌళి సోమవారం రిపోర్టు చేయనున్నారు.

మూడేళ్ల డిప్యుటేషన్‌కు కేంద్రం సమ్మతి
రేపు రిపోర్టు చేయనున్న రాజమౌళి
సీఎంవోలో ఆయనకు కీలక బాధ్యతలు
కేరళ కేడర్ అధికారి కృష్ణతేజకీ లైన్ క్లియర్
డిప్యుటేషన్‌ను రేపు ఆమోదించే అవకాశం
అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక అధికారి రాబోతున్నారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఎ.వి.రాజమౌళి సోమవారం రిపోర్టు చేయనున్నారు. ఇప్పటికే అపాయింట్‌మెం ట్స్ కేబినెట్ కమిటీ ఆయన డిప్యుటేషన్‌కు సమ్మతి తెలిపింది. ఆయన రాబోయే మూడేళ్ల పాటు ఏపీలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఆయనను తమ రాష్ట్రానికి కేటాయించాలంటూ డీవోపీటికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేంద్రం ఆయనను డిప్యుటేషన్‌పై పంపించేందుకు అంగీకరించింది. 2003 బ్యాచ్‌కు చెందిన రాజమౌళి, గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో డిప్యుటేషన్‌పై పని చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంవో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆయన సీఎంవోలోనే విధులు నిర్వహించనున్నారు. ఆయన రాకతో సీఎంవో అధికారుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర ఉన్నారు. అలానే ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న, అదనపు కార్యదర్శిగా కార్తీకేయ మిశ్రా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగో అధికారిగా సీఎంవోలోకి రాజమౌళి చేరనున్నారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినతి మేరకు ఏపీకి రాబోతున్న కృష్ణతేజకు కూడా దాదాపు లైన్ క్లియర్ అయింది. కేరళ ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా ఆయనను ఏపీకి పంపించేందుకు సమ్మతించింది. ఈ మేరకు సోమవారం అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదించనుంది. ఆయన బుధ, గురువారాల్లో ఏపీలో రిపోర్టు చేయననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖల్లో కీలక అధికారిగా ఆయన కొనసాగే అవకాశం ఉంది.