బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:45 PM
సమాజ ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రుణాలు మంజూరు
వ్యవసాయ రుణాలలో రూ.3,134 కోట్లు మంజూరు
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ శ్రీధర్
రాయచోటి (కలెక్టరేట్), ఆగస్టు 28: సమాజ ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి త్రైమాసికం జూన్ 30వ తేదీ నాటికి క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.3430 కోట్లకు గాను 4520.68 కోట్ల రుణాలు మంజూరు చేసి 128 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి మొదటి ఆర్థిక సంవత్సరానికి త్రైమాసికం నాటికి వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ.2,425 కోట్లు లక్ష్యానికి గాను రూ.3,134 కోట్ల రుణాలు అందజేసి 124 శాతం ఆర్థిక ప్రగతిని సాధించామని తెలిపారు. జూన్ మాసంలో పురోగతి సాధించేందుకు సహకరించిన బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ లావాదేవీలు మరింత బలోపేతం చేయాలన్నారు. బడుగు, బలహీనవర్గాల వారు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘స్టాండప్ ఇండియా’, ముద్ర, గ్రామీణ ఖాదీ బోర్డు వంటి పథకాలతో పాటు పంట రుణాలు, విద్యారుణాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడారు. రిజర్వు బ్యాంక్ స్థాపించి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రాం నిర్వహించాలని కలెక్టర్ ఎల్డీఎంకు సూచించారు. అనంతరం క్వీజ్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదర్శ్ రాజేంద్రన్, ఎస్‌బీఐ అర్‌ఎం మురళి, నాబార్డు ఏజీఎం వినయ్‌విహార్, నవీన్‌కుమార్, మేనేజర్లు, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.