Share News

TDP: ఎంపీ తండ్రిగా పెత్తనమంటే కుదరదు

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:57 PM

నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీ తండ్రినని పెత్తనం చెలాయిస్తే కుదరదని, వైసీపీ నాయకులను టీడీపీలోకి తెస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

TDP: ఎంపీ తండ్రిగా పెత్తనమంటే కుదరదు

  • వైసీపీ నాయకులను టీడీపీలోకి తెస్తానంటే ఒప్పుకోం

  • ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

నందికొట్కూరు రూరల్‌, జూలై 5 : నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీ తండ్రినని పెత్తనం చెలాయిస్తే కుదరదని, వైసీపీ నాయకులను టీడీపీలోకి తెస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శుక్రవారం అల్లూరు గ్రామంలోని మాండ్ర నివాసంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, మండల కన్వీనర్లతో కలిసి ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ నంద్యాల ఎంపీ శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖరెడ్డి టీడీపీ కండువా కూడా కప్పుకోలేదని అన్నారు. గడిచిన ఎన్నికల్లో తన ఓటమికి పావులు కదిపిన వ్యక్తుల్లో ఆయన ఒకరని మండిపడ్డాడు.

టీడీపీ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ అవినీతిపరులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రసక్తే ఉండకూడదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టంగా తెలియజేశాడని గుర్తు చేశారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖరెడ్డి మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా నందికొట్కూరు వైసీపీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లను, వైసీపీ సర్పంచులను కొన్ని రోజుల నుంచిఅక్కున చేర్చుకుని టీడీపీ కండువా కప్పుతున్నాడని తెలిపారు.

వారంతా బైరెడ్డి సిద్దార్థరెడ్డి ముఖ్య అనుచరులని, వైసీపీలో ఉంటూ ఎన్నో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారని, వారి అవినీతి బయట పడుతుందని బైరెడ్డి రాజశేఖరెడ్డి వద్దకే వెళ్లి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వారేనని గుర్తు చేశారు. అలాంటి వారికి ఆశ్రయం ఇస్తే నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు క్షమిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుని నందికొట్కూరులో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరం ప్రసాదరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, కడియం వెంకటేశ్వర్లు, నారపురెడ్డి, కౌన్సిలర్‌ జాకీర్‌, లాయరన్‌ జాకీర్‌, టీడపీ కౌన్సిలర్‌ భాస్కరెడ్డి, ఓబుల్‌ రెడ్డి, శ్రీనివాసులు, పలుచాని మహేశ్వరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 09:47 AM