YS Sharmila: ఏపీకి జగన్ అందులో.. స్పెషల్ స్టేటస్ తెచ్చారు
ABN, Publish Date - Jan 29 , 2024 | 09:57 PM
సీఎం జగన్(CM JAGAN) ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేదు... కానీ మద్యంలో స్పెషల్ స్టేటస్ తెచ్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. నాసిరకం మద్యం తాగి చనిపోతున్న వారిలో ఏపీలో 25 శాతం పెరిగినట్లు తెలిపారు.
కర్నూలు: సీఎం జగన్(CM JAGAN) ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేదు... కానీ మద్యంలో స్పెషల్ స్టేటస్ తెచ్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. నాసిరకం మద్యం తాగి చనిపోతున్న వారిలో ఏపీలో 25 శాతం పెరిగినట్లు తెలిపారు. ఏపీలో మద్యం తాగిన వారందరూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంతో దోస్తీ చేసిన వారికే మద్యం టెండర్లు ఇస్తున్నారని.. మద్యం తాగి జనం చనిపోతే ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఏపీలో మద్యం అమ్మకాల లెక్కలపై ఎలాంటి విచారణ చేయలేదని చెప్పారు. కర్నూలులో సోమవారం నాడు షర్మిల పర్యటించారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి కప్పల నగర్ తనిశ్క్ ఫంక్షన్ హాల్ వరకూ షర్మిల భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... స్పెషల్ స్టేటస్, పోలవరం, రాజధానితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. వీటిని కాంగ్రెస్ సాధిస్తుందని.. అందుకనే కాంగ్రెస్‌కు ఓటేయాలని చెప్పారు. ఏపీ హక్కుల సాధన కోసం తన పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్లు తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తయిందని తెలిపారు.ఏపీలో ఘోరమైన పరిస్థితులను చూసి.. ఇచ్చాపురం నుంచి తాను జిల్లాల పర్యటన మొదలు పెట్టానని.. కర్నూలులో తన పర్యటనను ముగిస్తున్నానని షర్మిల తెలిపారు.
ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్యే, ఎంపీ సీటును కూడా బీజేపీ గెలవలేదని... కానీ ఏపీలో బీజేపీ రాజ్య మేలుతోందని ధ్వజమెత్తారు. ఏపీ బీజేపీ వశమైందని.. ఇందుకు కారణం జగనన్నే అన్నారు. ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఏపీకి రావాల్సిన వాటిని అడగకుండా జగన్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం చెప్పుకోవడానికి రాజధాని కూడా లేకుండా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు న్యాయ రాజధానిని చేస్తానని చెప్పారన్నారు.
రాజశేఖరరెడ్డి పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఏపీలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్నికల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారట... అలా అయితే నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నించారు. ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రాజశేఖరరెడ్డి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు. వైఎస్సార్ పాలనలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని.. మరి జగన్ హంద్రీనీవా ప్రాజెక్టు పది శాతం పెండింగ్ పనులను ఎందుకు పూర్తి చేయలేదని షర్మిల ప్రశ్నించారు.
Updated Date - Jan 29 , 2024 | 09:57 PM