Share News

వైసీపీ ‘సైకో ఫ్యాక్టరీ!’

ABN , Publish Date - Nov 08 , 2024 | 05:54 AM

‘ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా? సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తారా?’ అని జగన్‌ మూడు రోజులుగా వాపోతున్నారు.

వైసీపీ ‘సైకో ఫ్యాక్టరీ!’

సోషల్‌ మీడియాలో ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌

తాడేపల్లిలో మూలాలు.. గ్రామాల దాకా శాఖలు

సోషల్‌ సైకోల పని పట్టేందుకు... విషం చిమ్మే సర్పాల కోరలు పీకేందుకు..‘తాడేపల్లి’ మూలాల నుంచి శాఖోపశాఖలుగా స్తరించిన విషవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు రంగం సిద్ధమవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు... ఆ తర్వాతా సోషల్‌ మీడియా వేదికగా విచ్చలవిడిగా చెలరేగిపోతున్న వారిపై చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్లుగా నెలరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ సోషల్‌ మీడియా మూలాలు, విష ప్రచారం సాగించే తీరుపై పకడ్బందీగా వివరాలు సేకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా వైసీపీ ‘సోషల్‌’ అరాచకాలు సాగించే తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...

కూటమి నేతలు, కుటుంబ సభ్యులే టార్గెట్‌

కంటెంట్‌, పోస్టుల సృష్టికి ప్రత్యేక కేంద్రాలు

అక్కడి నుంచి వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌కు

దశల వారీగా గ్రామస్థాయికి చేరే పోస్టులు

సూత్రధారులు, పాత్రధారులను గుర్తించిన పోలీసులు

కఠిన చర్యలతో నెలలోనే కట్టడి చేసేలా ప్రణాళిక

పోక్సో, ఎస్సీ ఎస్టీ, మహిళా చట్టాల కింద కేసులు

15 వేల మందికి ‘లుకౌట్‌’ జారీకి రంగం సిద్ధం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా? సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తారా?’ అని జగన్‌ మూడు రోజులుగా వాపోతున్నారు. కానీ... ఆయన పార్టీ సోషల్‌ మీడియా చేసేది ప్రశ్నించడం కాదు! కూటమి నేతలపై కాలకూట విషం చిమ్మడం, వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా నీచమైన ఫొటోలు, వ్యాఖ్యలతో అవమానించడం! ఇదంతా... ఒకరకమైన ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌’ తరహాలో జరుగుతోంది. దీనికోసం వైసీపీ ‘సైకో ఫ్యాక్టరీల’ను ఏర్పాటు చేసింది. తాడేపల్లి వేదికగా ఎంపిక చేసే కంటెంట్‌... బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు విదేశాల్లోని ఫేక్‌ పోస్టుల ఫ్యాక్టరీలకు వెళుతుంది. అక్కడ... మార్ఫింగ్‌ ఫొటోలు, హేయమైన భాష, అసహ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులును తయారు చేస్తారు. అవి... వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌కు చేరుతాయి. అక్కడి నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లకు వెళ్తాయి. అక్కడి నుంచి 175 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, కో కన్వీనర్లకు చేరుతాయి. ఆపై మండల స్థాయికి, చివరగా... గ్రామ, వార్డు స్థాయుల్లో ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌లు, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పోస్టులు చేరవేస్తారు. ఇలా కొన్ని గంటల్లోనే పాతిక, ముప్పై వేల మందికి చేరుతుంది. ఆ పోస్టులపై కొందరు ఉన్మాదులు మరింత నీచమైన కామెంట్లు చేస్తారు. ఇందులో పచ్చి బూతులు, నీచ వ్యాఖ్యానాలను ఎంపిక చేసి... వాటిని జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయి సోషల్‌ మీడియా విభాగానికి పంపుతారు. వాటి ఆధారంగా మళ్లీ నీచ పోస్టులు తయారు చేసి సోషల్‌ మీడియాలోకి వదులుతారు. ఇదో... నిత్య కృత్యంలాగా సాగుతుంది.

అన్ని కోణాల్లో అష్ట దిగ్బంధనం...

సోషల్‌ మీడియాలో ఫేక్‌ కంటెంట్‌ ఎక్కడి నుంచి వస్తోంది.? ఆ ఫ్యాక్టరీ ఎక్కడుంది.? తయారీదారులెవరు? కంటెంట్‌ ఇస్తున్నదెవరు.? వాటిని ఎలా వైరల్‌ చేస్తున్నారు? ఆ వ్యక్తుల దినచర్య ఏమిటి? కుటుంబం, చదువు, ఆదాయం, సోషల్‌ మీడియా అకౌంట్లు, పరిచయాలు, పెడుతున్న పోస్టింగ్‌లు.... ఇలా అన్ని వివరాలను పోలీసులు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాతిక ముప్పై వేల మంది సైబర్‌ సైకోల ప్రొఫైల్స్‌ సేకరించారు. వైసీపీ సోషల్‌ మీడియా విష ప్రచారంలో సజ్జల భార్గవ రెడ్డి, ఇంటూరి రవి కిరణ్‌ కీలకమని పోలీసులు గుర్తించారు. వైసీపీ అధికారంలో ఉండగా... డిజిటల్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వ ధనంతో సోషల్‌ మీడియా విభాగాన్ని నడిపించారు. అధికారం కోల్పోయాక... సిబ్బంది సంఖ్యను తగ్గించుకుని నడిపిస్తున్నారు.


చట్టాల పరిధిలోనే కఠిన చర్యలు..

సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాల్లో బలమైన సెక్షన్లు లేవని, 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు పిలవాల్సిందేనని జగన్‌ రెడ్డి గగ్గోలు పెడుతున్నారు. అయితే... పోలీసులు దీనికి బలమైన విరుగుడు కనిపెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కుమార్తెలపై పిచ్చి వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన వారిపై ‘పోక్సో’ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే ఆ చట్టం వర్తిస్తుంది. అలాగే... మహిళలపై పెట్టిన పోస్టింగ్‌లకు సంబంధించి ‘క్రైమ్‌ అగెనెస్ట్‌ ఉమెన్‌’కు సంబంధించిన చట్టాలు, హోంశాఖ మంత్రి అనితపై పెడుతున్న వ్యాఖ్యలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.

15 వేల ఎల్‌వోసీలు...

సోషల్‌ మీడియాలో విష ప్రచారాన్ని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ సోషల్‌ మీడియాలో సుమారు ముప్పై వేల మంది భాగస్వాములు ఉండగా... వీరిలో 15 వేల మంది వరకూ ఉగ్రవాదుల తరహాలో చెలరేగిపోతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే వారందరినీ గుర్తించారు. వాళ్ల సోషల్‌ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టారు. దీనికోసం జిల్లాకు పది మంది చొప్పున ఓఎస్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ నిపుణులను నియమించారు. క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం మొదలుకాగానే ‘సైకో బ్యాచ్‌’ ఇతర ప్రాంతాలు, దేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే... కనీవినీ ఎరుగని రీతిలో 15వేల లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ)లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులను సైతం సంప్రదించి... విచారణకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. సైబర్‌ సైకోలను సోషల్‌ మీడియాలో ఫాలో చేసే వారికి 160 నోటీసు(సాక్ష్యం చెప్పడం) ఇచ్చి పోలీసు స్టేషన్లకు పిలుస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా నెల రోజుల్లోనే సోషల్‌ మీడియా విష వృక్షాన్ని పెకలించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

ఇది ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌’!

కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్నది కొందరు వ్యక్తులు చేస్తున్న పని కాదు! ఇది... ఒక వ్యవస్థ ద్వారా చేస్తున్న దుష్ప్రచారం. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కిందకే వస్తుందని పోలీసులు తేల్చారు. ఏదైనా పోస్టు వల్ల మనస్తాపం చెంది ఎవరైనా బలవన్మరణానికి పాల్పడినా, మరైదేనా అవాంఛనీయ ఘటన జరిగినా... ఇందులో భాగస్వాములైన వారందరిపైనా కేసు పెట్టవచ్చు. అంటే... ఒక్కపోస్టుతో మొత్తం వైసీపీ సోషల్‌ మీడియా విభాగంలో ఉన్న వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవచ్చు. ‘భారత న్యాయ సంహిత’లో దీనికి సంబంధించి బలమైన సెక్షన్లు ఉన్నాయి. ‘‘ఇది అమాయక గిరిజనులను బ్రెయిన్‌వాష్‌ చేసి... వారిచేత ఆయుధాలు పట్టించడంలాంటిదే. డబ్బు ఆశచూపించి, ఫేక్‌ కంటెంట్‌ను తయారు చేయించి, సోషల్‌ మీడియాలో పెట్టించడమూ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కిందికే వస్తుంది’’ అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 05:54 AM