Share News

శరణు.. శరణు..

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:22 AM

నిన్న మొన్నటివరకు టీడీపీ ముఖ్య నేతలు ఫోన్‌ చేసినా స్పందించని అధికారులు, అహంకారంతో రెచ్చిపోయిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రస్తుతం రూటు మార్చారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.

శరణు.. శరణు..

టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు క్యూ కడుతున్న అధికారులు

కార్యాలయాల వద్ద పెరిగిన రద్దీ

అదేబాటలో వైసీపీ ద్వితీయశ్రేణి

గతంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారిలో వణుకు

అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అన్న చందంగా సాగుతున్న వ్యవహారం

నిన్న మొన్నటివరకు టీడీపీ ముఖ్య నేతలు ఫోన్‌ చేసినా స్పందించని అధికారులు, అహంకారంతో రెచ్చిపోయిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రస్తుతం రూటు మార్చారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. పోస్టింగ్‌ల కోసం మండల, జిల్లాస్థాయి అధికారులు అనేక మంది తమకు తెలిసిన వారి ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల పరిధిలో కీలక అధికారులంతా క్యూకట్టి ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. అదేసమయంలో పలు నియోజకవర్గాల్లోని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రత్యేకించి ఆపార్టీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వారు ఇప్పుడు తమ శైలిని మార్చుకొని ఏదో ఒక మార్గంలో టీడీపీ ముఖ్యనేతలను మంచి చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒంగోలు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): గతంలో ఏపార్టీ అధికారంలో ఉన్నా అత్యధిక ప్రాంతాల్లో నేతలు ప్రత్యర్థులుగానే రాజకీయాలు నడిపేవారు. అయితే 2019లో జగన్‌హన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అందుకు పూర్తి విరుద్ధంగా పాలన సాగింది. కీలకమైన రెవెన్యూ, పోలీస్‌ శాఖలతోపాటు ఇతర అన్ని శాఖల అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని పాలన అంతా నడిపారు. అవినీతి, అరాచకం తప్ప అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం పట్టించుకోకుండా వైసీపీ నేతలు ఇష్టారీతిన వ్యవహరించారు. అధికార యంత్రాంగం కూడా వారికి జీహుజూర్‌ అంటూ పనిచేసింది. న్యాయబద్ధమైన పనులు కూడా సామాన్యులకు చేయకుండా నేతల సిఫార్సులకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇక వైసీపీలోని ద్వితీయశ్రేణిగా గుర్తింపు ఉన్న అనేక మంది అక్రమ సంపాదన, అరాచకమే లక్ష్యంగా చెలరేగిపోయారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేడర్‌, సానుభూతిపరులను ఆర్థికంగా ఇబ్బందిపెట్టడంతోపాటు పెద్దఎత్తున దాడులకు తెగబడటం ద్వారా వైసీపీ అధినాయకత్వం మెప్పు పొందే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ ప్రజానీకం ఏకపక్ష తీర్పును తాజా ఎన్నికల్లో ఇవ్వడంతో అటు వైసీపీ నేతలు, ఇటు వారి ఆగడాలకు వంతపాడిన అధికారులు, ఇతర ఉద్యోగులు కంగుతిన్నారు. తమ పార్టీ ముఖ్యనేతలు నడిచిన బాటలో ప్రస్తుతం గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పయనిస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళన వారిలో అధికంగా వ్యక్తమవుతోంది.

టచ్‌లోకి కార్పొరేటర్లు, మేయర్‌

పదవులను కాపాడుకునేందుకు ఒంగోలు కార్పొరేషన్‌లో మేయర్‌తోపాటు ఇంచుమించు సగం మంది కార్పొరేటర్లు టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. మార్కాపురంలో కౌన్సిలర్లు కూడా టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక ఒంగోలులో ఆందోళన చెందుతున్న వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులకు ఆపార్టీ ముఖ్యనేత భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడమే కాక గతంలో హడావుడి చేసిన వారిని కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనే సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అతిచేసిన వారంతా కొంతకాలం పొరుగు ప్రాంతాలకు వెళ్లడం మంచిదన్న భావనలో ఉన్నారు. మరికొంతమంది ‘పరిస్థితులకు అనుగుణంగా వైసీపీకి పనిచేశాం తప్ప మాకేమీ వైరం లేదు. ఎమ్మెల్యే జనార్దన్‌ను కలుస్తాం. అవకాశం కల్పించండి’ అని టీడీపీ ద్వితీయశ్రేణి నేతలను ప్రత్యేకించి ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని కోరుతున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

జిల్లా వదిలి వెళ్లిన వైసీపీ ముఖ్య నేతలు

తాజా ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోరంగా దెబ్బతింది. అంతేకాక వైసీపీ పాలనలో అత్యంత కీలక నేతగా మెలిగిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓట్ల లెక్కింపు నాల్గో వంతు కూడా కాకముందే హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అలాగే కొండపి, సంతనూతలపాడుల నుంచి పోటీచేసి పరాజయం పాలైన మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జునలు కార్యాలయాలు సైతం ఖాళీ చేసి అడ్రస్‌ లేకుండా వెళ్లడం ఆపార్టీ ద్వితీయశ్రేణి నేతల్లో, వారికి అండగా నిలిచిన అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతిగా వ్యవహరించిన కొందరు ఇప్పటికే జిల్లా వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. రాజకీయంగా ఇబ్బందులు పడతామని ఆందోళన చెందుతున్న మిగిలిన వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులు జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఏదోరకంగా టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రెండు రోజులుగా ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒంగోలులో అయితే అది మరింత అధికంగా ఉంది.

ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు

జిల్లా, మండలస్థాయి కీలక అధికారులు పోస్టింగ్‌ల కోసం టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను కలుస్తున్నారు. ఎన్నికల సమయంలో రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు పొరుగు జిల్లాలకు వెళ్లారు. వారంతా తిరిగి ఈ నెలలో జిల్లాకు రానుండగా మంచి పోస్టింగ్‌ల కోసం గతంలో పరిచయం ఉన్న నేతల ద్వారా ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. అలాగే నిన్నమొన్నటి వరకు ముఖ్యనేతల ఫోన్లకు స్పందించని స్థానిక అధికారులు ఏదోరకంగా ఇప్పుడు ఎమ్మె ల్యేలు, ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జిల్లా అంతటా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల ఇళ్ల వద్ద రెండు రోజులుగా వివిధ స్థాయి అధికారులు, ఉద్యోగులు వారికి సిఫార్సులు చేసే వారితో రద్దీ వాతావరణం కనిపిస్తోంది అదేసమయంలో వైసీపీ నేతల కన్నా మిన్నగా పార్టీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు, ఉద్యోగులు మాత్రం తమపై ఏరకమైన చర్యలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Updated Date - Jun 09 , 2024 | 01:41 AM